భాష తెచ్చిన బాధ;- ఎం. వి. సత్యప్రసాద్ , సెల్ ; 9398155633
 అమ్మ, నాన్నా, వెళ్లొస్తాం చెప్పి బయలుదేరాడు స్వామినాథన్, భార్య మీనాక్షి ని వెంటపెట్టుకుని . అత్తగారూ, మామగారూ వెళ్లొస్తాం అని చెప్పి  బయలుదేరింది మీనాక్షి స్వామినాథన్ తో జైపూర్ కి.  స్వామినాథన్ , చెన్నై లో ,   బ్యాంకు లో పనిచేస్తున్నాడు. స్వామినాథన్ తండ్రి ముత్తు స్వామి,  స్కూల్ హెడ్ మాస్టర్ గా చేసి రిటైర్ అయ్యాక కొడుకు తోపాటు తానూ ,భార్య అలివేలు,  కొడుకు దగ్గరే  ఉంటున్నారు .  కానీ ఇపుడు , స్వామినాథన్ కు,  ప్రమోషన్ మీద జైపూర్ కు,  ట్రాన్స్ఫర్ అయింది .  జైపూర్ లో,  బ్రాంచ్ మేనేజర్ గా,  జాయిన్ అవ్వాలి .
మన భాష కాదు , మన దేశం కాదు , ఎక్కడో రాజస్థాన్ లో జైపూర్ అంటే ఎంత దూరం , అంటూ బాధపడుతూనే ఇంతుంది స్వామినాథన్ తల్లి అలివేలు.   ఏం ఉద్యోగాల్లో ఏమిటో అంటూ ఉంటుంది అలివేలు. వాస్తవానికి,  స్వామినాథన్ తండ్రి,  స్కూల్ మాస్టర్ గానే ఎక్కువ కాలం పనిచేసి ,  రిటైర్ కాబోయే ముందు,  ఒక సంవత్సరం పాటు,  హెడ్ మాస్టర్ గా పనిచేశాడు. ఆస్తి ఏమీ , సమకూర్చ లేకపోయాడు. అబ్బాయిని MBA మాత్రం చదివించాడు. వాడి అదృష్టం బాగుంది,   వాడికి బ్యాంకు లో ఏ రెకమండేషన్ లేకుండా , లంచం ఇవ్వకుండా ఉద్యోగం వచ్చింది. తక్కువ ఆదాయం తో సంసారం నడుస్తోంది కాబట్టి,  ఏ నెల వచ్చే జీతం  ఆ నెల ఖర్చులకు సరిపోయేది. 
 
ఈ కారణం గానే ,  స్వామినాథన్ భార్య మీనాక్షి కూడా,  ఉద్యోగం కోసం,  బ్యాంకు పరీక్షలు రాస్తోంది. కానీ ఇంకా ఎక్కడా ఉద్యోగం రాలేదు.
 
స్వామినాథన్,  బ్రాంచ్ మేనేజర్ గా జాయిన్ అవటానికి ముందు,   ఒకసారి జైపూర్ వెళ్లి,  అక్కడ,   ఉండటానికి ఇల్లు చూసి వచ్చాడు. అదికూడా చాలా కష్టమైంది. స్వామినాథన్ కి హిందీ రాదు, అక్కడ  వాళ్లకు తమిళ్ రాదు. మనం ఇంగ్లీష్ లో మాటాడితే కూడా,  అర్థం కాదు.  పూర్తి,   హిందీ లోనే, మాట్లాడాలి.   బ్రాంచ్ లో, ఒక తెలుగు అతను, వేణు, అసిస్టెంట్ మేనేజర్ గా, పనిచేస్తున్నాడు .  అతనికి,  హిందీ వచ్చు కాబట్టి ,   అతనితో కలిసి,  ఇల్లు అద్దెకు,  తీసుకోవడం జరిగింది. 
 
చెన్నై లో,   ట్రైన్ లో,   సెకండ్ AC రిజర్వేషన్ దొరకడం వలన,  జర్నీ కా స్త బాగానే సాగింది .  పూర్తి,  పదిహేను గంటల పైనే ప్రయాణం. మీనాక్షి కి,  పొద్దున్నే నిద్ర లేవటం అలవాటు. అదేమాదిరిగా,  ట్రైన్ లో కూడా,  ప్రొద్దున్నే లేచి బ్రష్ కానిచ్చేసింది
 
కాఫీ కుర్రాడు ఎపుడొస్తాడా,   అని ఎదురు చూస్తుండగానే,   ఎక్కోడో,   చాయ్ చాయ్ అంటూ,   కేక వినపడింది.
 
