"హృదయ సంస్కారం";-ఎం బిందుమాధవి
 సాధారణంగా ఎదుటి వారిలో గొప్పతనాన్ని హృదయపూర్వకంగా ప్రశంసించగల ఔదార్యం..హృదయ వైశాల్యం, సంస్కారం మనలో ఉండవు.
అంతే కాదు..ఎదుటి వారు శత్రువైతే వారిలో లోపాలు వెతకటానికి ప్రయత్నిస్తాము. లేనిపోని అవలక్షణాలు అంటగట్టటానికి ప్రయత్నిస్తాము. అలా తృప్తి పడటం ఒక మానసిక దౌర్బల్యం!
రామాయణంలో ఇదే విషయాన్ని వివరించే సందర్భంలో రాముడు, ఆంజనేయుడు ఎలా స్పందించారో చూద్దాం!
@@@@
సీతాన్వేషణలో భాగంగా హనుమ లంకలో ప్రవేశించగానే..ముందుగా ఉద్యాన వనాలు, గృహాలు, పుష్పక విమానం...అన్నీ వెతికి రావణాంతః పురానికి వెళతాడు.
అక్కడ అనేక రకాల స్త్రీల మధ్యలో నిద్రిస్తున్న రావణుడిని హనుమ చూశాడు. ఆ సమయంలో రావణుడు నల్లని కాటుక కొండ లాగా, ఆకాశంలో సంధ్యారాగ ప్రభావితమై మెరుపులతో ఉన్న నల్లటి మేఘం లాగా.. ఉన్నట్టు భావిస్తాడు.
వృక్షములతోను..పొదలతోను నిండిన మంధర పర్వతమే నిద్రిస్తున్నదా అనుకుంటాడు. సురాపానం చేసి..వివిధ స్త్రీలతో సంభోగించి గురక పెట్టి నిద్రపోతున్న రావణుడిని చూసి పరస్త్రీలని అపహరించే దుర్మార్గుడు అని అసహ్యించుకుంటాడు.
రావణుడి సిరి సంపదలని..ఐశ్వర్యాన్ని, అతని బాహ్య సౌందర్యాన్ని, శరీర సౌష్ఠవాన్ని, శరీర దారుఢ్యాన్ని, నిండైన బాహువులని చూసి ఇతను శిఖరాలతో కూడిన మంధర గిరిలాగా ఉన్నాడు అనుకుంటాడు.
అశోకవనంలో శింశుపా వృక్షపు కొమ్మల్లో కూర్చుని సీతని భయపెట్టటానికి వచ్చిన రావణుడిని హనుమ రెండవ సారి చూశాడు.
రావణుడిలో ఉండే కామము, మదము, గర్వము, శృంగార భావంతో కలిగే మత్తు... స్త్రీల పట్ల అతనికి గల కామాతురత చూసి ఇతను తనకున్న బలపరాక్రమాలతో ఎంత దుస్సాహసానికైనా ఒడిగట్టగలడు అనుకుంటాడు.
@@@@
కార్య సాధన కధలో హనుమంతుడు బ్రహ్మాస్త్రం తనను బంధించలేదని తెలిసీ... రావణ సభకి వెళ్ళి అతన్ని దర్శించటమే ధ్యేయంగా తనకి తానుగా కట్టుబడ్డాడు అని ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా!
అలా కట్టుబడినట్టు పడి ఉన్న హనుమని ఇంద్రజిత్తు రావణ సభకి తీసుకు వెళతాడు. అక్కడి కొలువుకూటం..అందులోని రాక్షస వీరులతో, మంత్రులతో పరివేష్ఠించి సింహాసనంపై ఉన్న రావణాసురుడిని హనుమ పరికించి చూసి ఆశ్చర్యానికి లోనవుతాడు.
పైన చెప్పుకున్నట్టు అప్పటికే హనుమ రావణుడిని రెండు సార్లు చూసి ఉన్నాడు.
