పుస్తక బంధం రుణానుబంధమే!;-- యామిజాల జగదీశ్
 పుస్తకాలతో ముడిపడిన బంధం చిత్రాతి విచిత్రం. ఎట్టా ఏ శుభముహూర్తాన పుస్తకం పట్టానో గుర్తు లేదు కానీ ఏదో ఒక పుస్తకంలో ఎంతో కొంత చదివితే తప్ప రోజు గడవదు నాకు. అటువంటి పుస్తకాల గురించి ఎందరో ప్రముఖులు ఎన్నో రకాలుగా చెప్పిన మాటలున్నాయి. వాటిలో కొన్ని మాత్రమే ఇక్కడ రాసాను....
కోటి రూపాయలు లభిస్తే ఏం చేస్తారు అని అడిగినప్పుడు "ఓ గ్రంథాలయం ఏర్పాటు చేస్తాను" అన్నారు జాతిపిత గాంధీజీ.
గరిటెను లాగేసి పుస్తకం ఇస్తే చాలన్నారు తందై పెరియార్ స్త్రీని విద్యాధికురాలిని చేయాలనే కోణంలో.
ఏకాకిని చేస్తే ఏం చేస్తారని అడిగినప్పుడు పుస్తకాలతో ఆనందంగా బతికేస్తాను అన్నారు జవాహర్ లాల్ నెహ్రూ.
నా సమాధి మీద మరచిపోకుండా రాయండిలా "ఇక్కడ ఓ పుస్తకాల పురుగు నిద్రపోతోంది" అని అన్నారు బెట్రెండ్ రసెల్.
మనిషి కనిపెట్టిన గొప్ప విషయమేమిటని అడిగినప్పుడు ఏమాత్రం ఆలోచించక 
"పుస్తకం" అని జవాబిచ్చారు ఆల్బర్ట్ ఐన్ స్టీన్.
"మరే స్వేచ్ఛా వద్దు...జైలులో పుస్తకం చదివేందుకు మాత్రం అనుమతించండి చాలు" అన్నారు నెల్సన్ మండేలా.
పుట్టింరోజుకి ఏం కావాలి అని అడిగినప్పుడు "పుస్తకాలు కావాలి" అని ఏమాత్రం తడబడక చెప్పినప్పుడు లెనిన్ ముందర వాలాయి లెక్కపెట్టలేనన్ని పుస్తకాలట.
ప్రతి సినిమాలో నటించడానికి ఒప్పుకునేటప్పుడు అడ్వాన్సుగా పుచ్చుకునే డబ్బులో మొదటి వంద డాలర్లకు పుస్తకాలు కొనేవాడు చార్లి చాప్లిన్.
ఓ చిన్నోడికో చిన్నదానికో మీరు కొనిచ్చే గొప్ప కాన్క "ఓ పుస్తకమే" అన్నారు విన్ స్టన్ చర్చిల్.
భీకరమైన పోరాట అస్త్రాలు ఏవి అని అడిగినప్పుడు "పుస్తకాలే" అన్నారు మార్టిన్ లూదర్ కింగ్.
తనను ఉరితీసే క్షణం ముందుకూడా పుస్తకం చదువుతూనే ఉన్నాడు భగత్ సింగ్. 
నేనింకా చదవని ఓ మంచి పుస్తకాన్నొకటి కొనుక్కొచ్చి నన్ను కలిసే వ్యక్తే నా మిత్రులలో గొప్ప మిత్రుడు అన్నాడు అబ్రహాం లింకన్.
వెయ్యి పూస్తకాలు చదివిన వాడొకడుంటే చూపండి. అతనే నాకు మార్గదర్శి అన్నాడు జూలియస్ సీజర్.
ప్రపంచంలోని మారుమూల ప్రాంతకు సైతం వెళ్ళాలనుకుంటున్నావా....అయితే ఓ గ్రంథాలయాకి వెళ్ళు అని ఒకరంటే "చాల్లే అని నీరసపడిపోయి కొత్త జీవితాన్ని వెతుకుతున్నారా, అయితే ఓ కొత్త పుస్తకాన్ని కొని చదవడం మొదలుపెట్టండి" అన్నారు మరొకరు. 
కొన్ని పుస్తకాలను ఆస్వాదిస్తాం. కొన్నింటిని మింగుతాం. కొన్ని పుస్తకాలను నమిలి జీర్ణించుకుంటామన్నారు ఫ్రాన్సిస్ బెకన్.
విప్లవ పథంలో చేతి తుపాకీలకన్నా పెద్ద ఆయుధాలు పుస్తకాలే అన్నారు లెనిన్.
నిజమైన పాఠకుడు చదవడాన్ని ముగించడన్నాడు ఆస్కార్ వైల్డ్. 
దేహానికి వ్యాయామం ఎట్టాగో మనసుకి వ్యాయామం పుస్తకపఠనమన్నాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. 
అనాది కాలానికి చెందిన మహాత్ములను నేరుగా దర్శించుకుని వారితో మాట్లాడాలని ఉందా, అయితే గ్రంథాలయానికి వెళ్ళమన్నాడొకడు.
ఇలా పుస్తకాల గురించి అక్కడక్కడా చదివిన కొన్ని మాటలను ఇలా రాసి నా పక్కనే ఉన్న పుస్తకాల వంక చూసి ఆనందపడుతున్న సమయంలో ఓ పెద్దాయన నన్ను చూడటానికి వచ్చారు.
ఆయన పదవీ విరమణ చేసిన ప్రభుత్వోద్యోగి. ఆయన రెగ్యులరుగా చదివేవి మూడు తెలుగు దిన పత్రికల ఆదివారం అనుబంధాలు. సప్తగిరి మాసపత్రిక. సాయిలీల అనే మరొక మాస పత్రిక. 
ఓ రెండు మూడు మాటల తర్వాత నా పక్కనే ఉన్న ఓ నాలుగు వందల పేజీల పుస్తకం ఒకటి చదువుతారేమోనని ఇచ్చాను. అయితే ఆయన ఏదో కాదనలేక మొహమాటంకోసం అందుకున్నట్టు అన్పించింది పుస్తకాన్ని ఆయన మొహం చూస్తుంటే. అదేదో తప్పుడు పని అన్నట్టుగా భయం భయంగా పుస్తకం అందుకున్నారు. పేజీలు అటూ ఇటూ తిప్పారు. పుస్తకం చివరి పేజీల్లో కొన్ని ఫోటోలుంటే అవి చూసి పుస్తకం తిరిగిచ్చేసారు. తీసుకెళ్ళి చదవండి అన్నాను. 
అయితే ఆయన ఏ మాత్రం ముందు వెనుకలు ఆలోచించక "ఇంత పెద్ద పుస్తకం చదవటమా? అసలిన్ని పేజీల పుస్తకాన్ని నేను పట్టుకోవడమా? వద్దండీ...అది చూస్తుంటేనే మనసు భారమైపో తోంది" అన్నారు. 
అప్పటికీ ఆగక ఆయనతో చెప్పాను "తీసుకెళ్ళి నెమ్మదిగా చదివివ్వమని!" 
అది నా వల్ల కుదరని పని అంటూ "టైమైంది వెళ్ళి భోంచేయాలి" అని వెళ్ళిపోయారు.
ఆయనతో పుస్తకాల గురించి అవీ ఇవీ మాట్లాడుదామనుకుంటే ఇలా అర్థంతరంగా వెళ్ళి పోయారేంటి చెప్మా అనుకున్నాను. ఆయనకు పుస్తకాలంటే పడదని ఆ తర్వాత 
 తెలిసింది. కబుర్లు చెప్పమంటే చెప్తారు తప్ప చదవరని.
మా ఇంట నేను కూర్చునే చోట పక్కనే ఓ వంద పుస్తకాలన్నా ఉంటాయి. అలాగే నేను పడుకునే చోట మంచం పక్కనే బోలెడు పుస్తకాలు. వాటిని స్పర్శిస్తుంటే ఆనందించే నా మనసు తీసి చదువుతుంటే ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను. పుస్తకాలు లేని ప్రపంచాన్ని ఊహించలే నసలు. పుస్తకాలంటే వల్ల మాలిన ప్రేమ నాకు!

కామెంట్‌లు