మార్పు;--: సి.హెచ్.ప్రతాప్
 మగధ దేశాన్ని విక్రమ గుప్తుడు జనరంజకంగా పరిపాలిస్తున్నాడు.ప్రజలందరినీ కన్నబిడ్డలవలె చూసుకోవడం తో పాటు ధర్మాచరణ తు చ తప్పకుండా పాటిస్తుండడం వలన అతని రాజ్యం ఎప్పుడు సుభిక్షంగా వుండేది. ప్రజలెన్నడూ అకాల మరణాలు, అనారోగ్యాలు, కరువు కాటకాల బారిన పడకుండా రాజు అండదండలతో ఆనందంగా బ్రతికేవారు. త్రేతాయుగం నాటి రామ రాజ్యాన్ని విక్రమగుప్తుడు తిరిగి మగధ రాజ్యం లో స్థాపించాడని మిగతా దేశాల రాజులు అతగాడిని వేనోళ్ళ శ్లాఘిస్తుండేవారు.
అటువంటి దయాళువు అయిన విక్రమగుప్తుడికి అనేక యజ్ఞ యాగాదుల కారణంగా లేక లేక  ఒక కొడుకు పుట్టాడు.  అనుకోని పెన్నిధి దొరికినంత  సంబరపడిపోయిన ఆ రాజ దంపతులు అతడికి జయ గుప్తుడు అనే పేరు పట్టి అల్లారుముద్దుగా పెంచుకోసాగారు. అయితే మితిమీరిన గారాబం వలన జయ గుప్తుడు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. అంతే కాకుండా బద్ధకం, నిర్లక్ష్యం, కోపం, అహంకారం, దురుసుతనం, భోగ భాగ్యాల పట్ల తీవ్ర లాలసత వంటి దుర్గుణాలతో పాటు విద్యాభ్యాసంలో తీవ్రంగా వెనుకపడ్డాడు. తరచుగా వేటకు వెళ్ళి జంతువులను చంపడం, రాజ్యంలో పర్యటిస్తూ ప్రజలను అకారణంగా హింసించడం   చేస్తుండేవాడు. యువరాజు వ్యవహారం, ప్రవర్తనలను మార్చలేక మహారాజు తల పట్టుకుని కూర్చున్నాడు. ఎందరు గురువులను నియమించినా వారు యువరాజు ప్రవర్తనలో కించిత్తయినా మార్పు తీసుకు రాలేకపోయారు.
ఒకరోజు ఆ  రాజ్యం  లోకి ఒక సాధువు వచ్చి రామాలయంలో బస ఏర్పాటు చేసుకొని ధార్మిక ప్రవచనాలు , సద్గోష్టి చేస్తున్నారని, అతనెంతో తప: సంపన్నుడని, ప్రజల సమస్యలకు శ్రీఘ్రమే పరిష్కారాలు సూచిస్తున్నారని వేగులు సమాచారం తెచ్చారు. వెంటనే మగధ గుప్తుడు రాణితో కలిసి వెళ్ళి సాధువును దర్శించుకొని తన సమస్యను సవినయంగా విన్నవించుకున్నాడు. అందుకు సాధువు తాను వచ్చి రాజప్రసాదంలో ఒక నెలరోజులు నివసిస్తానని అందుకు ఏర్పాటు చెయ్యమని చెప్పారు.
అనుకున్న ప్రకారమే సాధువు రాజమహల్ లో తన అనుష్టానం ప్రారంభించారు. ఒకరోజు జయ గుప్తుడి తో కలిసి ఉద్యానవనంలో నడుస్తున్నారు. అప్పుడు ఆ సాధువు అక్కడ వున్న ఒక మొక్క నుండి కొన్ని ఆకులు తుంచి జయగుప్తుడికి ఇచ్చి " ఇవి మంత్రించిన ఆకులు. వీటిని తింటే సత్వరమే తెలివితేటలు, ధైర్య సాహసాలు, ఆరోగ్యంతో పాటు దీర్ఘాయుస్షు కూడా కలుగుతుంది" అని చెప్పారు.
ఆత్రంగా వాటిని నోటిలో వేసుకున్న జయ గుప్తుడు అసహ్యంగా ముఖం పెట్టి  థూ అని ఉమ్మేశాడు. నా జీవితంలో ఇంతటి అసహ్యకరమైన పదార్ధాన్ని ఇప్పటివరకు తినలేదు" అని అన్నాడు.
అందుకు సాధువు నవ్వి" ఎంతో మేలు చేస్తుందని చెప్పినా ఆ ఆకులను నువ్వు తినలేకపోయావు. అంతే కాకుండా మేలు చేసేవి ఎప్పుడు తియ్యగానే ఉండాలన్నది నీ అభిప్రాయం. నీ అభిప్రాయానికి వ్యతిరేకంగా ఏమి జరిగినా నువ్వు సహించలేవు. పైగా ఇంత చిన్న మొక్కగా వున్న ఆకులు అంత చేదుగా ఉంటే , ఇక పెద్దయ్యాక అవి ఇంకెంత చేదుగా వుంటాయో కదా. తమ ప్రవృత్తి కారణంగా అవి తన చెట్టుకు, చెట్టు జాతికి ఎంత చెడ్డ పేరు తీసుకొస్తున్నాయో కదా ! ఆ మొక్క ప్రవృత్తి కూడా అచ్చంగా నీ లాగా వుంది." అని అన్నారు.
ఆ మాటలు జయ గుప్తుడి మనస్సులో నేరుగా నాటుకున్నాయి. ఆ బాణాలు తనపైనే సాధువు ప్రయోగించారన్న విషయం అర్థమయ్యింది.
తను ఇంకా చిన్నవాడిగా వున్నప్పుడే తన ప్రవర్తన ఇంత చేదుగా, అభ్యంతరకరంగా వుంది. పెద్దవుతున్న కొద్దీ ఆ ఆకులలోని చేదు తనం వలే తన దుర్గుణాలు కూడా పెరుగుతూనే వుంటాయి. అవి ఇక పెద్దయి రాజ్యభారం చేపట్టేనాటికి ఇంకెంత ఆమోదయోగ్యం కాని విధంగా వుంటుందో కదా !ఆ ఆకులు చెట్టుకు చెడ్డ పేరు తెచ్చిన విధంగా తాను కూడా తన రాజ వంశానికి చెడ్డపేరు తీసుకు రావడం తధ్యం.
విషయం అర్ధమయ్యేసరికి జయ గుప్తుడు జ్ఞానోదయ మయ్యింది. నాటి నుండి తన ఆలోచనా విధానం తో పాటు ప్రవర్తన కూడా మార్చుకొని కొంతకాలానికి మంచివాడని పించుకున్నాడు.    
సి హెచ్ ప్రతాప్ 

కామెంట్‌లు