"దేవుడెక్కడ?";-మూలం - ఓషో ;అనుసృజన - యామిజాల జగదీశ్
"దేవుడా, 
నాతో మాట్లాడవా?"
అని ప్రార్థించాడు.

అప్పుడు 
అతని సమీపంలో 
ఒక కోకిల కూసింది!
కానీ 
దానినతను గమనించలేదు!!

"దేవుడా,
నాతో మాట్లాడవా?"
అని పెద్దగా అరిచాడతను.

అప్పుడు 
ఆకాశంలో పిడుగుపాటు 
వినిపించింది!
దానినీ
అతను గమనించలేదు!!

"దేవుడా, 
నిన్ను నేను ఇప్పటికిప్పుడు
చూడాలి" అని ప్రాధేయపడ్డాడు.

అప్పుడు 
ఆకాశంలో ఓ నక్షత్రం
దేదీప్యమానంగా మెరిసింది!
దానినీ 
అతను గమనించలేదు!!

"దేవుడా, 
నాకొక ఆశ్చర్యాన్ని చూపించు"
అని వేడుకున్నాడు.

అప్పుడు 
అతనికి దగ్గర్లో 
అప్పుడే పుట్టిన ఓ శిశువు 
ఏడుపు వినిపించింది!
దానినీ 
అతను గమనించలేదు!!

"దేవుడా, 
నువ్వు 
నా పక్కనే ఉన్నావనే నిజాన్ని
గ్రహించాలంటే
నువ్వు నన్ను తాకాలి" అన్నాడతను.


అప్పుడు 
అతని భుజంమీద 
ఓ అందమైన సీతాకోకచిలుక
వాలింది!!
అయితే 
అతను దానిని చేత్తో 
నెట్టేసాడు...!!

దేవుడు మన చుట్టూ
చిన్న చిన్న తేలికైన విషయాలలో ఉంటాడు!
కనుక వాటిని గమనించడంలో నిర్లక్ష్యం తగదు!!

ఎందుకంటే 
దేవుడు 
మీరనుకున్న రూపంలోనే 
వస్తాడనుకుని
నిరీక్షించకూడదు!!

దేవుడు 
అన్ని రూపాలలోనూ
అన్నివేళలా
మనతో ఉంటాడు, ఉన్నాడు!!
-------------------------------------------


కామెంట్‌లు