సముద్ర జిగట చేప;-కంచనపల్లి వేంకట కృష్ణారావు-9348611445

 సముద్రం అనేక వింత జంతువులు, చేపలకు నిలయం.ఒక్కక్క ప్రాంతంలో ఒక్కో రకమైన సముద్ర జీవాలు నివసిస్తుంటాయి!
      ఆస్ట్రేలియా ఉత్తర కోస్తా ప్రాంతం,ఆఫ్రికా,మెక్సికో ప్రాంతపు సముద్ర జలాల్లో ఒక వింత జంతువు నివసిస్తుంది! దీన్ని తెలుగులో 'జిగట చేప'అంటారు, ఇంగ్లీషులో 'జెల్లీ ఫిష్' అంటారు.కానీ ఇది చేప ఆకారంలో ఉండదు.బాగా ఎదిగిన జిగట చేప ఇంచుమించు ఒకఫుట్ బాల్ పరిణామంలో ఉంటుంది.దీనికి 60 వేలాడే కాళ్ళు(టెంటకిల్స్) ఉంటాయి.ఇవి దాదాపు2.5 మీటర్ల పొడవు ఉంటాయి.ఇది జిగటగా పారదర్శకంగా కనబడుతుంది.ఒక్కొక్క సారి సముద్రపు నీటిలో కలసిపోయి మన కంటికి సరిగా కనబడదు! దీన్ని ఆంగ్లంలో''బాక్స్ జెల్లి ఫిష్' అనికూడా అంటారు.దీని అర్థంగ్రీకు, లాటిన్ భాషల్లో 'హంతక హస్తం'అని.ఇది చాలా ప్రమాదకరమైనది.దీని టెంటకిల్స్ మీద అతి సన్నని ముళ్ళు ఉంటాయి.వీటి సహాయంతో ఇది తనకు అడ్డు వచ్చిన జంతువును కుడితే రెండు మూడు నిముషాల్లో మరణం సంభవించవచ్చు.దీని విషం నాగుపాము విషం కంటే ప్రమాదకరం.ఇది కుడితే వళ్ళంతా విపరీతమైన మంట పుడుతుంది.1956వరకు శాస్త్రజ్ఞులు దీనిని గురించి అంతగా పట్టించుకోలేదు.కానీ సముద్ర తీరాల్లోదీని కాటు వలన అనేక మంది చనిపోతుండటం వలన దీని మీద శాస్త్రజ్ఞులు పరిశోధనలు మొదలు పెట్టారు.
      1943లో డా॥ రోనాల్డ్ అనే ఆస్ట్రేలియా డాక్టరు దీనిని మొట్టమొదట గుర్తించి, దీని వివరాలు పొందు పరిచాడు.దీనిని కొత్త జాతిగా గుర్తించి ' ఖీరోనెక్స్ ఫ్లేకరీ' అనే శాస్త్రీయ నామం పెట్టాడు.దీనికి నాలుగు కళ్ళు ఉంటాయి.కానీఇవివస్తువులను,జంతువులను 
చూడలేవు.కాంతిలో కలిగే మార్పులను మాత్రమే గుర్తిస్తాయి. అందువలన ఇది దేనికీ గుద్దుకోదు.
      ఒక జెల్లీ ఫిష్ లోని విషాన్ని పూర్తిగా తీస్తే ఆవిషంతో 20మందిని చంపవచ్చు! ఇది జిగటగా చాలా సున్నితంగా ఉంటుందికనుక, తన రక్షణ కోసంవిషాన్ని రూపొందించుకుందని  శాస్త్రజ్ఞుల వివరణ.దీని విషం గుండె కండరాల మీద పని చేస్తుంది.అందువలన ఇది కుట్టిన రెండు మూడు నిముషాల్లో గుండె ఆగిపోతుంది! 1966లో దీని విషాన్ని శాస్త్రజ్ఞులు సేకరించ గలిగారు.దీని విషంతోఆంటీవెనమ్(విషాన్ని విరచే మందు) తయారు చేయగలిగారు.
     1978 లో ఈ జిగట చేప కుట్టిన బాలికను ఆస్ట్రేలియాలో ఈ విరుగుడు మందు ఇచ్చి రక్షించ గలిగారు.
             ******         *******

కామెంట్‌లు