అడగనా ఒక్కమాట ||;-మచ్చరాజమౌళి దుబ్బాక 9059637442
నిన్నటి ఆశలకు సజీవరూపాన్నిస్తూ
ఒలికిపోని కోరికలను ఆసాంతం అనుభవించినా
తృప్తికి నేడైనా తనివితీరలేదు

గడియ గడియకోసారి ముడివిప్పుతూనే
అంతరంగాన్ని శిథిలం చేస్తోంది
శిశిరం పెనవేసుకున్న ఆశల సౌధం
శిఖరం అంచులను తాకుతోంది
వెలుతురు పొలిమేరలను దాటుతున్నాననుకుంది
పాపం... పిచ్చిది, చీకట్లోకి కలిసిపోతున్నానని అనుకోలేదు

గుండె చప్పుడు, 
తనకెన్నిసార్లు విన్నవించినా 
విసుక్కోవడంలో విజయం తనదేనంది
మలినమైన పరిమళాన్ని పూసుకొని
నలుదిక్కుల వెదజల్లడమేమిటి.! 

అందుకే తనతో 
ఒక్కమాట అడగాలనుంది
మరొక్కమాట చెప్పాలని ఉంది

దేహంతో కప్పబడిన దాహాలు
వేయి తలలతో విషాన్ని పొదిగి వున్నాయి
సుడిగుండంలో చిక్కుతున్నావని
చికిత్సన్నదే లేనే లేదని
తృప్తి'కి ఒక్కమాట చెప్పాలనుంది

వణుకుతున్న శిథిలాన్ని
శిశిరం ఎంతసేపు మోయగలదు
గరళంలో దాగిన గడుసుదనం
గిరి గీసుకొని ఎన్నాళ్ళుండగలదు

మెఱిసే దేహసౌందర్యం చాటున గాయాలను దాచుకుని
తుప్పు పట్టించెడు శిలాఫలకపు భావాల సోయగాలను కమ్ముకుని
ఎన్నాళ్ళు మనగలవని
తృప్తి' తో ఒకమాట అడగాలనుంది... 


కామెంట్‌లు