ఇది మూడవసారి. అయినప్పటికీ... చూడగానే.. అతని తేజస్సుకి ఆకర్షితుడై..ఆశ్చర్యంతో ఏ విధమైన భేషజము లేకుండా తన మనసులో
"మంత్రాంగం నెరపుటలో సమర్ధులైన వారు..తన మేలు కోరేవారూ అయిన మంత్రులతో సేవింపబడుతున్న దేవేంద్రుడి లాగా ఉన్నాడు. మహా వైభవోపేతుడై మేరు శిఖరం మీద నిలిచిన సజల మేఘం లాగా ఉన్నాడు."
"ఆహా ఈ రావణుని రూపము అత్యద్భుతం! ధైర్యం నిరుపమానం! సత్త్వం ప్రశంసార్హం! తేజస్సు అసదృశం! నిజముగా ఈ రాక్షసరాజు సర్వ లక్షణ శోభితుడు. పర స్త్రీలని చెరబట్టటం అనే అధర్మం చేసి ఉండకపోతే ఈ రావణుడు దేవేంద్రునితో కూడిన సురలోకానికి ప్రభువై ఉండేవాడు. ఇతను క్రుద్ధుడైతే ఇతనికి కల మిక్కిలి పరాక్రమంతో సమస్త జగత్తును సముద్రమున ముంచి ప్రళయాన్ని సృష్టించ గల సమర్ధుడు. బలమైన సచివులచే పరివృతుడైన ఈ రావణుడు నాలుగు సముద్రాలచే పూర్తిగా ఆవరింపబడిన భూమండలం లాగా ఉన్నాడు" అనుకుంటాడు.
@@@@
యుద్ధ కాండలో లంకలో యుద్ధం జరుగుతూ ఉండగా... ఇరుపక్షాల బల అతి బల సేనలందరూ హతులవుతారు. తన దగ్గర ఉన్న అతి బలవంతులైన వీరులందరితో పాటు తన కుమారుడైన అక్ష కుమారుడు, సేనా నాయకుడైన ప్రహస్తుడు కూడా హతులయ్యాక రావణుడు క్రోధంతో యుద్ధ భూమికి బయలుదేరుతాడు.
మొదటి సారిగా యుద్ధ భూమిలో రావణుడిని చూసిన రాముడు...తాను స్వయంగా త్రిలోకాలని జయించగల శక్తి సంపన్నుడై ఉండీ... "అహో ఇతనిది ఏమి తేజస్సు? యమ దేవేంద్రుల దర్పాన్ని పోగొట్టిన ఈ రావణుడు సూర్యుడి లాగా ప్రకాశిస్తున్నాడు. ఇతని శరీరం వింధ్య పర్వత సమానంగా ఉంది. కిరణాలు వ్యాపించి ఉండటం వల్ల ఈ రావణుడు సూర్యుని వలె చూచుటకు శక్యము కాకున్నాడు. చుట్టు తేజస్సు వ్యాపించి నందువల్ల ఈతని రూపము స్పష్టంగా చూడలేకపోతున్నాను."
"దేవ దానవ వీరుల శరీరము కూడా ఈ రావణుని శరీరం లాగా ప్రకాశించదు. ఇతను మహాత్ముడు. ఇతని యోధులందరూ పర్వతాలతో యుద్ధం చెయ్యగల ధీరులు."
"ప్రకాశించే దేహం కలవారు, చూడటానికి భయం కలిగించేవారు, క్రూరులు, పెద్ద దేహం కలవారు చుట్టూ ఉండగా ఈ రాక్షస రాజు యముని వలె ప్రకాశిస్తున్నాడు" అని ఏ దాపరికం..భేషజం లేకుండా రావణుని తేజస్సుని మెచ్చుకుంటాడు.
ఎదుటి వ్యక్తి లో గొప్పతనాన్ని..అతను తనకి శత్రువైనా...యధాతధంగా ఒప్పుకోగలగటం హృదయ వైశాల్యానికి..సంస్కారానికి నిదర్శనం.
ఒక వీరుడికే మరొక వీరుడి గొప్పతనం తెలుస్తుంది అనటానికి ఇదొక ఉదాహరణ.
అలాంటి సంస్కారాన్ని అందరం ప్రయత్న పూర్వకంగా అలవరచుకోవాలి.కామెంట్‌లు