మనపై మనకు నమ్మకమే మంత్రం;-సి.హెచ్.ప్రతాప్ ;- సెల్ 91468 27505
 వాల్ట్ డేవిస్ ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఒక గొప్ప అథ్లెట్ క్రీడాకారుడు. అతను జీవితంలో సాధించిన విజయాలు బహుశా ఈ శతాబ్దంలో ఏ ఇతర అథ్లెట్  క్రీడాకారుడు సాధించలేదంటే అతిశయోక్తి కాదు. అతని జీవిత కధ నేటి యువతరానికి ఎంతో స్పూర్తిదాయకం.
చిన్నతనంలో అతనికి ఇంఫాం టైల్ పరాలిసిస్ అని  అరుదైన వ్యాధి సోకింది.అందువలన రెండు కాళ్ళు సన్నబడిపోయి సరిగ్గా నిలబడ లేక పోయాడు. శారీరక శ్రమ లేకపోవడం వలన అనేక ఇతర అనారోగ్యాలు కలిగి ఆరోగ్యం క్షీణించింది. అయితే అతని తల్లిదండ్రులు అతనితో రాత్రింబవళ్ళు సహాయకంగా వుండి సపర్యలు చేస్తూ అతని ప్రాణాలు కాపాడు కోగలిగారు. ఆ వ్యాధి సోకిన రెండేళ్ళు మంచం పై వుండి తర్వాత లేచి నెమ్మదిగా నడవడం ప్రారంచించాడు. ఒకరోజు పేపర్ లో హై జంప్ లో ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించిన ఒక క్రీడాకారుడి ఫొటో చూసి తాను కూడా హైజంప్ సాధన చెయ్యాలని ధృఢంగా నిర్ణయించుకున్నాడు. కాస్త ఆరోగ్యం చక్కబడ్డాక హై జంప్ కోసం ఆ ఊరి స్కూల్ కోచ్ ను తనకు సహాయం చెయ్యమని ఆర్ధించాడు. మొదట్లో నిరాకరించినా, తర్వాత ఆ బాలుడు పట్టుదల, మొండితనం చూసి అందుకు ఆ కోచ్ ఒప్పుకున్నాడు. ఆ రోజు నుండి వాల్ట్ డేవీస్ జీవితంలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమయ్యింది. ఒక వైపు శక్తి, ఆరోగ్యం పుంజుకునేందుకు ప్రత్యేక వ్యాయామాలు, మరొక పక్క లాంగ్ జంప్ ప్రాక్టీసు చేసేవాడు. తల్లిదండ్రులు 24 గంటలు పక్కన నిలబడి అతనిని సాధనలో కావాల్సిన సహాయసహకారాలు అందించేవారు.అయితే 18 సంవత్సరాల వయస్సులో అతనికి వివాహమయ్యాక అతని జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభమయ్యింది. అతడి భార్య అతడితో నీకు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ఎంతో అవసరం, దానిని సైతం పెంచుకో, జీవితంలో ఇప్పటివరకు ఏం జరిగినా దానిని పట్టించుకొనక, ఇక ముందు భవిష్యత్తులో విజయాలను స్వంతం చేసుకునేందుకు నీపై నీకు నమ్మకం, విశ్వాసం ఎంతో అవసరం కాబట్టి నిన్ను నువ్వు నమ్ముకో  అని ఎంతో ధైర్యాన్ని నూరిపోసేది. చిన్నతనంలో దారుణంగా విఫలమై, తర్వాత అద్భుత విజయాలను స్వంతం చేసుకున్న అనేకమంది జీవిత చరిత్రలను డేవిస్ కు చదివి వినిపించేది. దానితో అతనిలో ఎంతో మొండి పట్టుదల, ధైర్యం , తెగువ అలవడ్డాయి.
సాధన మరింత ముమ్మురం చేసాడు. జాతీయ, అంతర్జాతీయ పొటీలలో పాల్గోని అనేక పతకాలు సాధించాడు.హై జంప్ లో అనేక ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు. నీపై నీకు నమ్మకం ఎంతో ముఖ్యం అన్న భార్య మాటలే అతనికి మంత్రంగా పనిచేసాయి.
సి హెచ్ ప్రతాప్ కామెంట్‌లు