మనకీర్తి శిఖరాలు;-యార్లగడ్డవెంకన్నచౌదరి. ;- డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
 యార్లగడ్డవెంకన్నచౌదరి.జిల్లా కారంచేడు వాస్తవ్యుడు, స్వాతంత్ర్య సమర యోధుడు, మహా దాత, పారిశ్రామిక వేత్త. గణితములో, న్యాయశాస్త్రములో మంచి ప్రవేశము గల మేధావి.
వెంకన్న చౌదరి ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామంలో యార్లగడ్డ నాయుడమ్మ, రత్నమాంబ దంపతులకు1911 లో జన్మించారు. వీరికి ఒక అక్కయ్య శ్రీమతి దగ్గుబాటి సీతమ్మ ఒక తమ్ముడు రంగనాయకులు చౌదరి ఉన్నారు. వెంకన్న చౌదరి తమ మేనమామ కూతురు రాజ్యలక్ష్మమ్మని వివాహమాడారు. వీరికి కుమారుడు శంభు ప్రసాద్. శంభు ప్రసాద్ గారి భార్య శ్రీమతి ప్రభావతి ఈమె అమరావతి రాజా వాసిరెడ్డి శ్రీనాధ్ ప్రసాద్ గారి కుమార్తె.
ఉప్పు సత్యాగ్రహములో పాల్గొని ఒక సంవత్సరము జైలు శిక్ష అనుభవించాడు. కారంచేడు గ్రామ పంచాయతీ సర్పంచ్ గా బాధ్యతలు నిర్వహించారు. మద్రాసులోని ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్కు అధ్యక్షునిగా పనిచేశాడు.
తుమ్మలపల్లి రామలింగేశ్వర రావు గారు తాళ్ళపాక అన్నమాచార్యుని జీవితంపై వ్రాసిన తొలి రచన కృతి స్వీకరించారు. కోట సోదర కవులు తమ రచన "రాజ్యలక్ష్మీ విలాసము" వీరికి అంకితమిచ్చారు.
ఆచార్య యార్లగడ్డ వెంకట రాఘవయ్య గారు తమ విశిష్ట రచన "కాకతీయ తరంగిణి"ని వెంకన్న చౌదరి గారికి అంకితమిచ్చారు.
విశేషమేమిటంటే వీరిద్దరూ జీవితంలో ఎప్పుడూ కలుసుకోలేదు. వెంకన్న చౌదరి గారి దాతృత్వ గుణాన్ని అభిమానించి, అన్నగా భావించి శ్రీ రాఘవయ్య గారు తమ రచనను వెంకన్న చౌదరి గారికి అంకితమిచ్చారు.
వెంకన్న చౌదరి గారి ప్రోద్బలంతో, నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు, తితిదే నిర్వహణాధికారి అన్నా రావు గారు అన్నమాచార్య ప్రాజెక్ట్ ప్రారంభించారు.
శంభూ ఫిల్మ్స్ పతాకంపై వెంకన్న నిర్మించిన 'నమ్మిన బంటు' (1960) అనే చలనచిత్రము భారత రాష్ట్రపతి నుండి రజత పతకము పొందింది. స్పెయిన్లో జరిగిన అంతర్జాతీయ చలనచిత్ర వేడుకలో ప్రదర్శించబడి పలువురి ప్రశంశలు పొందింది.
వెంకన్న చౌదరి మహా దాత. పలు పాఠశాలకు, కళాశాలలకు భూరి విరాళాలిచ్చాడు. తన తండ్రి పేరిట 'యార్లగడ్డ నాయుడమ్మ ఓరియంటల్ విద్యాలయము' స్థాపించాడు. తిరుపతి, తిరుత్తణి, శ్రీశైలం వంటి దేవస్థానములలో కాటేజీలు, సత్రములు నిర్మించాడు. గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద కాన్సర్ ఇన్స్టిట్యూట్ నకు 30 లక్షల విరాళమిచ్చాడు.
భార్య రాజ్యలక్ష్మి పేరిట 1980 నుండి తెలుగువారిలో పేరుప్రఖ్యాతులు పొందిన వ్యక్తులకు పురస్కారములు ఇవ్వబడుచున్నవి.
మద్రాసులో స్ధిరపడి, అశేష సంపదను సృష్టించి సమాజ శ్రేయస్సుకు వుపయోగ పెట్టిన దానశీలి వెంకన్న చౌదరి గారు1986లో పరమపదించారు.


కామెంట్‌లు