మా జాతివారితో కొన్ని గంటలు;-- యామిజాల జగదీశ్
 అవును, ఎన్నేళ్ళ తర్వాతో మా జాతివారిని ప్రత్యక్షంగా ఒకే గొడుగు కింద చూడటం. చూడటమే కాదు, కొందరు పెద్దలతో మాట్లాడటం, కొందరి ప్రముఖుల గురించి వినడం....మనసుకెంత ఆనందమేసిందో. ఇక్కడ " మా జాతంటే " మరేదో కాదండోయ్... మా పాత్రికేయ వృత్తిలోని  ప్రముఖులందరం ఓ జాతి అని ఉద్దేశించి ప్రయోగించిన మాటే ఇది!
సోమాజిగూడ ( హైదరాబాద్) లోని ప్రెస్ క్లబ్బులో ఆగస్ట్ 7వ తేదీన జరిగిన వయోధిక పాత్రికేయ సంఘం సర్వసభ్యసమావేశం ఆహ్లాదకరంగా సాగింది. దాదాపు వంద మంది దాకా హాజరైన కార్యక్రమంలో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. నిన్న మొన్నటివరకూ ఈ సంఘానికి అధ్యక్షుడిగా ఉండిన జి.ఎస్. వరదాచారి గారు వయోభారంతో తప్పుకోవడంతో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. దాసు కేశవరావు అధ్యక్షులుగా కొండా లక్ష్మణరావు గారు కార్యదర్శిగా ఏర్పాటైందీ సంఘం. 
సర్వసభ్య సమావేశంలో ముఖ్యుల ప్రసంగాలైన తర్వాత సభకు హాజరైన సభ్యులందరి స్వీయపరిచయాలకు అవకామివ్వడం బాగుంది. ఇప్పటికీ తాను రాస్తున్నట్టు చెప్తూ ఇంకా రాస్తానన్న వాసిరాజు ప్రకాశంగారి మాటలే నా చెవిన వినిపిస్తున్నాయి. నాకొక ఆనందమేమిటంటే ఆయన రాస్తున్న సినీరంగ విశేషాలుంటున్న "వార్త" దినపత్రిక ఆదివారం అనుబంధంలో నా వ్యాసాలు కూడా చోటు చేసుకోవడం. 
భండారు శ్రీనివాసరావుగారి జన్మదినం కూడా ఈ సమావేశం రోజే కావడంతో ఆయనకు శుభాకాంక్షలు చెప్పడమూ బాగుంది.
కొండుభట్ల రామచంద్రమూర్తిగారు, వాసిరాజు ప్రకాశం, ములుగు రాజేశ్వర్ , భండారు శ్రీనివాసరావు, టి. ఉడయవర్లు, గోవిందరాజు చక్రధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాలుపంచుకున్న నేను పున్నా కృష్ణమూర్తి, రాజేశ్వరి, అవ్వారి రఘు, ఎ. గాంధీ (పీకాక్ పబ్లికేషన్స్) వంటివారెందరినో కలిశాను. 
ఈ సమావేశం సందర్భంగా " పరిణత పాత్రికేయం - జి.యస్. వరదాచారి " పుస్తకాన్ని పరిచయం చేసారు. నాకీ పుస్తకాన్ని రాజేశ్వరిగారు "రాఖీ" శుభాకాంక్షలుగా ఈ పుస్తకాన్ని కానుకగా ఇచ్చారు.
128 పేజీల పుస్తకంలో చివరి పదహారు పేజీలు వయోధిక పాత్రికేయ సంఘం కార్యక్రమాల ఛాయా చిత్ర మాలికతో సమర్పించారు. ఇక తొలి 112 పేజీలలో వరదాచారిగారి జీవిత విశేషాలతోసహా మొత్తం 19 వ్యాసాలున్నాయి. 
జీవన సాఫల్య అభినందన అక్షరమాలికగా వరదాచారిగారికి అంకితం చేసిన ఈ పుస్తకం ఎందుకంటూ వయోధిక పాత్రికేయ సంఘం అధ్యక్షుడు దాసు కేశవరావు గారి పీఠిక మొదలుకుని ప్రతి వ్యాసమూ ఆసక్తికరంగా ఉంది. 
టి. ఉడయవర్లు గారి "కలం యోధుడు - కార్యదక్షుడు" వ్యాసం ద్వారా అనేక విషయాలు తెలుసుకున్నాను. 
వరదాచారిగారు ఇష్టపూర్వకంగా జర్నలిజం రంగంలోకి అడుగుపెట్టిన ఏడాదీ, నేను పుట్టిన ఏడాదీ 1954 కావడం ఒకటే అవడం బలేగా అన్పించింది.  ఓ స్పష్టతతో జర్నలిస్టుగా మంచి జర్నలిస్టుగా గొప్ప జర్నలిస్టుగా రూపాంతరం చెందిన వరదాచారిగారితో మాకు "ఉదయం"  దినపత్రిక ఆవరణలో రామచంద్రమూర్తిగారు ఉపన్యాసాలిప్పించడం గుర్తుకొచ్చింది ఈ పుస్తకం చదువుతుంటే. ఆయనను ప్రత్యక్షంగా చూడటం అప్పుడే. ఆ తర్వాత అతి తక్కువ సార్లే నేనాయనను చూశాను. ఆయనో మారు ఇద్దరు ఎడిటర్ల అంగీకారంతో 22 రోజులపాటు రాత్రి ఒక పత్రికలో, పగటిపూట మరో పత్రికలో పని చేసినట్టు చదువుతుంటే ఆశ్చర్యమేసింది. 
పత్రికా రంగంలో వివిధ హోదాల్లో పని చేసిన వరదాచారిగారు తెలుగు విశ్వవిద్యాలయం వేదికగా ఎందరో  యువజర్నలిస్టులను తీర్చిదిద్దారు. 
వయోధిక పాత్రికేయ సంఘం అధ్యక్షుడిగా 2006 నుంచి పదహారు సంవత్సరాలు కొనసాగి సంఘం తరఫున జర్నలిస్టులకు వృత్తి నైపుణ్యాన్ని పెంచే గ్రంథాలను ప్రచురించడంలో దిక్సూచిగా వ్యవహరిం చడం విశేషం. 
వర్కింగ్ జర్నలిస్టుల సంఘం కార్యాలయం "దేశోద్ధారక భవనం" నిర్మాణానికి అనుమతి సాధించడంలో ముఖ్యభూమిక పోషించిన వరదాచారిగారి గురించి డాక్టర్ గోవిందరాజు చక్రధర్ గారి వ్యాసం అమూల్యమైనది. 
ఇక తీర్పరిగా దిశానిర్దేశం చేసిన ప్రసిద్ధ పాత్రికేయుడిగా వరదాచారిగారిని ఆభివర్ణిస్తూ రామచంద్రమూర్తిగారు సమర్పించిన వ్యాసమూ ఆసక్తికరం!
వరదాచారి గారి కుటుంబసభ్యులతోపాటు కల్లూరి భాస్కరం, కడియాల సుధీర్ కుమార్, కేశవరావు, మాడభూషి శ్రీధర్, భండారు శ్రీనివాసరావు తదితరులు రాసిన వ్యాసాలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. 
వయోధిక పాత్రికేయ సంఘం ఆవిర్భావం, పదహారేళ్ళలో నిర్వహించిన వివిధ కార్యక్రమాలు,  పుస్తకాల ప్రచురణకు సంబంధించిన విషయాలను సంఘం కార్యదర్శి కొండా లక్ష్మణరావుగారు తమ వ్యాసం ద్వారా వివరించడం ముదావహం. 
రామచంద్రమూర్తిగారి సారథ్యంలో "ఉదయం"లో పని చేసిన నేను ఈ సమావేశంలో ఆయనకు నమస్కరించి మాట్లాడుతుండగా మిత్రుడు అక్కినేని శ్రీధర్ ఫోటో తీసివ్వడం ఓ మధురమైన జ్ఞాపకమే నాకు. ఆందుకే శ్రీధరుకి ప్రత్యేక కృతజ్ఞతలు. కామెంట్‌లు