|| బ్రతుకు తెరువు ||;-మచ్చరాజమౌళి దుబ్బాక 9059637442
చేవ చచ్చిన మనసు
శరీరాన్ని బలవంతంగా లాక్కెలుతున్నప్పుడు
బ్రతుకు బరువును కుదించుతూ
బ్రతుకు తెరువు మొగ్గ తొడుగుతుంటే
ప్రాణం లేచొచ్చినట్లవుతుంది

తెగిపడ్డ వాన చినుకు
మట్టిబెడ్డకు బ్రతుకు తెరువు 
శిథిలమైన వెలుతురుకు
తొలిపొద్దు బ్రతుకు తెరువు 

శిశిరము రాల్చిన చెట్టుకు 
చిగురే బ్రతుకు తెరువు 
సుడిగుండం దాటిన అలలకు
తీరం ఒక బ్రతుకు తెరువు 

ఆగని ప్రవాహమై జారుతున్న కన్నీటికి  
నేనున్నానను ఓదార్పే బ్రతుకు తెరువు 
సంధించిన ప్రశ్నలకు సమాధానం దొరకనప్పుడు
మిన్నకుండిన మౌనం ఒక బ్రతుకుతెరువు

ఆటుపోటుల నాటకంలో
సుఖ దు:ఖాల పెనుగులాటలో
లక్ష్యం నడుస్తూనే ఉంటుంది గమ్యాన్ని మరిచి
వెతకాల్సిన దారిని పోల్చుకోలేక

గతాన్ని ముందరేసుకుని
సమాధుల్ని తొవ్వి చూడడం కాదు
సంధి రాయబారం నడపాల్సిందే ఇప్పుడు.. 

______


కామెంట్‌లు