గణేశుడికి దుర్వారంతో ఎందుకు పూజ చేయాలి ?;-: సి.హెచ్.ప్రతాప్

 దూర్వా అంటే గడ్డిపోచ అని అర్థం. రెండు పోచలున్న దూర్వారాన్ని గణపతికి సమర్పించడం అనేది గణపతి పూజలో ఒక ముఖ్యమైన అంశం. అందరూ గడ్డిపోచను ఎంతో తేలికగా తీసి పారేస్తుంటారు, కాని ఆ గడ్డి పోచ అంటే గణపతికి ఎందుకంత ఇష్టం అనే విషయంపై మన పురాణాలలో ఒక ఆసక్తికరమైన కథ ఉంది.. పూర్వం  అనలాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను పీడించేవాడు.. ఆ రాక్షసుడి బాధలు భరించలేక దేవతలంతా వెళ్లి గణపతితో మొరపెట్టుకున్నారు. అప్పుడు వినాయకుడు.. అనలాసురుణ్ని అమాంతం మింగేశాడు. అనలం అంటే అగ్ని. ఆ అసురుణ్ని మింగడం తో వినాయకుడు భరించలేని తాపంతో బాధపడసాగాడు. ఆయన ఉదరంలో వున్న సమస్త లోకాలు ఆ వేడికి అల్లల్లాడి పోసాగాయి. సృష్టిలోని సమస్త జీవులు హాహాకారాలు చేయసాగారు.
స్వామికి కలిగిన వేడిని ఉపశమింపజేయడానికి దేవతలు రకరకాల ప్రయత్నాలు చేశారు. పద్మాలను సమర్పించారు, పుష్పార్చన చేశారు. ఏకంగా చంద్రుణ్ని తీసుకొచ్చి గణపతి శిరస్సుపై ఉంచారు. అయినా గణపతికి వేడి నుండి ఉపశమనం లభించలేదు.  చివరికి పరమశివుడు గరికను తీసుకొని వినాయకుడి శిరస్సుపై ఉంచాడు. దాంతో గణపతికి తాపం తగ్గింది. అలా వినాయకుడికి, గడ్డిపోచకూ మధ్య సంబంధం కుదిరింది. వినాయకుడికి గరికతో పూజ చేస్తే ఆయన తన అనుగ్రహంతో మనలోని తాపాలను, దుఖాలు ఉపశమింపజేస్తారన్నది  స్వయంగా గణపతి దేవతలతో చెప్పినట్లు పురాణాలలో వుంది.. గడ్డిపోచను అందరూ తేలిగ్గా తీసుకుంటారు. కానీ, సృష్టిలో ఏదీ అల్పమైనది కాదని చెబుతూ స్వామి గరికను ఇష్టంగా స్వీకరిస్తారని ఈ ఉదంతం లోని సారాంశం.. అందుకే దూర్వాయుగ్మం తో గణపతిని ఆరాధిస్తే స్వామి ప్రసన్నుడై, శీఘ్ర ఫలితం ఇస్తాడని విశ్వసిస్తారు.
కామెంట్‌లు