కాఫీ ఉందా అడిగింది తమిళం లో .
వాడికి అర్థం కాలేదేమో,   వాడు చాయ్ చాయ్,   అంటూ వెళ్ళిపోయాడు
వాడు మళ్ళీ రిటర్న్ లో,   వచ్చాడు.
చాయ్ , అని పిలిచి ,  వన్ చాయ్ , అంటూ  సైగ చేసి చూపిస్తూ,  డబ్బులిచ్చి , అడిగింది మీనాక్షి
కుర్రాడు,  చాయ్ ఇచ్చాడు
తప్పదురా భగవంతుడా అని,  చాయ్ ఒక్క గుటక వేసడింది మీనాక్షి.  తనకు, పొద్దున్నే,  కాఫీ తాగలేదన్న బాధ.  సరేలే,  ఈ చాయ్ నే,  ఇంత దరిద్రం గా చేసాడంటే,  ఇంక ఆ కాఫీ ఎలా తగలబెడతాడో, అనుకుంది.    
ఏదో వేడి నీళ్లు తాగినట్లు ఉంది,  అనుకుంటూ,  కిటికీ లోంచి చూడ సాగింది.  బయటిగాలి మనకు తగలదు కానీ,  బయట ఉన్నవన్నీ,   మనకు కనబడతాయి.
వెనక్కి పరుగెత్తి వెళుతున్న స్తంబాలు, చెట్లు చూడసాగింది.  ఇంకా పూర్తిగా ఎండ  రాలేదు కాబట్టి,  బయట వాతావరణం,  చల్లగా ఉన్నట్లు అనిపిస్తోంది.
మొత్తానికి,   జైపూర్ రానే వచ్చింది.
స్వామినాథన్,   ప్లాట్ఫారం మీద ఎవరికోసమో వెతుకుతున్నాడు.
ఎవరికోసమండీ చూస్తున్నారు,   అడిగింది మీనాక్షి స్వామినాథన్ ని
వేణు అని,  మా ఆఫీసులో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు, అతను వస్తానన్నాడు చెప్పాడు స్వామినాథన్.  ఇంతలో వేణు కనబడ్డాడు .
గుడ్ మార్నింగ్ సర్ ! చెప్పాడు వేణు స్వామినాథన్ ను ఉద్దేశించి.
గుడ్ మార్నింగ్ !  చెప్పి వేణు కి పరిచయం చేసాడు మీనాక్షి ని.
నమస్తే ! చెప్పింది మీనాక్షి .
నమస్తే ! చెప్పి స్వామి వాళ్ళను బయటకు పిలుచుకు వెళ్ళాడు.
 
క్యాబ్ లో బయలుదేరి,  స్వామినాథన్ అద్దెకు తీసుకున్న ఇంటికి చేరారు ముగ్గురూ.     అదృష్టవశాత్తు,   వేణు వాళ్ళ ఇంటికి రెండు ఇళ్ల అవతల ఇల్లు దొరికింది,  స్వామినాథన్ కి .
ఇపుడే కాఫీ పంపిస్తాను సర్,  మీరు ఫ్రెష్ అవండి,  అని చెప్పి వెళ్ళిపోయాడు వేణు.
 
ఈ హిందీ,  ఒక్కముక్క కూడా అర్ధం కాదు,  అనుకుంటూ,  సూట్ కేసులు తెరవ సాగింది మీనాక్షి .  ఫ్రెష్ అయ్యి వచ్చేసరికే కాఫీ  రెడీ గా ఉంది
ఇక్కడ కాఫీ అంటే,  పాలలో BRU కాఫీ పొడి కలిపి ఇస్తారు,  అన్నాడు స్వామినాథన్  మీనాక్షి తో.
నవ్వుతూ కాఫీ మొదటి గుక్క తాగింది  మీనాక్షి.I
అబ్బా , ప్రాణం లేచి వచ్చిందండి , కాఫీ సూపర్ గా ఉంది , అంది కాఫీ తాగుతూ.
అవును మేడం, ఇక్కడ మనవైపులాగా ఫిల్టరుకాఫీ చెయ్యరు.  జస్ట్ పాలల్లో BRU పొడి కలిపి ఇస్తారు ,  అన్నాడు వేణు . 
మీనాక్షి కి ఫిల్టర్  కాఫీ తాగటం అలవాటు కాబట్టి , చాలా హ్యాపీ గా ఫీల్ అయింది .   కాఫీ  తాగటం ముగించి,  ఇక సామాన్లు సర్దటం మొదలు పెట్టింది మీనాక్షి. .  స్వామినాథన్ కూడా,  సాయం చెయ్యడం మొదలుపెట్టాడు.
 
స్వామినాథన్ కి బ్యాంకు లో,  భాష  తో పెద్ద గా సమస్య రావటం లేదు.  అక్కడ , తనతో పనిచేసే స్టాఫ్ కు,  ఇంగ్లీష్ లో చెప్పినా అర్థం అవుతోంది. స్టాఫ్ తో ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం రాదు.  ఆఫీసర్స్ కి మటుకు తాను చెబుతాడు.
మిగతాది వాళ్ళు చూసుకుంటారు. ముఖ్యం గా,  No 2  గా పనిచేస్స్తున్న వేణు,   చాలావరకు హెల్ప్ చేస్తున్నాడు.  వేణుకి  హిందీ , తెలుగు , ఇంగ్లీష్ భాషలు వచ్చు కాబట్టి,   ఒక రకంగా స్వామినాథన్,  వేణు మీదనే ఎక్కువగా ఆధార పడతాడు అనవచ్చు.  
 
వేణు,  జైపూర్ వచ్చి అయిదు ఏళ్ళు అయింది . ఇపుడు ప్రమోషన్ రావాల్సి ఉంది.  హైదరాబాద్ కు,  ట్రాన్స్ఫర్ కోసం  ప్రయత్నిస్తున్నాడు.  ఈ ట్రాన్స్ఫర్ పని మీద, ఇప్పటికి రెండు సార్లు,  ఢిల్లీ వెళ్లి వచ్చాడు , అందరూ హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ ఇవ్వడం కష్టమే అంటున్నారు.  చూడాలి ఏమవుతుందో .
 
స్వామినాథన్ , మీనాక్షి, ఇపుడిపుడే జైపూర్ కి , హిందీ భాషకి అలవాటు పడుతున్నారు. కానీ,  స్వామినాథన్ హిందీ నేర్చుకోవడం లో వెనక పడ్డాడు. మీనాక్షి మటుకు,  త్వరగా హిందీ నేర్చుకుంది. పని మనిషి, ఇస్త్రీ బండి వాడు, కూరలు , పక్కింటి ఆంటీ గారితో,  అందరితోనూ హిందీ లోనే మాటాడాలి . మొదట్లో, కొంచం కష్టమే అయినా మొత్తానికి పని సాధించుకుని వస్తోంది మీనాక్షి.
 
జైపూర్ వచ్చిన తర్వాత కూడా,   బ్యాంకు పరీక్షలు రాస్తోంది మీనాక్షి. జైపూర్ సెంటర్ తోనే రాస్తోంది.  ఈ ఊరికి రాకముందు,  ఒక పరిక్ష వ్రాసి,  ఇంటర్వ్యూ కి కూడా వెళ్లి వచ్చింది . తర్వాత ఉద్యోగం వస్తుందేమోనని,   ఎంతో ఎదురు చూసింది. కానీ రాలేదు. ఇక రాదులే,  అనుకుని దానిగురించి మర్చిపోయింది.
 
ఇంతలో ఈ  శుభ వార్త.  శుభవార్త అనాలో మరేమనాలో అర్థం కావడం లేదు. మీనాక్షి కి ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చింది చెన్నై లో.  జాయిన్ అవ్వాలంటే భర్తను వదిలి చెన్నై వెళ్ళాలి .
 
స్వామి కి,  ఫోన్ చేసి చెబుదామనుకుంది. స్వామినాథన్ ను స్వామి అని పిలుస్తుంది.  ఈరోజుల్లో,   భర్తను పేరు పెట్టి  పిలవటం మామూలు అయిపొయింది. రెండు సార్లు పిలిచి, ఎంతకూ  పలుకక పోతే , ఒరేయ్ అంటారేమో అనిపిస్తుంది.
 
ఎదురు చూస్తోంది మీనాక్షి స్వామి కోసం.
ఇంట్లోకి , వీధి గుమ్మం దగ్గరకి తిరుగుతోంది, ఈయన ఇంకా రాలేదే , అనుకుంటూ.
ఇంతలో బైక్ ఆగిన చప్పుడు.
స్వామి కి ఎదురు వెళ్లి,  బాగ్ , లంచ్ బాక్స్ అందుకుంది , ఇవాళ ఇంత ఆలస్యమైనదేం అంటూ.
లేదే,   రోజూ వచ్చే టైం కె వచ్చాను,  అన్నాడు స్వామి.
టైం చూసింది మీనాక్షి. కరక్టే,   ఆలస్యం కాలేదు , ఆయన కోసం ఎదురు చూడటం లో టైం కదలటం లేదు అనిపించింది
 
పని అయిపోయిందా లేక ఇంకా ఏమైనా హోమ్ వర్క్ చేసుకోవాలా, అంటూ కాఫీ కప్పుఅందించింది మీనాక్షి స్వామి కి.
ఎం, అలా అడిగావు,  అన్నాడు స్వామి,
స్వామి కాఫీ తాగటం పూర్తి అయ్యాక , ఆఫర్ లెటర్ వచ్చిన కవర్ అందించింది మీనాక్షి, స్వామికి.
ఆ లెటర్ పూర్తి చూసాక,  యెగిరి గంతేసినంత పని చేసాడు,  స్వామి.
"కంగ్రాట్యులేషన్" అంటూ మీనాక్షి ని ఎత్తుకుని గిర గిర తిప్పాడు.
దింపండి స్వామి,   అంటూ గోల పెట్టింది మీనాక్షి.
ఉండు స్వీట్ తెస్తాను,  అంటూ,  వెంటనే బండి తీసుకుని బయలుదేరాడు .  మళ్ళా తెచ్చిన స్వీట్ ను మీనాక్షి నోట్లో కుక్కి తినిపించాడు.
ఆయన సంతోషం చూసి,  తర్వాత ఎంత బాధ పడతారో,  అనుకుంటూ ఆలోచిస్తూ కూర్చుంది మీనాక్షి.
అప్పుడు ప్రశాంతంగా,  మరొక సారి ఆ లెటర్ ని చదివాడు స్వామి.
పోస్టింగ్ చెన్నై లో,     అన్నది మీనాక్షి.
ఓకే , అయితే ఏముంది అందులో,  అన్నాడు స్వామి.
మరి నేను అక్కడ జాయిన్ అయితే,  ఇక్కడ మీరు , అక్కడ నేను ఉండాలికదా అని, అంది మీనాక్షి.
ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి,  అన్నాడు స్వామి.
ఎటూ నేను వచ్చి రెండు ఏళ్ళు అయింది,  ఇంకొక్క సంవత్సరం ఓపిక పడితే,   నేనే చెన్నై కి ట్రాన్స్ఫర్ కి అప్లై చేస్తాను అన్నాడు స్వామి.
అంటే,  కనీసం ఒకటిన్నర సంవత్సరము , ఇక్కడ మీరు , అక్కడ నేను,  ఉండక తప్పదన్న మాట,  అంది మీనాక్షి
నీకు తోడుగా మా అమ్మ నాన్న ఉంటారులే,  అన్నాడు స్వామి.
మీరు ఉండరు కదా,   అంది మీనాక్షి.
నేనూ వచ్చేస్తాను గా , కొద్దీ గా ఓపిక పట్టాలి,  అన్నాడు స్వామి .
 
ఆరోజు హ్యాపీ గానే గడచి పోయింది కానీ,  దిగులుగానే ఉంది మీనాక్షి. 
బ్యాంకు పనితో బిజీ గా ఉండటం వలన,   మీనాక్షి లాగా,  దిగులుపడలేదు స్వామి.
 
చివరకు మీనాక్షి జాయిన్ అవ్వాల్సిన  రోజు,  వారంరోజుల్లోకి  వచ్చింది.  స్వామి, వారం రోజులు సెలవు పెట్టి,  మీనాక్షి ని తీసుకుని చెన్నై బయలుదేరాడు. నానా గోల చేస్తే గానీ, వారం రోజులు సెలవు దొరకలేదు. ఒక రోజు పోనూ , ఒక రోజు రానూ సరిపోతుంది. పొతే అయిదు రోజులు అక్కడ ఉండాలి .
నీ సర్టిఫికెట్స్ , ఫోటో, ఆధార్ కార్డు , మెడికల్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ అన్నీ పెట్టుకున్నావా  అని గుర్తు చేసాడు స్వామి, మీనాక్షి కి.
అన్నీ పెట్టుకున్నాను,   అంది మీనాక్షి.
ఇల్లు, వాకిలి , వంటిల్లు, సామాన్లు అన్ని అప్పగింతలు మొదలు పెట్టింది మీనాక్షి .
అవన్నీ నేను చూసుకుంటానులే అన్నాడు స్వామి.
ఏం చూసుకుంటారో ఏమో, కళ్ళజోడు ఎక్కడ పెడతారో గుర్తుండదు, సెల్ ఫోన్ మర్చి పోయి ఆఫీస్ కు వెళ్లి పోతారు,  పైగా అన్నీ చూసుకుంటాను అంటారు,  అనుకుంది మీనాక్షి మనసులో బాధతో.
ఇల్లంతా ఒక సారి కలియ చూసి , స్వామి ని వదల్లేక,  అటు చెన్నై లో తానూ ఈయన్ను వదిలి ఉండాలి అన్న దిగులు తో బయలుదేరింది,  ఈయనకు ఇవేమి పట్టలేదేమో , బయలుదేరే హడావిడి తప్ప,  మరేమీ కనబడటం లేదు, ఆయన ముఖం లో అనుకుంటూ .
 
చెన్నై చేరి,  రెండు రోజుల తర్వాత మంచి రోజు కాబట్టి , మంచి రోజు చూసుకుని ఆ రోజు న ఉద్యోగం లో జాయిన్ అయింది మీనాక్షి.
తాను జైపూర్ కి తిరిగి బయలుదేరే రోజు వరకు మీనాక్షి ని ఉదయం ఆఫీస్ దగ్గర దింపి, మరల సాయంత్రం వెళ్లి పిలుచుకు వచ్చేవాడు స్వామి.
 
ఇక ఆ రోజు బయలు దేరాలి,  స్వామి జైపూర్ కి.  సెలవలు అయిపోయాయి .
అప్పుడు స్వామి ముఖం లో దిగులు స్పష్టం గా కనబడుతోంది.
చేసేది ఏమీ లేక , సూట్ కేసు సర్ది , ఆటో రిక్షా ని పిలిచి బయలుదేరాడు స్వామి జైపూర్ కి.  ట్రైన్ లో ఉన్నాడే కానీ,  మనసంతా మీనాక్షి మీదే ఉంది.  మీనాక్షి జాయిన్ అయింది . ఇంకా తన ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నాలు చెయ్యాలి.
                                                            * * *
ట్రైన్ జైపూర్ చేరింది .
ఆటో రిక్షా మాటాడి ఇల్లు చేరాడు స్వామి. డోర్ ఓపెన్ చేసాక గానీ అర్థం కాలేదు,  మీనాక్షి లేని జీవితం ఎలా ఉంటుందో.  కానీ తప్పదు , ఇంకా ఎన్ని కస్టాలు పడాలో,  అనుకుంటూ బాత్రూం పనులు ముగించుకుని,  ఆఫీస్ కి వెళ్ళటానికి రెడీ అవ్వాలనుకున్నాడు స్వామి. 
స్వామి కి,  రోజూ పూజ చేసే అలవాటు ఉంది. క్రమం తప్పకుండ పూజ చేస్తాడు. పూజ కూడా పూర్తి చేసి,  ఆఫీస్ కి బయలు దేరాడు స్వామి.
 
ఆఫీస్ కి చేరాక,  వేణు ని పిలిచాడు స్వామి.
ఏంటి సార్,  అడిగాడు వేణు.
ఏంలేదు,   మీరు ట్రాన్స్ఫర్ కి అప్లై చేశారు కదా. ఏంటి పోసిషన్. అడిగాడు స్వామి.
మన డిపార్ట్మెంట్ప హెడ్ గారు,  ఫార్వర్డ్ చెయ్యాలి సర్. ప్రతి సారి,   ఢిల్లీ వెళితే గానీ పని అవదు, ఇప్పటికి,  రెండు సార్లు వెళ్లి వచ్చాను అన్నాడు వేణు . వేణుకి ఢిల్లీ లో పరిచయాలు బాగా ఉన్నాయి.
 
ఈసారి,  మీరు ట్రాన్స్ఫర్ పనిమీద వెళ్ళినపుడు చెప్పండి, నేనూ వస్తాను అన్నాడు స్వామి.
ఇపుడు సిట్యుయేషన్ బాగాలేదు సర్,   అన్నాడు వేణు.
ఏమైంది,  అన్నాడు స్వామి.
ఎక్కడంటే అక్కడ ధర్నాలు , స్ట్రైక్ లు జరుగుతున్నాయి. ఒక పక్క రైతులు రాస్తా రోకోలు జరుగుతున్నాయి. ఎప్పుడు ఎం జరుగుతుందో తెలీదు. మరొక పక్క సిక్కులలో నక్సలైయిట్స్ కలిసిపోయి,  బ్రతుకుతున్నారు.  ఎక్కడ ప్రజలను ఇబ్బంది పెడతారో, అని  ప్రజలు భయపడుతున్నారు . ఏంచెయ్యాలో అర్ధం కావటం లేదు,  అన్నాడు.
 
అయినా,  మనం పక్కాగా ప్లాన్ చేసుకుని బయలుదేరడానికి,  ఏరోజున ఆఫీస్ లో వర్క్ ఎలా ఉంటుందో,  తెలీడం లేదు,  అన్నాడు స్వామి.
మౌనంగా ఉన్నాడు వేణు.
 
ఆ రోజు,  ఆఫీస్ లో పని చాలా ఎక్కువగా ఉంది.  ఇంటికి వచ్చేసరికే,  తొమ్మిది అయింది.
మీనాక్షి లేని జీవితం,  నరక ప్రాయంగా ఉంది.  ఇంటికి వచ్చాక ఫోన్ చూడలేదు . అరగంట అయింది కానీ,  అలా సోఫాలో జాఱిగిలపడి  ఉన్నాడు. మరో పది నిముషాలు గడిచింది. ఇక తప్పదు,  అనుకుంటూ , స్టవ్ మీద కుక్కర్ పడేసాడు. వెళ్లి డ్రెస్ మార్చుకుని వచ్చి కూర్చున్నాడు.
కాళ్ళు కడుక్కోకుండా వచ్చి మళ్ళీ కుర్చున్నానని మీనాక్షి సణుగుతూనే ఉండేది.  ఎన్నడూ కోపం, విసుగు లేకుండా నెట్టుకొచ్చేది. ఇంకా థానే,  ఒక్కోసారి విసుక్కునే వాడు.  లోపల ఫీలయ్యేదో  ఏమో,  ఏమీ మాట్లాడేది కాదు.  తాను లేకపోయేసరికి,  తన విలువ తెలిసివస్తోంది,  అనుకుంటూ కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నాడు స్వామి.  ఎప్పుడూ,  ఏదో దిగులు , ఆలోచన ఎప్పుడూ,  ట్రాన్స్ఫర్ ఎలా చేయించుకోవాలి,  అన్నదానిమీదే ఉంటోంది.
 
                                                      * * *
మీనాక్షి,   కేకవేసింది మీనాక్షి అత్తగారు,  అలివేలు.
ఏంటండీ .. అడిగింది మీనాక్షి,  అత్తగారిని ఉద్దేశించి . 
ఏంలేదమ్మా,  స్వామి ఎమన్నా ఫోన్ చేశాడా .. అడిగింది అలివేలు. 
లేదండీ,   చెయ్యలేదు, నిన్న కూడా చెయ్యలేదు,   అన్నది మీనాక్షి. 
 
ఆలోచిస్తోంది మీనాక్షి , నేనున్నపుడే సరిగా తినేవారు కాదు. చూసి వడ్డించి,  తినడానికి కూడా పది సార్లు పిలవాల్సి వచ్చేది. ఇపుడు తిన్నారో,  లేక అలాగే వచ్చి పడుకునేశారో,  అర్ధం కావడం లేదు. వీడియొ కాల్,  చేసి కూడా,  నాలుగు రోజులు అయ్యింది,  అనుకుంటూ ఉండగానే ఫోన్ మోగింది.  ఈనే ఫోన్ చేస్తున్నారు,  అనుకుంది.
 
హలో,  అంది ఫోన్  తీసి మీనాక్షి.
హలో .. అటువైపు నుంచి స్వామి
ఎలా ఉన్నారండి ,  ఏమైనా తిన్నారా , అడిగింది మీనాక్షి
తిన్నాలే ఎలా ఉన్నావు .. అడిగాడు స్వామి .
ఏముంది మామూలే ..మీరు లేని జీవితం , ఇంకా ఎన్నాళ్ళో ఇలాగ, ఇప్పటికే రెండు సంవత్సరాలు  అయింది,  అంది మీనాక్షి .
దిగులు పడకు, వచ్చే వారం ఢిల్లీ వెళ్తున్నాను , ట్రాన్స్ఫర్ విషయం కనుక్కోవడానికి అన్నాడు స్వామి.
కాస్త,  వేణు గారిని హెల్ప్ చెయ్యమని,  అడగొచ్చు గదా,  అంది మీనాక్షి.
నేను వేణు తో మాట్లాడాను,  ఢిల్లీ వస్తానన్నాడు , కానీ,  ఢిల్లీ లో పరిస్థితులు బాగాలేదు , స్ట్రైక్ లు ధర్నాలు, గొడవలు.  చాలా గొడవలు గా,  ఉంది ఢిల్లీ . అయినా తప్పదు, వేణు ని  వెంటపెట్టుకుని వెడతాను,  అన్నాడు స్వామి .
 
జాగ్రత్త , టైంకి  తినండి , సరిగా నిద్రపోండి ,  అన్నది.  ఇపుడే,  అత్తగారు అడిగారు,  మీ ఫోన్ వచ్చిందా అని , ఇస్తాను,  లైన్ లో ఉండండి,  అంటూ ఫోన్ అత్తగారికి ఇచ్చింది.
అలివేలు,  ఫోన్ మాటాడుతోంది.
 
ఈలోపల,  ఆలోచనలో పడింది మీనాక్షి.  ఎన్ని ప్రయత్నాలు చేసి అయినా,  ట్రాన్స్ఫర్ చేయించు కోవాలి.  ఇప్పటికి రెండేళ్లు అయింది,  తాను స్వామిని వదిలి వచ్చి. కనీసం ఈ సంవత్సరం అయినా,  ట్రాన్స్ఫర్ ఇస్తే బాగుండు,  అనుకుంది.  ఎంత అత్తమామలు తోడు ఉన్నా,  ఈయన్ని వదిలి ఉండటం,  చాలా కష్టం గా ఉంది. ఏపని చేస్తున్నా,  5 నిముషాల్లో ఆలోచన ఈయనమీదకు  వెళ్తుంది.  ఏదో పరధ్యానం,  దిగులు .  అందరితోపాటు టీవీ చూస్తున్నప్పుడు , టీవీ చూస్తూనే ఉంటున్నా,  ఆలోచన ఈ ట్రాన్స్ఫర్ మీదకు వెడుతుంది. ఎన్నాళ్ళో ఈ బాధ,  అనుకుంటూ కూర్చుంది.
ఇంతలో అత్తగారు ఫోన్ తెచ్చి ఇచ్చింది.
హలో అనగానే , స్వామి,   నేను ఢిల్లీ వెళ్లి వచ్చి,  ఏ సంగతీ చెబుతాను,  అని చెప్పి ఫోన్ పెట్టేసాడు.
                                                                         * * *
వేణుతో కలిసి,  ఢిల్లీ వెళ్ళడానికి ప్లాన్ చేసాడు స్వామి.  కానీ,  ట్రైన్ టికెట్స్ ఖాళీ లేవు.  ఇరవై రోజుల తర్వాత గాని చెప్పలేం,  అన్నట్టు గా ఉంది.  రోజులు ప్రశాంతం గా ఉన్నపుడే,  వెళ్లి వొస్తే మంచిది అనుకున్నాడు స్వామి.  ఇదేమాట,  వేణు కి చెప్పాలని వేణు ని పిలిచాడు.
వేణు,  నా ట్రాన్స్ఫర్ విషయమై,  ఢిల్లీ వెడదామా, నువ్వు కూడా వస్తావా,  నీ ట్రాన్స్ఫర్ విషయం కూడా కనుక్కోవచ్చు,  అన్నాడు.
అలాగే, పరిస్థితి చూసుకుని వెళదాం  సర్,   అన్నాడు వేణు
అయితే,   ఇద్దరం, 2 రోజులు సెలవు పెడదాం , మరి ఇద్దరికీ,  అంటే ఇస్తారో ఇవ్వరో అన్నాడు.
సరే చూద్దాం ఎలా ఉంటుందో, అని,  పనిలో పడ్డారు ఇద్దరూ.
                                      
                                                                           * * * *
శనివారం నాడు,  వేణు ని పిలిచాడు  స్వామి .
ఏంటి సార్,  అంటూ వచ్చాడు వేణు.
ఎల్లుండి సోమవారం,  మనం ఢిల్లీ మన ఆఫీస్ కి,  వెడదాం. రేపు రాత్రి ట్రైన్ కి బయలుదేరుదాం,  అన్నాడు స్వామి
రిజర్వేషన్ లేదు కదా సార్,  అన్నాడు వేణు.
లేదు,   కానీ జనరల్ బోగీ లోనైనా వెళదాం,  తప్పదు,  అన్నాడు స్వామి
ఇక మాట తీసెయ్యలేక సరే అన్నాడు వేణు.  సరే అన్నాడే కానీ,  ఢిల్లీ చేరే దాకా, చేరాక కూడా ,  మొత్తం తానె  చూసుకోవాలి.  ఈ స్వామి గారికి హిందీ అస్సలు రాదు, అందులో ఢిల్లీ లో వాళ్ళు పంజాబీ కలిసిన హిందీ మాట్లాడుతారు,   అనుకుంటూ పని చేసుకుంటున్నాడు.
ఆదివారం రాత్రి స్వామి, వేణు,  ఇద్దరు ఢిల్లీ వెళ్ళడానికి,  స్టేషన్ కి వచ్చారు .
ఆటో దిగి, ఏంటి చాలా రష్ గా ఉందే ఇవాళ,  అన్నాడు స్వామి వేణు తో,  ఆటో అబ్బాయికి డబ్బులిస్తూ.
ఇవాళ రైతులందరూ,  ధర్నా చెయ్యడానికి ఢిల్లీ పోతున్నారు సర్,  అన్నాడు ఆటో రిక్షా అబ్బాయి.
చచ్చాంరా  దేవుడా,  అనుకుంటూ,  రైల్వే స్టేషన్ లోకి వెళ్లారు వేణు, స్వామి
పోనీ,  రేపు వెల్దామా సార్,   అన్నాడు వేణు,
లేదులే,   ఎలాగోలా ఇవాళే వెళ్ళిపోదాం,   అన్నాడు స్వామి.
ప్లాట్ఫారం మీదకు వచ్చారు ఇద్దరూ.  కాసేపటికి ట్రైన్ వచ్చింది. బోగీ లోకి ఎక్కడమే కష్టం అవుతోంది. కానీ,  ఎలాగోలా తోసుకుంటూ లోపలి వెళ్లారు . కూచునే చోటులేదు. నిలబడే వెళ్లాల్సి వచ్చేటట్లుంది. బ్రీఫ్ కేసు పెట్టె చోటు కూడా లేదు. ఒకళ్ళకి ఒకళ్ళు అతుక్కుని నిలబడ్డారేమో,  అన్నట్టు ఉంది బోగి. చివరికి లెట్రిన్ లో కూడా నిలబడ్డారు. 
స్వామి బ్రీఫ్ కేసు ఒకతనికి తగులుతోంది.
బ్రీఫ్ కేసు తియ్యి,  అని హిందీలో చెప్పాడు  అతను.  కానీ స్వామి కి అర్ధం కాలేదు. స్వామి వేణు వైపు చూసాడు.
అతను,  హిందీలో చెప్పిన మాట,  స్వామి కి  ఇంగ్లీష్ లో  చెప్పాడు వేణు.
కాసేపయ్యాక,   రష్ లో,  బ్రీఫ్ కేసు మళ్ళీ అతనికే , తగిలింది , అతను మళ్ళీ చెప్పాడు,  బ్రీఫ్ కేసు సరిగా పట్టుకోండి, తగులుతోంది, అని .
కొంచం లోపలి రండి సార్,  ఇక్కడ కొంచం ఖాళీ ఉంది,  అన్నాడు వేణు.
ముందుకు వచ్చే ప్రయత్నం లో,  బ్రీఫ్ కేసు,  మళ్ళీ అంథుముందు తగిలిన అతనికే తగిలింది.  అతను కోపంతో బ్రీఫ్ కేసు ని,  వెళ్తున్న రైల్లోంచి,  బయటకు పారేసాడు .  స్వామి, వేణు లకు, ఇద్దరికీ,  అసలు అర్ధం కాలేదు,  ఏంచెయ్యాలో.  ఇపుడు జర్నీలో, ఎక్కడ ఉన్నామో కూడా తెలీదు.  బయట అంటా చీకటి. ట్రైన్ మంచి స్పీడ్ లో వెడుతోంది.  బ్రీఫ్ కేసు ఎక్కడ పడిందో తెలీదు. టైం షుమారు రాత్రి ఎనిమిది అయి ఉండొచ్చు.
ట్రైన్ లో,  ఇక ఖంగారుగా " చైన్ లాగండి " అన్నాడు వేణు హిందీలో.
ఎవ్వరూ పట్టించుకోలేదు,  వేణు మాటని. 
స్వామికి,  ఎం చెయ్యాలో అర్ధం కాలేదు. మిగిలిన వాళ్ళు అందరూ, అక్కడ ఏమీ జరగనట్టుగా,  మామూలు గా చూస్తున్నారు.
ఇంతలో " ఏమిటండీ , అలా బయట పారేస్తారేంటి " అని ఆ పారేసిన అతన్ని అడిగాడు వేణు హిందీ లో.
అతను హిందీ లో బూతులు తిడుతూ,  వేణు మొహం మీద,  గట్టిగా కొట్టాడు చేత్తొ . వేణుకి నుదిటిమీద తగిలింది దెబ్బ.  కానీ గట్టిగానే తగిలింది.  నెత్తురు బాగా కారుతోంది.  కొట్టినతనికి ఒక స్టీలు తో చేసిన కంకణం, ఆడవాళ్లు వేసుకునే గాజు లాటిది ఉంది తొడుక్కొని ఉన్నాడు . అదీకూడా అంచు చాలా పదును గా ఉంది.  ఎవరినైనా కొట్టడానికేనేమో అన్నట్టు ఉంది.
ఓ ఇద్దర్ని నెట్టుకుని, ముందుకు వచ్చి,  జేబులో కర్చీఫ్ తీసి,  వేణు నుదుటిమీద పెట్టాడు స్వామి . కుట్లు పడేటంత దెబ్బ కాదు కానీ,  దెబ్బ గట్టిగానే తగిలింది. ఏంటో ఈ మనుషులు,   అర్థం కావటం లేదు, అనుకున్నాడు స్వామి .  స్వామి కి భాష రాదు మాట్లాడటానికి.
అయిదు నిముషాల తర్వాత స్టేషన్ వస్తే, వేణు, స్వామి ఇద్దరూ దిగేసి అక్కడ ఉన్న రెయిల్వే హాస్పిటల్ లో, డాక్టర్ కి చూపించి, కట్టు కట్టించారు వేణుకి.  నెమ్మదిగా బయటకు వచ్చారు.
నేను పట్టాల వెంట వెళ్లి చూసి వస్తాను,   అన్నాడు స్వామి వేణుతో.
వద్దు సార్,   నేనూ వస్తాను,  నెమ్మదిగా వెళదాం,   అన్నాడు వేణు.
అలా దెబ్బ తగిలి,  ఎలా వస్తావ్ , ఉండు నేను చూసి వస్తాను అన్నాడు స్వామి.
కానీ,  వినకుండా బయలుదేరాడు వేణు.
నెమ్మదిగా, పట్టాలవెంట నడవటం మొదలుపెట్టారు ఇద్దరూ.
చాలా చీకటి గా ఉంది. ఒక పక్క ట్రైన్ వస్తుందేమోనని,   సిగ్నల్స్ చూసు కోవాలి.
బ్రీఫ్ కేసు ఎక్కడ పడిందో , బ్రేక్ అయిందో, ఎలా ఉందొ,  అనుకుంటూ ముందుకు వెళ్లారు.   అలా రెండు గంటలపాటు నడుచుకుంటూ వెళ్ళాక,  బ్రీఫ్ కేసు దొరికింది. అదృష్టవశాత్తు లాక్ ఓపెన్ అవలేదు, బ్రేక్ అవలేదు.
కానీ,  కేవలం బ్రీఫ్ కేసు తగులుతోంది, అన్న కారణంగా,  వెడుతున్న రైలు లోంచి, అలా విసిరేయడం దారుణం.  ఎవరూ అడిగే వారు లేరు.  ఎవరికి ఏది ఎలా అనిపిస్తే,  అలా చేయవచ్చా,  అనుకుంటూ నడుస్తున్నారు వేణు, స్వామి ఇద్దరూనూ.
 
అప్పటికి టైం రాత్రి రెండు అయింది.  దూరంగా ఎదో ఊరు కనబడుతోంది . నెమ్మదిగా అక్కడికి నడుచుకుంటూ వెళ్లారు.  అక్కడ,  ఆ రాత్రి గడపడానికి,  లాడ్జీ దొరకడం కూడా కష్టమే . చివరికి,  వెతికి,  ఒక లాడ్జి లో చోటు సంపాదించి,  ఆ రాత్రి కాలక్షేపం చేసి, మరుసటి రోజు కార్ బుక్ చేసుకుని,   ఢిల్లీ బయలుదేరారు.
ఢిల్లీ ఆఫీస్ లో,  వేణు తనకు పరిచయం ఉన్నవాళ్లందరికీ,  స్వామి ని పరిచయం చేసాడు. రెండురోజుల్లోనూ,  ఇద్దరూ,  వాళ్ళ పని పూర్తి చేసుకుని , తిరుగు ముఖం పట్టారు.  అదృష్టం ఏమంటే,   వేణు, స్వామి,  ఇద్దరికీ వాళ్ళు కోరిన విధంగా,  ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చ్చాయి. ఇద్దరి కళ్ళలోనూ ఆనందపు జల్లులు కురిశాయి.

కామెంట్‌లు
Shyam Kumar chagal చెప్పారు…
Natural గా అద్భుతంగా రాశారు.
Priyanka చెప్పారు…
ఈ కథలో భాష బాధని తెచ్చింది కానీ,కథలో సారం వల్ల, భాషతో బాధ కనపడలేదు. కథ చాలా బాగుంది. పేరు మరేదైనా పెట్టుంటే బాగుండేది.
Priyanka చెప్పారు…
ఈ కథలో భాష బాధని తెచ్చింది కానీ,కథలో సారం వల్ల, భాషతో బాధ కనపడలేదు. కథ చాలా బాగుంది. పేరు మరేదైనా పెట్టుంటే బాగుండేది.
సత్తి పద్మ చెప్పారు…
కథ చాలా బాగా రాశారు. నిజంగా జరిగిందేమో అన్నంత సహజంగా ఉన్నాయి సంఘటనలు, సంభాషణలు.