*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 056*
 *ఉత్పలమాల:*
*నీలఘనాభమూర్తి వగు | నిన్నుఁగనుంగొనఁగోరి వేడినన్*
*జాలము సేసి దాఁగెదవు | సంస్తుతికెక్కిన రామనామ మే*
*మూలను దాచుకోగలవు | ముక్తికిఁబ్రాపది పాపముల కు*
*ద్దాలము గాదె మాయెడల | దాశరధీ ! కరుణాపయోనిధీ !.* 
తా: దశరధుని పుత్రుడా! దయకు సముద్రము వంటి వాడా! నీలి రంగు మేఘము వంటి శరీరము కలవాడవైన నిన్ను మా కన్నులారా చూడాలని ఎంత వేడినా కనపడ కుండా దాక్కుని వున్నావు. నీవు దాగుడు మూతలు ఆడుతున్నావు కానీ, నీ పేరుకు వున్న మహాత్యాన్ని ఎలా దాచ గలుగు తావు, దశరధ రామా! ముక్తి ని ఇవ్వగలగినది నీ నామము. మేము చేసే పాపాలను కూకటి వేళ్ళతో పెకలించి వేసే గొడ్డలి వంటిది కదా రామనామ మహిమ, కౌసల్యా నందనా!.... అని భద్రాచల రామదాసుగా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*నీవు ఎన్నో మాయలు మర్మాలు చేసి మమ్మల్ని ఏమార్చాలని చూస్తే, అసలే మానవులం, గుండె దిటవు లేని వాళ్ళం, నీ మాయలు తట్టుకుని ఎలా నిలబడ గలుగుతాము, అనుకున్నావు దాశరధీ! మేము హనుమలము కాదు, నీ తత్వ రహస్యాన్ని తెలుసుకోవడానికి. పరమశివులము కాము, మీరు రామావతారం ఎత్తిన విష్ణుమూర్తి అని తెలుసుకుని నమస్కరించడానికి. నీ తండ్రి దశరధుడే నీ మాయలో వుండి, నీవు భగవానుడవు అని తెలుసుకో లేకపోయాడు. ఇక మే మెంత, కరుణా సముద్రా! ద్రౌపది కి అక్షయ పాత్ర ఇచ్చావు. భరతుడికి పాదుకలు ఇచ్చావు. శత్రవు అయినా విభీషణుని కి రాజ్యం ఇచ్చావు. మరి నీ వారము, నీ దాసానువదాసులము అయిన మా మీద కినుక ఎందుకు స్వామీ! వేగమే వచ్చి కాపాడు తండ్రి!.......*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు