తాజా గజల్ ;--ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
అమ్మాయి చేతిలో అమరింది  గోరింట 
అపురూప దృశ్యమై మెరిసింది గోరింట 

సెగలుతో పొగరుగా గ్రీష్మమే వెళ్ళింది 
ఆషాడ చినుకల్లె నవ్వింది గోరింట 

నవవధువు మదిలోన నాట్యమే చేసింది 
విరహాల వెన్నెలలు కాచింది గోరింట 

పెళ్లింట బాజాలు సంగీత సందళ్ళు 
మెహందీ వేడుకై అలరింది  గోరింట 

మత్తుగా వీచేను మరిపూల గంధాలు 
గమ్మత్తు  అరచేత అద్దింది గోరింట 

ఎన్నెన్ని ఆకృతులు పూలతలు పెనవేయు 
గుల్ మొహర్ గుత్తులై గునిసింది గోరింట 

నెలరాజు  ఒదిగాడు అతివలకు అరచేత
శీతలం పంచుతూ సొచ్చినది గోరింట 

పారాణి పాదాలు తనపతియె ముద్దాడు 
కుంకుమా పువ్వల్లె కులికింది గోరింట 

భారతికి గురుతైన చీరలూ నగలు ఉమ  
పూలజడ తోడుగా పూచింది గోరింట !!


కామెంట్‌లు