వందే జగద్గురుమ్;- కవిరత్న నాశబోయిన నరసింహ (నాన), ఆరోగ్య పర్యవేక్షకులు,NCVBDC సికింద్రాబాద్,8555010108.
ఆషాఢ శుద్ధ పౌర్ణమి శుభ దినం
వ్యాస మహర్షి పుట్టిన పవిత్ర రోజు
ఆధ్యాత్మిక గురువుల పూజించే వ్యాసపూర్ణిమ 
గురు శిష్యుల అనుబంధ సుగంధం గురు పౌర్ణమి!

గురువంటే జ్ఞానామృత మధుర ఫలం
జీవితానికి మార్గనిర్దేశం చేసే అపర మేధావి                                                                                    
ధర్మం వైపు నడిపించే విశ్వ జగద్గురువు
కాల మహిమ ముందుగా పసిగట్టే నేర్పరి!

సనాతన సంస్కృతి ప్రధాత విశ్వగురువు వ్యాసుడు
భారత భాగవత రచయిత సర్వ విద్యా ప్రవీణుడు 
అవలీలగా అష్టాదశ పురాణాలు రచించిన ఘనుడు
మానవాళి మార్గదర్శి వేదవ్యాస మహర్షి !

అనురాగం పంచి అభ్యుదయం ఆకాంక్షించే
అమ్మా నాన్నలు ఆది గురువులు
లౌకిక విద్య బోధించే ఆచార్యులు
సత్యవాక్కుల మంత్రవిద్య నేర్పే ఆధ్యాత్మిక గురువు!

శ్రీరామచంద్రుడి గురువు వశిష్ట మహర్షి 
శ్రీకృష్ణుని సాందిపుల గురుశిష్యుల బంధం
రామకృష్ణ పరమహంస వివేకానందుని గురువు
రాకుమారులు సైతం పూజించే గురుకుల గురువుని 
తర తరాల కొనసాగింపు గురు పరంపర!

నీలో దాగిన సృజన వెలికి తీసేది గురువు
సహాయకుడు సలహా దారుడు స్ఫూర్తి ప్రదాత
ఆజ్ఞాన తామసి తరిమే విజ్ఞాన వెలుగు కిరణం
త్రిమూర్తుల తేజమా! వందే జగద్గురుమ్ !
(వ్యాస పూర్ణిమ సందర్భంగా..)


కామెంట్‌లు