*శ్రీ శివపురాణ మాహాత్మ్యము**రుద్ర సంహిత - ద్వితీయ (సతీ) ఖండము-(౧౧౭ - 117)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*కామదేవుని పేర్లు - రతీదేవి తో వివాహము - సంధ్య చరిత్ర - చంద్రభాగ పర్వతము మీద సంధ్య తపస్సు*
*బ్రహ్మ, నారదుని ఇలా చెప్పాడు -*
*నారదా! నా మానసపుత్రిక అయిన "సంధ్య" కు ఒక రోజు కామభావము కలిగింది. అప్పుడు ఆమె ఇంకా బాలిక. "ఇటువంటి కోరికలు ఈ వయస్సు లో కలగడం సరికాదు. యుక్త వయస్సు వచ్చే వరకు భూమి మీద ఏ ప్రాణికీ కామభావం కలుగకుండా, బాల బాలికల మీద కామ దేవుని ప్రభావం వుండకుండా వుండేలా పరమేశ్వరుని అనుగ్రహం పొందడానికి గొప్ప తపస్సు చేసి, ఒక హద్దు నియమించి, నేను తనువు చాలిస్తాను" అని చెప్పి నా అనుమతి తీసుకుని తపస్సు కొరకు బయలు దేరింది, "సంధ్య".*
*ఆవిధంగా తపస్సు కోసం బయలుదేరిన సంధ్య, "చంద్రభాగా నది" పుట్టిన "చంద్రభాగ" పర్వతము మీదికి చేరుకుంది. చంద్రభాగ నది, పర్వతము మీది నుండి దక్షిణము వైపుకు ప్రవహిస్తోంది. ఈ చంద్రభాగ పర్వతము మీద వున్న, అన్ని సరోవర లక్షణములతో కూడిన "బృహల్లోహిత" అనే సరోవరము వద్ద కూర్చుని తపస్సు ఎలాచేయాలి అని ఆలోచిస్తోంది సంధ్య. బ్రహ్మ ఆజ్ఞతో మూర్తీభవించిన బ్రహ్మచర్యం లాగా, తేజోసంపన్నుడై కనిపిస్తున్న వశిష్టుడు, సంధ్యను వెతుకుతూ వచ్చి బృహల్లోహిత సరోవరం పక్కన కూర్చుని వున్న సంధ్యను చూచి ఆమె ఈ ప్రదేశానికి ఏ కారణంగా వచ్చింది అని అడుగుతాడు. తాను, బ్రహ్మ మానసపుత్రికననీ, తపస్సు చేయాలని వచ్చాననీ, కానీ తపస్సు యొక్క విధివిధానాలు తెలియకపోవడం వలన ఇలా కూర్చున్నాననీ, తనకు తపస్సు చేసే పద్ధతి చెప్పమని, వశిష్ఠుని అడిగింది, సంధ్య.*
*బ్రహ్మ విద్యలో శ్రేష్ఠడైన వశిష్ఠుడు సంధ్య తో " దేవీ! అన్నిటికీ ఆదిమూలమైన వాడు, పరమారాధ్యుడు, గొప్ప మహిమలు కలిగిన వాడు, ధర్మ, అర్ధ, కామ మోక్షము లకు కారణమైన వాడు అయిన శంభుదేవుని మనసు లో నిలుపుకుని, "ఓం నమశ్శివాయ ఓం" అని మౌనముగా జపము చేస్తూ తపస్సు చేయి. అందరి కోరికలనూ తీర్చే ఆదిశంకరుని ఈ మంత్రము తో మౌనముగా ప్రార్ధిస్తే, బ్రహ్మచర్య ఫలము లభిస్తుంది. ఈ తపస్సు కాలం అంతా నీరు మాత్రమే త్రాగి దీక్షగా వుండాలి. ఇలా జలాహారము తీసుకుంటూ చేసే మౌన తపస్సు, అన్ని కోరికలనూ తీరుస్తుంది. ఇది సత్యము. ఇదే సత్యము. సందేహము అవసరం లేదు. తప్పకుండా పరమేశ్వరుడు అనుగ్రహించి ఆ స్వామి నీ కోరికలను తీరుస్తాడు" అని చెప్పి వశిష్ఠుడు అంతర్ధానం అవుతాడు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు