చుక్కలు మొలుచుకొస్తున్నాయి!!?;- ప్రతాప్ కౌటిళ్యా
మూత బడిన రెప్పల చాటున
చీకటినంత తీసుకెళ్ళింది
రేపటి ఉదయం కోసం!!

మూతబడిన పెదవుల మాటున
మాటలన్నీ ఇచ్చిన మాట కోసం
మూగబోయినవీ!!
రేపటి పసిపాపల బోసినవుల కోసం!!

సృష్టిలో అరుదైన ఆడజన్మ విశ్వముఖమై
ఆఖరి శోకమై మిగిలింది!!

చెట్టుకు పూసిన పూలు రాలినప్పుడు
పుడమి పులకించింది.
ఆకులు రాలినపుడు పురిటి నొప్పులతో
మట్టి మళ్ళీ తనలో కలుపుకుంది!!?

చెట్టు కాయలు కాసినప్పుడు నెమలికన్నుల్లా
నీలంతా నాట్యం చేసింది
ఉడుత కడుపు నిండింది!!?

ఇంటిముందు నక్షత్రాలు జ్ఞాపకాల తోరణాలై
ఒక్కొక్కటి ఎండిపోతున్నాయి!!

ఇంటి వాకిట్లో సముద్ర కెరటాలు
ముత్యాల ముగ్గులు రత్నాల రథాలు
దిద్ది ఆగిపోతున్నాయి!!

లేగ దూడలు దాచిపెట్టిన ఉట్టిలోని పొదుగు పాలమీగడలు మింగేసిన
దేవునికి ఇంకా ఆకలిగానే ఉంది!!?

చల్లని చందమామతో దాగుడుమూతలు
ఆడుతున్న మేఘం
గాలి ఆటలో గాలిపటమై ఎగురుతుంది
ఎప్పటికీ కిందికి దిగుతుందో తెలియదు!!

ఇల్లు అలికి ముగ్గులు వేసి తలుపులు తెరిచి
వెలుతురును పెళ్లికూతురును చేసిన అమ్మ
ఇంకా వేచి చూస్తూనే ఉంది
లక్ష్మీదేవి కోసం!!?

పందిరి గుంజల కాళ్లకు పారాణి అద్దినట్లు
పచ్చని ఆకుల నీడలో
పీటలపై కూర్చున్న పచ్చని పక్షుల జంట
పరిమళాల తోటల్లో
తేనెటీగల పాటలకు పరవశించిపోతున్నాయి!!?

అడవిలో పూసిన గడ్డిపువ్వు
గులాబీని చూసేందుకు
పర్వతం దాటి వచ్చింది!!

ఉరుములు మెరుపులతో ఆకాశం
ఉగ్రరూపంలో ఉందేమో
తుపానుతో సందేశం పంపింది

గులాబీ కాలం చేసిందని
ఒక్కసారి అడవి అంతా ఆకాశంలా
 మారింది
రాత్రికి చుక్కలు మళ్లీ మొలుచుకొస్తాయి!!?

ధనాల ధనలక్ష్మి స్మృతిలో
23/09/2022- .     

Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏

కామెంట్‌లు