జాదూ గాళ్ళు వున్నారు జాగ్రత్త...;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 అలా ఎవ్వరూలేరనుకున్నారా
అయితే మీరు పప్పులో కాలేసినట్టే... జాగ్రత్త మిత్రమా... జాగ్రత్త…
జాదు గాళ్ళు వున్నారు జాగ్రత్త!!!
చీటీలంటూ, చిట్ ఫండ్స్ అంటూ చందాలదందాలను చేస్తూ 
హుందాగా చలామణి అవుతున్న చిల్లర దొంగలున్నారు జాగ్రత్త...
ఆకాశాన్ని ఆశ చూపించి అమాంతం దాచుకున్న సొమ్మును దోచుకెళ్ళే 
కేటుగాళ్ళు ఉన్నారు జాగ్రత్త...
మాటలతోనే మంత్రాలు వేస్తూ
మోసాలను చేసే మాయగాళ్ళు
ఉన్నారు జాగ్రత్త...
జాగ్రత్త మిత్రమా...జాగ్రత్త!!!
బహుమతులంటూ, కూపన్ లంటూ, కుప్పలు తెప్పలుగా ఆఫర్ల మోతను మోగిస్తున్న 
ముసుగుదొంగలున్నారు జాగ్రత్త...
మధ్య తరగతి వాళ్ళనే లక్ష్యంగా చేసుకుంటూ, 
కల్లబొల్లి కబుర్ల కహానీలను చెపుతూ, మిత కాలంలోనే  
అమితమైన వసూళ్లను తేలికగా రాబడుతున్న రాబందులు వున్నారు జాగ్రత్త...
చేజిక్కిన మొత్తాన్ని చేతబట్టి
రాత్రికి రాతిరే దివాళా తీసే హవాలా గాళ్ళు వున్నారు జాగ్రత్త...
అందుకే దయచేసి అపరిచితుల మాటలను వినకండి...
అత్యాశలకు పోయి ఆపదలను కొని తెచ్చుకోకండి...
కష్టపడి దాచుకున్న ధనాన్ని
మాయగాళ్లకు ముట్టజెప్పి మోసాలకు గురికాకండి...
జాగ్రత్త మిత్రమా...జాగ్రత్త మరి!!!!

కామెంట్‌లు