*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - ద్వితీయ (సతీ) ఖండము-(0149)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*ప్రయాగ - దక్షుడు పాల్గొనడం - శివునికి శాపం - నందీశ్వర శాపం - శివుడు నందిని శాంతింప చేయుట*
*బ్రహ్మ, నారదునితో ఇలా చెప్పాడు -* 
*ప్రయాగలో జరుగుతున్న యజ్ఞములో తనకు గౌరవం ఇవ్వని వృషభారూఢుని మీద దక్షునికి కోపం అంతకంతకూ పెరిగి పెద్దది అయ్యింది. తనలోని అవమాన భారాన్ని, కోపాన్ని అణచుకోలేని దక్షుడు అక్కడ జరుగుతున్న వేద సభను ఉద్దేశించి " సకల దేవగణాలు, బ్రాహ్మణులు, రుషులు నాకు గౌరవం ఇచ్చి నమస్కారాలు చేస్తున్నారు. కానీ, భూత, ప్రేత, పిశాచాలతో కలసి శ్మశానంలో విహరించే ఈ భస్మధారుడు మాత్రం నాకు నమస్కరించటల్లేదు. పెద్దలను, పండితులను, గొప్పవారిని గౌరవించాలి అనే గుణాలు నశించాయి. ఈ శంకరుడు, వేద శాస్త్రములను అవహేళన చేసి, నీతి నియమాలు తప్పతూ వుంటాడు. ఇతని పరివారం కూడా అటువంటిదే. ఇటువంటి ఈ శివునికి అందరి దేవతలతో సమానంగా యజ్ఞ భాగం అందటం సరికాదు. ఈ తనికి యజ్ఞ భాగంలో వాటా ఇవ్వకూడదు." ఇట్లా మాట్లాడిన దక్షుని మాటలు విన్న భృగువు మొదలగు వారు దక్షుడు చెప్పినవి నిజమేమో అని నమ్మారు. అతనికి వంత పాడారు.*
*వేద సభలో శివ పార్షదులు దక్షుని ద్వారా తమ స్వామి శంభుపతికి జరుగుతున్న అవమానాన్ని తట్టుకోలేక పోతున్నారు. పార్షదులలో ముఖ్యుడైన నందీశ్వరునికి, దక్షుని మీద పట్టరాని కోపం వచ్చింది. నందీశ్వరుడు, దక్షుని తో " మూర్ఖుడా! శివదేవుని యజ్ఞము నుండి వేరు చేయమన్నావు. ఆయనే యజ్ఞము కదా! యజ్ఞ, యాగాదుల నుండి వచ్చే ఫలమును ఇచ్చే వాడు కూడా ఆ అనాది గురువే కదా! ఆయన పేరు తలచుకుంటేనే యజ్ఞ ఫలము దక్కుతుంది కదా! అంతటి ఘనాఘనుని, అందరికీ అతీతుని యజ్ఞము నుండి వేరు చేయటమేమిటి. నీవు చెప్పావు, సరే. ఇక్కడ వున్న బ్రాహ్మణ ప్రముఖులు, రుషులు నిన్ను సమర్ధించడం ఏమిటి. మహాదేవుడు స్వయముగా నిర్దోషి. నీవు బ్రాహ్మణుడను అనే అహంకారంతో, జగత్తును సృష్టి చేసి, పాలించి, పెంచి, లయము చేయగల మహేశ్వరునికి యజ్ఞ భాగము లేకుండా శాపము ఇచ్చావు. ఇది సరి కాదు."*
*నందీశ్వరుని మాటలు విని దక్షుడు "శివ పార్షదులు, రుద్ర గణములు అయిన మీరు, వేద మార్గము విడిచి ప్రవర్తిస్తారు. మహర్షులు మిమ్మల్ని విడిచి పెడతారు. శిష్టాచారానికి దూరం అవుతారు. జటలు, భస్మము ధరించి, మద్యపానము చేస్తూ స్మశాన వాటికలలో తిరుగుతుంటారు" అని శపిస్తాడు. ఈ మాటలతో పరమేశ్వర మహాభక్తుడు, ఎంతో తేజస్సు కలవాడు, శివుని ప్రియ భక్తడు అయిన నందీశ్వరునికి అహంకార పూరితుడైన దక్షుని మీద అలవి మాలిన కోపం కలుగుతుంది.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు