పరస్పర సహాయం; - : సి.హెచ్. ప్రతాప్ సెల్ 91368 27102
 భరత ఖండం లో ఒక చిన్న రాజ్యానికి మగధ గుప్తుడు రాజుగా   వుండేవాడు. ఒక  రాజుకు  వుండాల్సిన శక్తి సామర్ధ్యాలు తక్కువగా వున్నా అహంకారం మెండు అతనికి.ప్రజాపాలన కంటే విందులు, వినోదాలతో తన ఆరుగురు భార్యలతో ఎక్కువగా  కాలక్షేపం చేయడం పై దృష్టి ఎక్కువగా పెట్టేవాడు. పాలన బాధ్యత అంతా మంత్రులపై వదిలి తన పరివారంతో హాయిగా భోగ భాగ్యాలు అనుభవిస్తుండేవాడు.

ఒకరోజు తన రాజ దర్బారులో కూర్చున్నప్పుడు, తన చుట్టూ ఉన్న మర్యాదపూర్వకమైన సభికులు మరియు తనను చూడటానికి వచ్చిన అనేక మంది ప్రజలను చూస్తుండగా, నేను ఈ రాజ్యానికే కాదు యావత్ భరత ఖండానికే చక్రవర్తిని. ఈ ప్రపంచంలోని ప్రజలందరూ నా సేవకులే . వచ్చే  అయిదేళ్ళలో ఈ ప్రపంచానంతటినీ జయించి విశ్వవిజేత అనిపించుకుంటాను. కాబట్టి దండయాత్రకు సర్వం సిద్ధం చేయండి. మంచి సుముహూర్తం చూసి యుద్ధానికి బయలుదేరుదాం " అని గర్వంగా ప్రకటించాడు.
ఆ మాటలు విన్న సభికులు ఆశ్చర్యానికి గురైతే, కొంతమంది ప్రజలు, ఒక చిన్న రాజ్యాన్ని సక్రమంగా ఏలడం చేతకానివాడు ఈ భరత ఖండాన్ని ఎలా జయించగలడు. అంతంత ప్రగల్భాలు పలకడం ఈ రాజుకే సాధ్యం" అని చెవులు కొరుక్కోసాగారు.
ఇంతలో  “మహారాజా, మీరు అనవసరంగా పొరబడుతున్నారు. మనుషులందరూ ఒకరికొకరు సేవకులు " అని ఒక  బలహీనమైన స్వరం చెప్పింది.
ఆ వ్యాఖ్యను అనుసరించి ఘోరమైన నిశ్శబ్దం అలుముకుంది. అక్కడ గుమిగూడిన ప్రజల సిరల్లో రక్తం గడ్డకట్టింది. అంత ధైర్యం చేసినవాడు ఎవరు అంటూ ఒకరివైపు మరొకరు చూసుకోసాగారు.
అప్పుడు రాజు కోపంతో విరుచుకుపడ్డాడు. " ఈ ప్రపంచానికే చక్రవర్తిని అయిన నన్నే ఇంకొకరికి సేవకుడిని అనే ధైర్యం ఎవరికి వచ్చింది" అంటూ హుంకరించడం ప్రారంభించాడు.
 
"నేనే రాజా ఈ మాటలు అనే దుస్సాహసం చేసింది" అంటూ జనం మధ్య నుండి తెల్లజుట్టుతో, శరీరం ఆపాదమస్తకం బలహీనతతో కంపిస్తున్న  ఒక ముసలి వ్యక్తి ముందుకు వచ్చాడు.
 
అందరి కనుబొమ్మలు ఆశ్చర్యంతో ముడిపడ్డాయి. మహామంత్రులు సైతం ధైర్యం చెయ్యలేని ఈ సమయంలో చావుకు సిద్ధంగా వున్న ఒక ముసలివాడు అంత ధైర్యంగా మహారాజుకు కోపం తెప్పించే మాటలు ఎలా అనగలిగాడు అంటూ ఆసక్తిగా చూడసాగారు.
 
“ఎవరు నువ్వు?” అడిగాడు రాజు.
 
"నేను నన్ను శేషయ్య అంటారు. మన రాజ్యానికి తూరుపు దిక్కున వున్న అగ్రహారంలో పౌరోహిత్యం చేసుకుంటూ బ్రతుకుతున్నాను. " అన్నాడు. "మా ఊరిలో మాకు నీళ్లు లేవు. అక్కడ బావి తవ్వమని అడగడానికి వచ్చాను."
 
"కాబట్టి నువ్వు బిచ్చగాడివి!" రాజు గర్జిస్తూ, ఆ వ్యక్తి వైపు తీక్షణం గా చూసాడు.. " ఒక బిచ్చగాడు నన్ను సేవకుడినని పిలిచేంత ధైర్యం నీకెక్కడిది ?

"మనమందరం ఒకరికొకరు సహాయం, సేవలు  చేసుకుంటాము," అని శేషయ్య అన్నాడు  ఎటువంటి భయం చూపకుండా, " ఈ రాత్రికి ముందు నేను దానిని మీకు నిరూపిస్తాను."
 
సరే అలా నిరూపించగలిగినట్లైతే మీఊర్లో ఏకంగా మూడు బావులు తవ్వించడం తో పాటు మీ మొత్తం కుటుంబానికి మొత్తం జీవితం సుఖంగా గడిచిపోయే ఏర్పాటు చేయిస్తాను, లేదంటే నీకు ఉరిశిక్ష తప్పదు" కోపంగా గర్జించాడు రాజు.

అలాగే రాజా, ముందుగా మీకు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకోనివ్వండి, రాజంటే భగవంతుడు తో సమానం. " అంటూ ముందుకు వంగి పాదాభివందనం చేయబోయాడు శేషయ్య.

" రాజా, కొంచెం ఈ ఊత కర్రను పట్టుకోండి" అని తన ఊతకర్రను రాజుకు ఇచ్చి కాళ్ళకు దణ్ణం పెట్టి" ఇప్పుడు తిరిగి కర్ర ఇవ్వండి రాజా" అన్నాడు శేషయ్య.
రాజు తిరిగి ఇచ్చిన కర్రను తిసుకొని" చూసారా రాజా, మనుష్యులు ఒకరికొకరు సహాయం చేసుకోవడమే జీవితం. ఇందులో రాజులకు కూడా మినహాయింపు వుండదని రుజువు చేసాను" నెమ్మదిగా అన్నాడు శేషయ్య.
 
రాజుతో పాటు అక్కడ వున్నవారికి ఎవరికి కూడా ఆ మాటలు అర్ధం కాలేదు.

అప్పుడు శేషయ్య" నేను మీ కాళ్ళకు మొక్కేందుకు  వీలుగా మీరు నా ఊత కర్రను అందుకొని నాకు సహాయం చేసారు. ఇదే విధంగా ప్రతీ మనిషీ మరొకరికి తనకు వీలైనంతగా సహాయపడుతుండడమే జీవన విధానం. అందుకు మీకు కూడా మినహాయింపు వుండదని రుజువు అయ్యింది" అందరికీ అర్థం అయ్యేలా విడమరిచి చెప్పాడు.
రాజ సేవకుడు శేషయ్య యొక్క తెలివి మరియు ధైర్యసాహసాలకు ఎంతగానో సంతోషించాడు, అతను శేషయ్య గ్రామంలో బావులు తవ్వడమే కాకుండా అతనిని సలహాదారుగా కూడా ఉంచుకున్నాడు.
 


కామెంట్‌లు