స్వయం కృషీవలుడు మా గోళ్ల;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం 9492811322.
 నాకు నచ్చిన వ్యక్తి గోళ్ల నారాయణరావు. వయసులో చిన్న వాడు కనుక ఏకవచన ప్రయోగం. తాను చదివిన చదువుకి చేస్తున్న వ్యాపారానికి ఏమీ సంబంధం లేదు. నాకు తాను విజయవాడలో మొదట  వేదికపై ప్రసంగించిన వాక్యాలు నేటికీ గుర్తున్నాయి. నాకు ఉపన్యాసం ఇవ్వడం కొత్త నాకు భాష మీద పట్టు లేదు  తప్పులుంటే క్షమించండి అని ముందే చెప్పిన వాడు నిజానికి జీవితంలో తనను తాను తెలుసుకోవడం గొప్ప వేదాంత లక్షణం. తనకు ఏది తెలియదో తెలిస్తే దానిని తెలుసుకోవడానికి జీవితమంతా కష్టపడతాడు, నేర్చుకుంటాడు. దానిలో ప్రవీణుడు అవుతాడు ఆ తరహా వ్యక్తులలో చేరే వాడే మా నారాయణ రావు. మా గురువు గారు నండూరి సుబ్బారావు గారు నాకు ఎప్పుడూ చెప్పే పాఠం ఏ మానవుడైనా మనసులో గట్టి నిర్ణయం తీసుకుంటే దేనినైనా సాధించగలడు అని ఇతని విషయంలో అది  నిజమయింది అందుకు నా కెంతో ఆనందం. ఈ రోజు ఏ సాహిత్య కార్యక్రమ నిర్వాహకుడు అయినా గోళ్ల నారాయణ రావు గారి ప్రసంగం లేకపోతే ఆ సభకు నిండుదనం రాదు అని నిర్ణయించుకున్న వాళ్లే. అందుకే వారికి ఎప్పుడు కుదిరితే అప్పుడు వారి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకునే స్థితికి వచ్చినాయి  అది వారి కృషికితార్కాణం.  నర్మగర్భంగా మాట్లాడడం, హస్యొక్తులతో ప్రేక్షకులను నవ్వించడం సందర్భానికి తగిన నానుడులను, జాతీయాలను వాడడం తన ప్రత్యేకత. తనకు వ్యాపారం చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఏ వ్యాపారం చెయ్యాలో, ఎలా చెయ్యాలో తెలియదు. ఆత్మీయ మిత్రుడు అనుకున్న వ్యక్తిని సంపాదించి  ఆ రంగంలో లక్షలు లక్షలు సంపాదించి తనకు మాత్రం అప్పులే మిగిల్చిన మిత్ర ద్రోహి  అప్పుడు తెలిసింది  నారాయణరావుకు మానవుని తత్త్వం ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి తాను ఎవరితో ఎలా  ప్రవర్తించాలి, వారి  మస్తిష్కాన్ని అధ్యయనం చేసిన వాడు ఈరోజు వ్యక్తిని చూడగానే అతని పూర్వాపరాలు అన్నీ చెప్పగలిగిన స్థితికి వచ్చాడు.  స్వయంకృషి తప్ప  ఎదుటివారి మాటలు నమ్మకూడదన్న దృఢ విశ్వాసం అతడిని ఉన్నత స్థానానికి తీసుకు వెళ్ళింది. ఈ సందర్భంగా సినీ నటుడు కృష్ణ మాటలు నాకు గుర్తు వస్తాయి. సినిమాలో నిలదొక్కుకుని నిర్మాతగా వచ్చిన తరువాత తన వ్యాపారాలలో కొంతమంది భాగస్వామ్యం తీసుకోవడానికి వస్తే క్షమించండి లాభాలు వస్తే ఆనందిస్తారు లేకపోతే నన్ను తిట్టుకుంటారు నేను మీతో మాటలెందుకు పడాలి కనుక అలాంటి ప్రయత్నాలు చేయవద్దని  చాలా సున్నితంగా తిరస్కరించాడు. గేదెలను పెంచడం దగ్గర్నుంచి సినిమాలు నిర్మించడం వరకు మధ్యలో ఎన్ని దెబ్బలు తిన్నా తట్టుకున్నాడు తప్ప భయపడి వెనక్కు తగ్గలేదు. అలాంటి తత్త్వం మా నారాయణరావుని ముందుకు నడిపించింది.
నిన్న ఏదో సందర్భం వచ్చి ఏం సార్ నన్ను మర్చిపోయారా అంటే మిమ్మల్ని మర్చిపోవడం కాదు సార్ నన్ను నేనే మర్చిపోయాను అన్నాడు తడుముకోకుండా. పని భారం ఎక్కువ అయింది అందుకని మిమ్మల్ని కలవలేదు త్వరలో మిమ్మల్ని కలుస్తాను అని వివరణ ఇచ్చారు. జీవితంలో మనం కోరుకోవలసింది పని  అది లేకపోతే ఈ జీవి సోమరిపోతవుతాడు. జీవితం ఎందుకు పనికి రాకుండా పోతుంది ఎంత ఎక్కువ పని ఉంటే అంత సృజన పెరుగుతుంది. కనుక హడావుడి లేదు పని జరిగిన తరువాతనే కలుద్దాం అని చెబితే ఎంతో ఆనందించాడు  అలాంటి స్నేహితుడు  దొరకడం నా అదృష్టం. వారి స్నేహ బృందం అంతా సాహిత్య సంస్కృతిక మేధావులే అలాంటి వారితో
పరిచయం నా సంచిత జన్మ సుకృతంగా భావిస్తున్నాను.


కామెంట్‌లు