*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 029*
 *ఉత్పలమాల:*
*అండజవాహ నిన్ను హృద | యంబున నమ్మినవారి పాపముల్*
*కొండలవంటివైన వెసఁ | గూలి నశింపక యున్నె? సంతతా*
*ఖండల వైభవోన్నతులు | గల్గక మానునె? మోక్షలక్ష్మి కై*
*దండ యొసంగకున్నె? తుద | దాశరధీ కరుణాపయోనిధీ.* 
*తా:*
సముద్రమంతటి దయకు రూపమైన వాడా! దశరథుని కుమారుడా! గరుత్మంతుని వాహనముగా కలవాడా, దశరథరామా, నిన్ను ప్రేమతో నమ్మి మనసులో వుంచుకున్న వారి పాపాల కొండ ఇట్టే కరిగిపోతుంది కదా. వారికి ఇంద్ర భోగములు తప్పకుండా లభిస్తాయి కదా. చావు దగ్గరగా వచ్చినప్పుడు మోక్షము రూపములో వున్న లక్ష్మీ దేవి భుజముకాసి మోక్ష మార్గములో తీసుకు వెళుతుంది కదా. ఈ విషయాలలో ఏ మాత్రము సందేహమే లేదు..... అని భద్రాచల రామదాసు గా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*రామచంద్రుని ఆజానుబాహు విగ్రహం మనసులో మెదలితేనే పుణ్యపరంపర మన ఇంటి తలుపు తట్టి, మన ముందటి ఏడు తరాలను, తరువాత ఏడు తరాలను కూడా పునీతులను చేస్తుంది. మరి, నామస్మరణనే జీవన మార్గం చేసుకుంటే మోక్షం మన తలవాకిట నిలవదా. రామ నామానికి అంతటి శక్తి వున్నది అని జటాయువు మనకు చూపించాడు కదా. "రామనామమే రక్షా కవచము. రామ ధ్యానమే రస సాగరము. రామ పాదమే రాజ ప్రదమని" ఇంతటి మహిమాన్వితమైన రామనామ పారాయణ మార్గంలో మనము నడిచేటట్టుగా ఆ రామచంద్రుడే చూడాలని, అలా రాముడు మనకు సహాయపడేలా సీతమ్మ రామునికి చెప్పాలని, భగవతిని వేడుకుంటూ.....*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు