అందులో దాక్కున్నావేంటీ?; -- యామిజాల జగదీశ్
 ముల్లా ఇంట్లోకి ఓ అర్ధరాత్రి ముగ్గురు దొంగలు జొరబడ్డారు. వారిని చూడటంతోనే భయమేసిన ముల్లా ఓ మూల ఉన్న ఓ పెద్ద ట్రంకుపెట్టెలో దాక్కున్నాడు. అది చాలా పాత పెట్టె. అది తాతముత్తాతలనాటి పెట్టె.
ఏదన్నా దొరుకుతుందేమోనని దొంగలు ఇల్లంతా గాలించారు. కానీ ముల్లా ఇంట విలువైనవేవీ కనిపించలేదు. చివరగా వారి దృష్టి ట్రంకుపెట్టెపైన పడింది. దానికున్న మూత తెరచి చూడగా అందులో దాక్కున్న ముల్లా కనిపించాడు.
దొంగలను చూడటంతోనే ముల్లా అందులోంచి బయటకు వచ్చాడు.
"ఇందులో ఏం చేస్తున్నావు?" అని ఓ దొంగ ముల్లాను నిలదీశాడు.
 "నువ్వెవరు?" అని ప్రశ్నించాడు మరొక దొంగ.
"పెట్టెలో ఎందుకు దాక్కున్నావు? నువ్వూ మాలాగే ఈ ఇంట దొంగలించడానికి వచ్చేవా" అన్నాడు ఇంకొక దొంగ.
దొంగల ప్రశ్నలకు ముల్లా చేతులు కట్టుకుని ఎంతో వినయంగా జవాబిచ్చాడు...
"అబ్బే నేను దొంగను కాను. ఈ ఇంటివాడిని. మా ఇంట మీకు విలువైనదేదీ దొరకదని నాకు తెలుసు. అది తెలిసి నాకు సిగ్గేసింది. ఏమీ లేని నేను మిమ్మల్నెలా చూడాలో అర్థంకాక ఇలా ఈ పెట్టెలో దాక్కున్నాను. నన్ను తిడతారేమోనని ఓ జంకు?" 
అతని మాటలతో నవ్వుకున్న దొంగలు ఆ రాత్రికి తమ సమయమంతా వృధా అయిందనుకుని ముల్లానేమీ చేయకుండా వెళ్ళిపోయారు. 
----------------/-------------------
2
"పాన్ అబహ్ డి"
----------------------
మరొక సంఘటన.
ముల్లా తనకొచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని దాచుకుంటూ అది కాస్తంత భారీ సొమ్మయ్యాక ఓ నౌకలో ఉల్లాసయాత్రకు బయలుదేరాడు. 
మొదటిరోజు మధ్యాహ్నం ముల్లా తన తోటి ప్రయాణికుడితో భోజనానికి కూర్చున్నాడు.
ఆయన ఓ ఫ్రాన్స్ దేశస్తుడు. భోజనం చేయడానికి ముందర ఆ విదేశస్తుడు "పాన్ అబహ్ డి" అన్నాడు. 
దానికి జవాబుగా ముల్లా "ముల్లా నజీరుద్దీన్" అని చెప్పాడు.
 రెండో రోజు రాత్రి ఆ విదేశీయుడు ముల్లాను చూసి "పాన్ అబహ్ డి" అన్నాడు.
ముల్లా తాను ముల్లా నజీరుద్దీన్ అన్నాడు చిన్న నవ్వుతో.
మూడోళరోజు మళ్ళీ వారిద్దరి మధ్యా ఈ మాటలే సాగాయి.
ముల్లా అయోమయంలో పడ్డాడు. ముల్లా ఆ విదేశీయుడి మాటకు అర్థమేంటో తెలుసుకోవాలనిపించి మరొకరితో ముచ్చటించాడు. తన పేరు ముల్లా అని పరిచయం చేశాడు. 
అప్పుడా ప్రయాణికుడు ముల్లా అజ్ఞానానికి నవ్వుకున్నాడు. పాన్ అబహ్ డి అనేది పేరు కాదు. "ఆనందంగా భుజించండి" అని ఆ మాటకు అర్థం అన్నాడా ప్రయాణికుడు. 
ముల్లాకు విషయం బోధపడింది. దాంతో నాలుగో రోజు ప్రయాణంలో మధ్యాహ్నం భోజనానికి ముందు ముల్లా ఆ ఫ్రెంచ్ జాతీయుడితో "పాన్ అబహ్ డి" అన్నాడు. 
అయితే ఆ ఫ్రెంచ్ జాతీయుడు "ముల్లా నజీరుద్దీన్" అన్నాడు.
దాంతో ముల్లా పెదవులపై చిర్నవ్వు పూసింది.

కామెంట్‌లు