నువ్వొక విశ్వ మోహినివి!
అందరినీ నీవెంట తిప్పుకుంటావు
ఆదమరిస్తే..వెంటనే తప్పుకుంటావు.
నువ్వొక చంచలవు!
అనుగ్రహించి.. అందలం ఎక్కిస్తావు
ఆగ్రహించి.......పాతాళం తొక్కేస్తావు.
నువ్వొక గడసరివి!
చేరువై.. మురిపిస్తావు
దూరమై.. ఏడిపిస్తావు.
నువ్వొక కసాయివి!
నేరాలు చేయిస్తావు
ఘోరాలు జరిపిస్తావు.
నువ్వొక నిర్దయవు!
మనుషులను రెచ్చ గొడుతావు
కుటుంబాల్లో చిచ్చు పెడుతావు.
నువ్వొక నమ్మక ద్రోహివి!
నమ్మిన వారినే ముంచేస్తావు
ప్రేమాభిమానాలను త్రుంచేస్తావు.
నువ్వొక జిత్తుల మారివి!
అంత తొందరగా
ఎవ్వరికీ దక్కవు
ఎన్నటికీ చిక్కవు.
నువ్వొక టక్కరివి!
అహాన్నిపెంచుతావు
స్నేహాన్ని చంపుతావు.
నువ్వొక పోకిరివి!
నీ కోసం తపించమంటావు
ఎంతగానో జపించమంటావు.
నువ్వొక కఠిన కర్కష హృదయానివి!
హత్యలు జరిపిస్తావు
ఆత్మహత్యలు చేయిస్తావు.
నువ్వొక మనోహరివి!
అందరూ నిన్నే కోరుకుంటారు
కొందరే నిన్ను చేరుకుంటారు.
నువ్వొక మాయలమారివి!
ఉన్నోళ్ళ దగ్గరే కుక్కలా పడిఉంటావు
లేనోళ్ళ దరిదాపుల్లోకి కూడా రానే రావు.
నువ్వొక టక్కరివి!
నీ ముందు బంధాలు, బంధుత్వాలు
అన్నీ బలాదూరే!
నువ్వొక అనిర్వచనీయానివి!
నీ గురించి ఎంత రాసినా తక్కువే.
ఓ పాల్కడలి ముద్దులపట్టీ!
సరిలేరు నీకెవ్వరూ..!?
నీకు నువ్వే సాటి
నీకెవ్వరూ లేనే లేరు పోటి.
నువ్వు ఈ ప్రపంచాన్ని నడిపించే ఇం'ధనా'నివి!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి