*శ్రీ శివపురాణ మాహాత్మ్యము**రుద్ర సంహిత - ప్రథమ (సృష్టి) ఖండము - (౧౦౭ - 107)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*వివిధ రకాలైన పువ్వులతో, అన్నములతో, నీటితో చేసే శివపూజ మాహాత్మ్యము*
*బ్రహ్మ, నారదుడు, రుషులు, దేవతలతో ఇలా చెప్పాడు -
*సంపదలను కోరుకునేవారు కమలము, బిల్వ పత్రము, శత పత్రము, శంఖ పూలతో శివపూజ చేయాలి. శివపూజ లక్ష పూలతో చేసినప్పుడు కోరిన ఫలితము వెంటనే కనిపుస్తుంది. రుషులు 20(౨౦) కమల పూలను ఒక ప్రస్థ ( నాలుగు శేర్లు లేక సుమారు 5 కిలోలు) గా లెక్క చెప్పారు. పదహారు ఫలములు ఒక ప్రస్థ గా చెప్పబడింది. ప్రస్థ లేక నాలుగు శేర్లు లేక 5 కిలోలు లెక్కింపు తో పూలను, పత్రాలను లెక్క వేసుకుని శివపూజ కు వినియోగించాలి. మనసులో కోరిక అనుకుని పైన చెప్పిన పూలు, పత్రాలను ఉపయోగించి శివపూజ చేస్తే సకామ పురుషునకు కోరిక వెంటనే ఫలిస్తుంది. ఏ కోరిక లేకుండా శివపూజ చేసిన పురుషుడు శివ స్వరూపుడు అవుతాడు.*
*మృత్యుంజయ మంత్రము అయిదు లక్షలు చేసిన సాధకునికి శివుని ప్రత్యక్ష దర్శనం అవుతుంది. ఒక లక్ష పూర్తి అయితే శరీరము శుధ్ధము అవుతుంది. రెండవ లక్ష కు పూర్వ జన్మ విషయాలు గుర్తుకు వస్తాయి. మూడవ లక్షకు కోరుకున్న వస్తువులు అన్నీ దొరుకుతాయి. నాల్గవ లక్షకు శివుడు స్వప్నంలో దర్శనం ఇస్తాడు. అయిదవ లక్షకు ఉపాసకుని ఎదుట అప్పటికప్పుడు శివ భగవానుడు ప్రత్యక్షంగా నిలబడతాడు. పదిలక్షలు పూర్తి చేస్తే సంపూర్ణ ఫలము కలుగుతుంది. మోక్షమును కోరుకునేవారు లక్ష దర్భలతో శివుని పూజించాలి. దీర్ఘాయిష్షును కోరేవారు దూర్వారములతో, సంతానము కోరేవారు ఉమ్మెత్త పూలతో, పేరు, యశస్సు కోరేవారు అగస్త్య (అవిసె) పూలతో, భోగమోక్షములు కోరేవారు తులసీ దళము లతో, ఎర్ర, తెల్ల జిల్లేడు, శ్వేత కమలములతో పూజించాలి. దాసాని పుష్పాలు, నల్ల అవాల పుష్పాలతో శివపూజ చేస్తే శత్రువులకు మృత్యువును ఇస్తాడు శంకరుడు. తెల్ల, ఎర్ర గన్నేరు పూలతో పూజ చేస్తే వస్త్రాలు ఇస్తాడు, రోగాలు పోతాయి. మంకెన పూలతో చేస్తే ఆభరణములు, జాజి పూలతో చేస్తే వాహనములు ఇస్తాడు భక్తవశంకరుడు. "అవిసె పూలతో మహాదేవుని పూజించినవాడు విష్ణుమూర్తి కి అత్యంత ప్రియమైన భక్తుడు అవుతాడు.*
*నల్లవావిలి పూలతో పూజ చేస్తే మనస్సు నిర్మలంగా అవుతుంది. ఏ ఏ రుతువులో, కాలములో దొరికే ఆ పూలతో శివపూజ చేస్తే మోక్షము లభిస్తుంది. ఏ పూలతో చేసినా, లక్ష పూలతో పూజ చేస్తే శివ భగవానుడు సంతుష్టుడు అవుతాడు. " చంపకము, మొగిలి పూవులను శివునకు సమర్పించ కూడదు". మిగిలిన ఏ పువ్వులతో అయినా శివపూజ చేసి మహాదేవుని సాక్షాత్కారం, మోక్షము రెండు పొందవచ్చు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు