వాన//;-జయశ్రీ /
గుర్తుపట్టావా...?
బిడియపడే స్పర్శకి అంటించుకున్న  వలపురంగు 
తెల్లగా నవ్వుకున్న నువ్వు 
నీలమైన నా సిగ్గు 

కౌగిలికొచ్చిన ఆలోచన అమాంతంగా
వెనకనుంచి నీ మీదుగా చుట్టేసిన నా చేతుల జల్లుని
గుర్తుపట్టావా..?

ఇలాగే కురుస్తున్నట్టు లేదూ..
దగ్గరతనం ఒరిగిపోయేంతగా విసిరికొడుతూ గాలి,
తప్పదంటూ   చెట్టు చినుకుల గొడుగు కింద ఆగిన సమయం

మళ్ళీ ప్రయాణం 

పంతంగా పెరిగిన వానకి ముద్దంగా చిక్కిన మనం
వెక్కిరిస్తున్న చలిగింత

తుమ్మెదరెక్కలు తడిచి వణుకుతున్నట్టుందంటూ 
నీరుగారుతున్న ముంగురులుని నా మెడవంపుమీదుగా
నెడుతున్న నిన్ను, మెత్తగా చూస్తున్న నన్ను ,
చుట్టుూ జనం చూపుల్లా చురుక్కున విసిరిన గాలిచినుకు

రోడ్డు పక్కన పాకలో   
నవ్వు కాలుస్తున్న సిగరెట్ ని వినసిరికొట్టి,
వేడిగా ఛాయ్ తాగుదాం  దా అన్నపుడు ,
ఉక్రోషంతో  వేడెక్కిన నీ చూపులకి 
ఆరిపోయిన చున్నీ..,వెలిసిపోయిన వాన
వస్తున్న నవ్వుని ఆపుకోలేక నేను..ఊగిపోయిన మేను

ముచ్చటగా చూసి నల్లమబ్బు కమ్ముకొచ్చి దిష్టితీసి పోలా...?

మెరుస్తూ..కలుస్తూ..ఉరిమి ఉరిమి ఉప్పెనైనవలపు  కళ్ళని హత్తుకున్న నీ రూపు 
మెత్తగా లాలిపాడుతూ ఒత్తిగిలిన చీకటి

అదే కదా మళ్ళీ కురుస్తుంది ..నా కంటిముందు 
నీ ఇంటిముందూ...!

                        

కామెంట్‌లు