*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 044*
 *చంపకమాల:*
*జనవర మీకథాళి విన | సైపక కర్ణములందు ఘంటికా*
*నినద వినోదముల్ సలుపు | నీచునకున్ వరమిచ్చినావు ని*
*న్న నయమునమ్మి కొల్చిన మ | హాత్ముల కేమియొసంగెదో సనం*
*దననుత మాకొసంగుమయ | దాశరధీ !కరుణాపయోనిధీ !.* 
*తా:*
దయకు సముద్రము వంటివాడవైన రామభద్రా!  ప్రజలందరకూ కోరికలు తీర్చే రాజువు, నీ కథలు విన పడకుండా ఘంటల శబ్దాలు వింటూ వున్న వారికి కూడా దయతో వారి కోరికలు తీర్చి వరాలు ఇచ్చావు. సనందనుడు అనే మహర్షి చేత కీర్తింపబడిన రామా! నిన్నే నమ్ముకుని వున్న మహాత్ములు, మునులు, మానవులకు, నీ ప్రజలకు ఏమి వరములు ఇస్తావో దయానిధీ, కరుణామయా! ....... అని భద్రాచల రామదాసు గా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*నిన్ను ఎదిరించి, ఎదురుగా నిలిచి, దూషణలు చేసిన వాలికి, రావణ బ్రహ్మ కు వారు కోరకుండానే నీచేతితో మోక్షాన్ని ప్రసాదించావు. ఖరదూషణాదులు నిన్ను నిందించినవారే. కానీ మోక్షము ఇచ్చావు. కంసుడు నిరంతరం నీ దూషణ చేసాడు. అటువంటి కంసునికి చివరకు నీతోనే ద్వంద్వ యుద్ధం చేసే అవకాశం ఇచ్చి మోక్షము ఇచ్చావు. మరి ఇటువంటి వారికే అడుగకనే అన్నీ ఇచ్చావు కదా! నీ సన్నిధిలో నిరంతరం వుండాలి అని కోరుకునే వారి కోరికలు తీర్చకుండా వుంటావు అనుకోవడం, మా పైన మాయ యొక్క ప్రభావమేగానీ, నిజము కాజాలదు. అందుకని, హనుమతో మా విన్నపము, "రామ రామ రఘు రామ అని పాడుతున్న హనుమ! అంత భక్తి పరవశమా! ఒక కంట మమ్ము గనుమా!" అని.......*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు