ప్రపంచ అనువాద దినం నేడు ; -కంచనపల్లి వేంకట కృష్ణారావు-9348611445

 అనువాదం అనే ప్రక్రియ ఎప్పటినుండో ఉంది.సంస్కృత భారతాన్ని నన్నయ్య తెలుగులోకి అనువదించి మనం సులభంగా చదువుకునేట్టు చేసాడు కదా! కుమారజీవుడు(శాలి వాహన శకం) 344 లోసంస్కృత భాషలోని బౌద్ధ గ్రంథాలనుచైనాభాషలోకి అనువదించాడు.అసలు అనువాదం అంటే సంస్కృత భాషలో పునఃకథనం అని అర్థం.ఒకరు చెప్పినదానిని మరొకరు సుందరంగా వారి భాషలో  చెప్పడం!
       ఎన్నో కావ్యాలు, ఉపనిషత్తులు, పురాణాలు తెలుగులో లభిస్తూ ఎంతో (వి)జ్ఞానాన్ని పంచుతున్నాయి!
         ఇవే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రకరకాల సాహిత్య ప్రక్రియలు వివిధ దేశాల అనువాదకులువారివారి భాషల్లో అనువదిస్తూ పాఠకులకు ఆ గొప్ప రచయితలను పరిచయం చేస్తున్నారు. బంకించంద్ర ఛటోపాధ్యాయ, శరత్ చంద్ర ఛటర్జీ, రస్కిన్ బాండ్ కథలు, ఎడ్గర్ ఆలెన్ పో కథలు, షేక్స్పియర్ నాటకాలు, కాశ్మీరీ తరంగణి మొదలైన ఉత్తమ రచనలు తెలుగులో చదివితే ఎంత ఆనందం.తెలుగులో నాకు తెలిసినంత వరకు కీ.శే.శాంతా సుందరి ఎన్నో ఆంగ్ల పుస్తకాలను అనువదించారు వెన్నా వల్లభరావు త్రిపురనేని గోపీచంద్ కథల సంపుటి'తండ్రులు కొడుకులు' హిందీలోకి అనువదించారు.కొల్లూరి సోమశంకర్ అనేక హిందీ,ఆంగ్ల రచనలనుతెలుగులోకి అనువదించడమే కాకుండా అనేక తెలుగు రచనలను హిందీలోకి అనువదించాడు.
     ఇలపావులూరి పాండురంగారావు హిందీకవి జయశంకర్ ప్రసాద్ వ్రాసిన'అ(సూ 'కావ్యాన్ని 'కన్నీరు'
గా అనువదించారు.
       ఎల్.ఆర్.స్వామి కేరళీయుడైనా తెలుగులో విశేష కృషి చేసి అనేక తెలుగు రచనలు చేశాడు. 'సూఫీ పరంజ కథ'ను మళయాళం నుండి తెలుగులోకి అనువదించాడు దీనికి సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది.ఉప్పల లక్ష్మణ రావు అనేక రష్యను పుస్తకాలను అనువదించాడు.
      అసలు సెప్టంబరు 30 అనువాద దినంగా ఎందుకు నిర్ణయించారు?  ఎందుకంటే సెయింట్ జీరోమ్ అనే ప్రీస్ట్ గ్రీకులో ఉన్న బైబిల్ని అప్పటిలో లాటిన్ భాషలోకి అనువదించాడు. ఆయన బెత్లహాంలో క్రీ.శ. 420 సెప్టంబరు 30 న చనిపోయాడు.అందుకని సిప్టంబరు 30 ని ప్రపంచ అనువాద దినంగా నిర్ణయించారు.
        ఎన్నో అధ్బుత అనువాద పుస్తకాలు దొరుకుతున్నాయి.మంచి పుస్తకం దొరికితే కొని తప్పకుండా చదవండి వేరే దేశ రచయితతో సంభాషించినట్లుంది కదా!
             ******     ******

కామెంట్‌లు