*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 058*
 *ఉత్పలమాల:*
*తప్పులెరుఁగక లేక దురి | తంబులు సేసితినంటి, నీవు మా*
*యప్పవుకావు మంటి నిఁక | నన్యులకున్ నుదురంటనంటి నీ*
*కొప్పిదమైన దాసతతి కొప్పిన బంటుకు బంటునంటి నా*
*తప్పులకెల్ల నీవెగతి | దాశరధీ ! కరుణాపయోనిధీ !* 
తా: కరుణా సముద్రా! దశరధరామా! మేము చేసే పనులు తప్పులు అని తెలియక ఎన్నెన్నో పాపాలు చేసాము, నీవే మా తండ్రివి కనుక కరుణించి దయతో కాపాడమని అడిగాము, నిన్ను తప్ప ఇంకొకరిని దైవముగా అనుకుని నమస్కారాలు, పూజలు చేయము అని నీకే చెప్పాము కదా రామభద్రా! నీకు ఎంతో ఇష్టమైన నీ దాసులైన వారికి అందరికీ మేము దాసులము అని కూడా చెప్పాము నీకు. మేము చేసే తప్పుల నుండి మమ్మల్ని కాపాడ గలిగేది నీవు ఒక్కడవే రమాభిరామా!.... అని భద్రాచల రామదాసుగా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*"చరణములే నమ్మతీ! నీ దివ్య చరణములే నమ్మతీ!  చంచలగుణములు మాని సదా నిశ్చల మదినుండే దెన్నటికో! పంచ తత్వములు తారకనామము పఠియించుట నాకెన్నటికో!" రామా! తారకనామా! కరుణా సముద్రా! అంతా నీవే! అన్నిటా నీవే! ఈ చరాచర జగత్తు నీవే! సకల భూనభోంతరాలు నీవే! నీవు గాక వేరేమున్నది రామభద్రా! కానీ, నీవే సృష్టించిన మాయ మమ్మల్ని ఈ సత్యం నుండి దూరం చేస్తోంది. అన్యధా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ! నీ మాయలో పడి, మాకు తెలియకుండా మేము చేసే తప్పుల నుండి మమ్మల్ని నీవే రక్షించాలి, మా కన్నతండ్రీ! సీతమ్మా, మా యమ్మా! తల్లీ! మీ ఆయన పని ఒత్తిడి లో పడి మాపై పరాకు చేస్తాడేమో! ఓకంట కనిపెట్టి వుండు తల్లీ!, జనకరాజ పుత్రీ!.......*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు