ఆ రోజు గుర్తుకొచ్చె...;-- యామిజాల జగదీశ్
 ఇదిప్పటి విషయం కాదు కానీ ఇప్పుడొక కార్యాలయంలో ఓ అధికారిణి చూపిన ఆదరణ పదేళ్ళ క్రితం ఓ కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలో ఓ "ఉద్యోగిని" మెలగిన తీరు గుర్తుకొచ్చింది. 
సాక్షి దినపత్రికలో పదవీ విరమణ పొందిన తర్వాత వృద్ధాప్య వేతన పత్రాలు (పెన్షన్) ఇవ్వడానికి వెళ్ళాను. 
అక్కడ టోకెన్ ఇచ్చి ఓ గదిలో కూర్చోబెట్టారు. ఆ గదిలో డెబ్బై ఎనబై మంది తమ వంతు కోసం కూర్చున్నారు.
టోకెన్ ప్రకారం పిలుస్తున్నారు. పిలిచే వాళ్ళ స్వరంలో ఎంతో ఆప్యాయత ధ్వనిస్తోంది. అలాగే కౌంటర్లో ఉన్న సుధ (పేరు మార్చాను - అసలు పేరు తెలీదు.) సైతం అంతే ఆదరంతో వ్యవహరించారు. 
కౌంటర్లో వరుసగా ముగ్గురు నలుగురున్నారు. నా పక్కన ఓ వృద్ధుడు వణుకుతూ కూర్చున్నారు. ఆయనను చూస్తుంటేనే ఓ డెబ్బై ఎనబై ఏళ్ళ మనిషని చెప్పవచ్చు. బాగా ముడతలు పడ్డ శరీరం.
" ఐరిష్ " నమోదు చేయించుకోవడం కోసం వచ్చిన వృద్ధుడు. ఆయన కళ్ళను సరిగ్గా ఉంచలేకపోతున్నారు. అప్పుడా మహిళ ఎంతో ఆత్మీయంగా మాటలు చెప్తూ ఆ వృద్ధుడికి ఐరిష్ నమోదు చేసిన తీరు ఇప్పటికీ కళ్ళముందు కదలాడుతోంది. అలాగే ఆ పెద్దాయన చెప్పే మాటలు విన్పిస్తున్నాయి కాను సరిగ్గా అర్థం కావడం లేదు. అయినప్పటికీ ఆ ఉద్యోగిని ఎంతో చక్కగా మర్యాదగా మాట్లాడి వివరాలు చెప్పించుకుని రాసుకోవడం గమనిస్తూనే ఉన్నాను. ఆమె సహనానికి మనఃపూర్వక నమస్సులు. ఎందుకంటే అస్సలు ఓర్పనేది లేని నాకు ఆ మహిళా ఉద్యోగి అనుసరించిన తీరు ఆశ్చర్యం కలిగించింది. ఆవిడను మనసారా అభినందిస్తూ ఓ ప్రశ్న వేశాను..."మీకెలా ఇంత ఓర్పు వచ్చింది" ఆని.
అప్పుడావిడ చెప్పిన మాట...
"మాకూ ఆ వయస్సు వస్తుంది కదండీ. అయినా ఇక్కడికి వచ్చేవారిలో ఓ ముప్పై శాతం మంది ఇంతటి పెద్ద వాళ్ళే అయి ఉంటారు. వారిని ఊదరగొడితే మా పనేమవుతుందండి. ఇలా మాట్లాడక తప్పదండి. ఓర్పంటూ లేకుంటే ఈ కుర్చీలో కూర్చోవడం అపవసరం" 
ఎంత నిజమో కదూ. సరిగ్గా ఇలాంటి మంచి తీరు ఇప్పుడు నేనొక ప్రభుత్వ రంగ సంస్థలో చవిచూశాను. 

కామెంట్‌లు