*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - ద్వితీయ (సతీ) ఖండము-(0157)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*అశరీరవాణి దక్షుని నిందించుట - వినాశము సూచించి - దేవతాగణములను యజ్ఞ స్థలం వీడమని హెచ్చరిక*
*బ్రహ్మ, నారదునితో ఇలా చెప్పాడు -* 
 *శివపార్షదులు, యజ్ఞ రక్షకులకు మధ్య భీకర యుద్ధం జరుగుతున్నప్పుడు, ఆకాశము నుండి అశరీరవాణి అకస్మాత్తుగా ఇలా పలుక సాగింది. "దక్షా! నీకు కష్ట కాలము వచ్చే సమయం ఆసన్నమైనందున నీవు పరమ శివభక్తుడైన దధీచి మహర్షి మాటలను పెడచెవిన బెట్టావు. దధీచి, శివభక్త శరోమణి. ఆతని మాటలు నీకు ఆనందాన్ని కలిగిస్తాయి అని గ్రహించలేక పోయావు. దధీచి యజ్ఞ స్థలం నుండి వెళ్ళిన తరువాత కూడా నీవు ఆ మహర్షి మాటలను అర్ధం చేసుకో లేక పోయావు. ఆ పిదప నిన్ను ఉద్ధరించడానికి, జరగబోయే అనర్ధం ఆపడానికి నీ కూతురుగా పుట్టిన ఉమ నీవు పిలువక పోయినా నీ వద్దకు వచ్చింది. ఆమెను, నీ కూతురు గానే చూసావు కానీ, ఆమె మహత్తును తెలుసుకో లేదు".*
*"నీ కూతురు అయిన సతీదేవియే అంబ, ఉమ. సర్వలోక పూజ్య. అన్ని లోకాలకు తల్లి. మహాదేవుని భార్య. నీవు సతీదేవి ని బ్రహ్మ ఆజ్ణ ప్రకారం రుద్రునికి ఇచ్చి వివాహము చేసాను అనుకుంటున్నావు. ప్రకృతీ పురుషులకు వివాహం చేయడానికి మనమెవరము. వారు సృష్టి మొదలులోనే సతీపతులు, కదా! నీ గర్వమే నిన్ను ఇలా శివనిందకు ప్రేరేపించింది. సతీదేవి అయిన ఉమ సత్పురుషుల చేత నిత్యమూ ఆరాధింపబడుతుంది. ఆమె కళ్యాణ స్వరూపిణి. శంకరుని అర్ధాంగి. సతీదేవి పూజింపబడితే, అన్ని భయాలు దూరమౌతాయి, శుభాలు కలుగుతాయి. ఈ జగన్మాత అయిన సతీదేవియే, విష్ణుమూర్తికి, బ్రహ్మకు తల్లి. ఆమెయే శంభుని శక్తి. మహాదేవి. దుష్టులను అణవివేసే పరాత్పర శక్తి. "*
*" భగవంతుడు అగు శివుడే మనకందరకూ ఆరాధ్యుడు. అందరికీ శుభములు చేకూర్చువాడు. శివుడు, జగత్తును భరించి, పోషిస్తాడు, సకల విద్యలకు అధిపతి. అన్ని శుభకార్యములలో శుభమును ఇచ్చేవాడు. పూజలు అందుకోవలసిన వారిని పూజింపక పోవడం వలన అన్ని నష్టాలు, కష్టాలు కలుగుతాయి. దక్షా! నీవు పరమేశ్వరిని, పరమశివుని, వారి గొప్పదనాన్ని నీ అహంకారం వలన గుర్తించలేక పోయావు. వారిద్దరినీ ఆదరణ పూర్వకంగా గౌరవింవలేదు. ఇది నీకు మంగళకరము కాదు. నీ అధోగతికి నీవే పునాది వేసుకున్నావు."*
*"దౌర్భాగ్యము, కష్టకాలము నీ మీద అన్నివైపుల నుండి దాడి చేస్తున్నాయి. ఇప్పటి నీ పరిస్థితి చూసి కూడా ఏ వొక్కరూ నీకు సహాయ పడటానికి ముందుకు రారు. ఎందుకంటే నీవు చేసినది, మాతాపితరుల ద్రోహం. రుద్రుని ఆలోచనకు వ్యతిరేకముగా, సాక్షాత్తు శివభగవానుని ఎడమ భాగము నుండి పుట్టిన విష్ణుమూర్తి, నుదుటి నుండి పుట్టిన బ్రహ్మ కూడా నీ సహాయానికి రాలేరు. ఇక మహర్షులు, సనకసనందనాదులు, మిగిలిన దేవతలూ ఏపాటి వారు. వీరిలో ఎవ్వరూ కూడా నిన్ను, రుద్రుని క్రోధాగ్ని జ్వాలల నుండి కాపాడలేరు. విష్ణుమూర్తి, బ్రహ్మ, మిగిలిన దేవతా సమూహము లారా! మీరు కూడా వినండి. మీరందరూ ఇక్కడ నుండి సాధ్యమైనంత త్వరగా, వెంటనే వెళ్ళి పోండి. సభాస్థలిని ఖాళీ చేయండి. ఎందుకంటే, దక్షుని వినాశనము తధ్యము. దానిని ఎవరూ తప్పించలేరు. అతనికి బాసటగా నిలిచిన వారు ఎవ్వరూ కూడా మిగలరు. కనుక, మీరందరూ, దక్షుని విడిచి సభాస్థలి నుండి వెళ్ళి పోండి."*
*ఈ విధంగా పలికిన అశరీరవాణి, తరువాత మౌనం దాల్చింది.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు