ఒకరోజు ఒక వడ్రంగి వాడి కలలో శ్రీకృష్ణుడు కనిపించి మర్నాడు నీకోసం నీ ఇంటికి రాబోతున్నాను కాబట్టి నా కోసం వేచి వుండు అని చెప్పాడు. వెంటనే నిద్ర లేచిన ఆ వడ్రోంగి వాడికి అవధులు లేని ఆనందం కలిగింది. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, జగద్గురువు అయిన శ్రీ కృష్ణ పరమాత్మ కడు పేదవాడు, రెక్కాడితేగాని డొక్కాడని తన వంటి ఒక కష్టజీవి ఇంటికి రావడం నిజంగా తాను ఎన్నో జన్మల నుండి చేసుకున్న పుణ్యం కదా తెగ సంతొషపడిపోయాడు.
మర్నాడు తన పనికి కాస్త విరామం ఇచ్చి ఇంటి ముందు గది కిటికీ వద్ద కూర్చుని , ఆ రోడ్డుపై వచ్చి పోయే వారిని చూడసాగాడు.ఏమాత్రం ఏమరుపాటుగా వున్నా భగవంతుడిని మిస్సవుతానేమోనని అతి జాగ్రత్తగా, రెప్ప కూడా వాల్చకుండా రోడ్డు వైపు చూడసాగాడు.
ఒక సమయంలో ఒక పేద స్త్రీ ఒక చంటి బిడ్డడిని ఎత్తుకొని అందరినీ అడ్డుకుంటోంది. చంటి బిడ్డకు ఇచ్చేందుకు ఆమె వద్ద గుక్కెడు పాలు కూడా లేవు.దీనంగా అందరినీ అడుక్కుంటున్నా అందరూ పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారు. ఆ సన్నివేశం చూసిన ఆ వడ్రంగి హృదయం ద్రవించింది. వెంటనే ఆ స్త్రీని పిలిచి తన ఇంటి వసారాలో కూర్చోబెట్టి, తినడానికి తిండి, త్రాగడానికి నీళ్ళు,కట్టుకోవడానికి ఇంట్లో వున్న పాత బట్టలు ఇచ్చాడు. అవి తిని, తాగి కాసేపు సేద తీరాక ఆ స్త్రీ వడ్రంగికి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయింది.
తిరిగి రోడ్డున పోయే వారిని గమనించసాగాడు ఆ వడ్రంగి. ఏ క్షణంలోనైనా శ్రీకృష్ణ పరమాత్మ రావచ్చునన్న నమ్మకం అతనిలో మెండుగా వుంది. కాస్సేపటికి ఒక వృద్ధుడు బరువైన మూటలను వీపున మోసుకుంటూ ఆ వీధి గుండా వెళ్తున్నాడు. ఆ సమయంలో ఎండ హెచ్చుగా వుంది. చెమటలు కక్కుకుంటూ, ఆ బరువును మోయలేక ఆ వృద్ధుడు నానాయాతనలు పడుతున్నాడు. వెంటనే వడ్రంగి మనస్సులో మానవత్వం మేల్కొంది. రోడ్డు మీదకు వెళ్ళి ఆ వృద్ధుడిని తన ఇంటి వసరాలో కూర్చోబెట్టి, తినడానికి, తాగడానికి ఇచ్చి ఆ మూటలను పక్క వీధిలో వున్న దుకాణానికి చేర్చడానికి సహాయపడ్డాడు.నూరేళ్ళూ చల్లా జీవించు నాయనా అని వృద్ధుడు వడ్రంగిని ఆశీర్వదించాడు.
అలా ఆ రోజులో ఇంకొంతమందికి వడ్రంగి సహాయం చేసాడు. అర్ధరాత్రి అయ్యింది . ఇక నిద్ర ఆపుకోలేక, శ్రీకృష్ణుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదన్న నిరాశ తో వడ్రంగి నిద్రపోయాడు. ఆ రాత్రి కలలో అతనికి మళ్ళీ శ్రీకృష్ణుడు కనిపించాడు. ఆయన ముఖం ఎంతో ప్రసన్నంగా వుంది. " నేను రాలేదన్న కోపం వద్దు. నేను ఈ రూపంలో కాకుండా ఒక బిచ్చగత్తె, ఒక వృద్ధుడు,ఆకలితో అలమటిస్తున్న ఒక చిన్న పిల్లవాడు, గాయపడి బాధతో అరుస్తున్న ఒక వీధి కుక్క, దెబ్బ తగిలి రక్తం ఓడుతున్న ఒక పావురం ఇలా అనేక రూపాలతో నీ ముందుకు వచ్చాను. వారందరిలో నేను అంతరాత్మగా వున్నాను.అందరికీ నువ్వు నిస్వార్ధంతో చేతనైన సాయం చేసి నీ మానవతా ధర్మాన్ని నెరవేర్చావు. నీకు నా ఆశ్శీస్సులు సర్వదా వుంటాయి"
ఆ కలతో మెలకువ వచ్చిన వడ్రంగి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
సి హెచ్ ప్రతాప్
ఫ్లాట్ నెంబర్ : 405 ,శ్రీ బాలాజీ డిలైట్స్
రాహుల్ కోలనీ, ఎ ఎస్ రావు నగర్
సాయి సుధీర్ కాలేజీ వద్ద
హైదరాబాద్ 500 062
మానవత్వం;-సి.హెచ్.ప్రతాప్ - సెల్ ; 95508 51075
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి