*శ్రీ శివపురాణ మాహాత్మ్యము**రుద్ర సంహిత - ప్రథమ (సృష్టి) ఖండము-(౧౧౫ - 115)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*పరమేశ్వరుడు కైలాసము చేరి - సృష్టి ఖండమును ఉపసంహరించుట*
*బ్రహ్మ, నారదుడు, రుషులు, దేవతలతో ఇలా చెప్పాడు -*
*నారదా! పరాత్పరుడు అయిన శివుడు కుబేరునకు ధనాధిపతి అయ్యేలా వరము ఇచ్చి తన లోకానికి వెళ్ళాడు. రద్రడు బ్రహ్మ (నా) నుదుటి నుండి పుట్టాడు. సాక్షాత్తు శివుడే. ప్రళయాన్ని సృష్టి చేయగలవాడు. రుద్రుడుగా వున్న నేను(శివుడు) కైలాసమునకు వెళ్ళి కుబేరునితో కలసి వుండి తనతో స్నేహం చేస్తాను. ఆ పర్వతం మీద ఆధారపడి గొప్ప తపస్సు చేస్తాను. అప్పుడు రుద్రుడు తన ఢమరుకమును వాయిస్తాడు. ఆ ఢమరు నుండి వచ్చే శబ్దము అందరినీ తన వద్దకు రమ్మని పిలుస్తున్నట్టుగా వుంది. అప్పుడు, విష్ణువు, నేను, సకల దేవతలు, శివగణములు, రాక్షసులు, శివుని పార్షదులు, గణాధిపతులు అయిన గణపతులు అందరూ అక్కడ చేరారు. ఈ గణపతులు మహావిష్ణువు లాగా, నా లాగా ఇంద్రుని లాగా తేజో సంపన్నులు గా వున్నారు. అణిమాది సిద్ధులు వారికి సొంతము అయ్యాయి. వీరందరినీ చూచిన పరమాత్మ, విశ్వకర్మను పిలిచి వారి వారి అర్హత ప్రకారం వుండటానికి నివాసగృహాలు ఏర్పాటు చేయమన్నారు. విశ్వకర్మ తమ కొరకు ఏర్పాటు చేసిన వసతి గృహాల లో అందరూ సేద తీరారు.*
*తరువాత, మేమందరమూ పరమేష్ఠిని అనేక విధాలుగా, ఎన్నో సార్లు వివిధ రకాల పూజలు చేసి ప్రసన్నం చేసుకున్నాము. ఈ పూజలకు ఆనందించిన పార్వతీ పతి, మాకు అందరకు మా మా కోరికలను తీర్చి, అభీష్ఠములైన వస్తువులను ఇచ్చారు. తరువాత, సదాశివుని ఆజ్ఞ తీసుకుని మేము మా మా ఇళ్ళకు వెళ్ళాము.*
*శంభుడు సర్వ స్వతంత్రుడు. యోగపరాయణుడు. ధ్యానతత్పరుడు. పర్వతములలో గొప్పదైన కైలాస పర్వతం మీద కొంతకాలం ఒంటరిగా దీర్ఘమైన తపస్సు చేసుకుంటూ స్వేచ్ఛగా సంచరించాడు. ఆ తరువాత దక్ష ప్రజాపతి కుమార్తె దాక్షాయణి అనబడే సతీ దేవిని చేపట్టాడు. లోకాచార పరాయణుడుగా సతీదేవి తో గూడి ఆనందనాట్యం చేస్తూ ఆనందనిలయంలో కొలువై వున్నాడు.*
*కైలాసనాధుని లీలను ఏకాగ్ర మనస్సు తో విని ఆనందించిన వారికి, సకల శుభములు, ఇహలోక సౌఖ్యములు, పారలౌకిక మోక్షము తప్పక లభిస్తుంది.*
*రుద్రసంహిత లోని సృష్టి ఖండము సంపూర్ణము.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు