*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 065*
 *చంపకమాల:*
*చరణము సోకినట్టి శిల | జవ్వనిరూపగు టొక్క వింత సు*
*స్థిరముగ నీటిపై గిరులు | దేలున దొక్కటి వింతగాని మీ*
*స్మరణఁదనర్చు మానవులు | సద్గతిచెందిన దెంత వింత, యీ*
*ధరను ధరాత్మజారమణ | దాశరధీ ! కరుణాపయోనిధీ !* 
తా: భద్ర్రాద్రిపై కొలువుండి, కరుణా నిధివైన! దశరధరామా!  భూమాత కూతురు అయిన సీతాదేవికి భర్త అయిన నీ పాద స్పర్శ వల్ల రాయి అందమైన యువతిగా మారటం ఒక వింత అవ వచ్చు. నీ నామ మహిమతో బండ రాళ్ళు సముద్రపు నీటిపైన తేలియాడడము కూడా వింత గావచ్చు. కానీ, ఈ భూమి మీద నీ నామ స్మరణలో వున్న మానవులు మోక్షము పొందటం ఏమంత విశేషమా! ఏమాత్రం కాదు! .......అని భద్రాచల రామదాసుగా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*"ఉండేది రాముడొకడు ఊరక చెడి పోకు, మనసా!" అని త్యాగరాజు గారు తనకు తాను చెప్పుకుంటూ మనల్ని కూడా హెచ్చరిస్తున్నారు. రాముడు, పరంధాముడు, పరాత్పరుడు, పరమేశ్వరుడు ఒక్కడే నిజం. పరమేశ్వరుడు లేని రాముడు లేడు. పరంధాముడు లేని శంభుడు లేడు. అంతా ఒకరే అయిన ఆ హరి నామాన్ని మన జీవత నావకు చుక్కానిగా చేసుకుని, మనం శంభుని మాయలో పడి కొట్టుకు పోకుండా, వైతరణిని దాటడానికి చేసే మన ప్రయాణ ప్రయత్నం చెదిరి పోకుండా వుండేటట్లు ఆ దేవదేవుని సహాయం కోసం అర్రులు చాస్తూ... మనల్ని ముందుకు నడిపించమని వేడుకుంటూ, సాగిలపడదాము........*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు