*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - ద్వితీయ (సతీ) ఖండము-(0164)*
 *మహర్నవమి శుభాకాంల్షలతో...*
బ్రహ్మ, నారద సంవాదంలో.....
*దక్షుని తుదముట్టించాలని సమరోత్సాహంతో వీరభద్రుని కరాళనృత్యం*
*బ్రహ్మ, నారదునితో ఇలా చెప్పాడు -* 
*వేయి చేతులతో, విప్పారిన జటలతో, తన స్వామిని తూలనాడిన దక్షుని పై కోపముతో నిప్పుకణికల లాగా ఎర్రబడ్డ కన్నులతో, శూలం మొదలు ఇతర అయుధాలను చేత దాల్చి, ఎదరుపడ్డ శత్రువును దునుమాడాలనే యుద్ధోత్సాహంతో యజ్ఞ నాశనం చేయడానికి యజ్ఞ కుండము వైపు వస్తున్న వీరభద్రుని చూచి, గుండె దిటవులేని మునుల ఆయువులు అనంత వాయువులలో కలిసిపోయాయి. ఏ చేతిలోని ఏ ఆయుధం ఎవరిని ఎలా చంపుతుందో అని భయంతో యజ్ఞ స్థలంలో అటు ఇటు పరగులు పెట్టారు, ఇంకొంత మంది. వారిని చూచి, "మూఢులారా, మూర్ఖులారా, స్వచింతన మరచి దక్షుని మాటలకు అవునవునని విజ్ఞత కోల్పోయిన వారూ, నిలవండి ఎక్కడకు పారిపోతారు. శివ నింద చేసిన, సహకరించిన మిమ్మల్ని ఆదరించి, రక్షించేవారు ఈ మూడు భువనాలలో ఒక్కరు కూడా లేరు. విష్ణుమూర్తి, బ్రహ్మ చెప్పిన‌మాటలు కూడా మీ ఆలోచనలో మార్పు తీసుకు రాలేక పోయాయి. ఇంక మిమ్మల్ని ఆదరించే వారు ఎవరూ లేరు. మీరు అందరూ శివనిందకు కారకులైనందు వల్ల నా క్రోధం నుండి తప్పించుకోలేరు. సతీదేవి కి అంత అవమానం చేసిన మీకు దండన తప్పదు" అని వీరభద్రుడు పలికాడు.*
*ఇదంతా చూస్తున్న భృగు మహర్షి, యజ్ఞ నాశనము ఎవ్వరూ ఆపలేరు అనుకుని, తనని తాను మృగముగా మార్చుకుని, ఆకాశము వైపు వెళుతుండగా చూసిన వీరభద్రుడు, ఆ మృగమును పట్టుకుని నేలకు విసిరి కొట్టాడు. వీరావేశముతో భృగువు గుండెలపై కాలు వుంచి ఆతని మీసము, గడ్డములను పెరికి వేసాడు. దక్షుడు మహాదేవుని నిందిస్తున్నప్పుడు ఆనందగా చూస్తూ నవ్విన కారణంగా, చంద్రుడు పూషాదేవుని పళ్ళు పీకి వేసాడు. నంది భృగుని కాళ్ళు విరిచి వేసాడు. స్వధా దేవికి, స్వాహా దేవికి, దక్షిణా దేవికి రుద్రగణాలు రక రకాల బాధలు కలిగించారు.*
*బ్రహ్మ మానస పుత్రుడు అయి కూడా దక్షుడు భయముతో వణకిపోతూ, అంతర్వేది లో దాక్కున్నాడు. వీరభద్రుడు తన యోగ బలంతో, అంతర్వేది లో దాక్కుని వున్న దక్షుని బయటకు తెచ్చి, రెండు చెవులూ మూసి తన ఖడ్గముతో తలమీద గట్టిగా కొట్టి చంపే ప్రయత్నం చేస్తాడు. కానీ యోగ ప్రభావముచేత దక్షునకు ఏమీ కాలేదు. ప్రయోగించిన అన్ని అస్త్రములు దక్షుని ఏమీ చేయలేక పోయాయి. అప్పుడు, వీరభద్రుడు, దక్షుని గుండెల మీద తన పాదముతో తొక్కి పట్టి మెడను విరిచి వేస్తాడు. దక్షుడు నేలకు ఒరుగుతాడు. తానే అందరికంటే అధికుడను అనుకనే గర్వాంధుడు కాల గర్భంలో కలసిపోయాడు. అప్పుడు శివ ద్రోహి దక్షుని తలను యజ్ఞ కుండములో విసిరి వేస్తాడు, వీరభద్రుడు.*
*ఇక తన స్వామి ఇచ్చిన ఆదేశం పూర్తి అయింది అనే ఆనందాతిరేకంతో, తన స్వామిని కీర్తిస్తూ, వీరభద్రుడు కైలాసం చేరుకున్నాడు. తన శపథం నెరవేర్చి వచ్చిన‌ వీరభద్రుని, మిగిలి శివ పార్షదులను చూసి మహాదేవుడు, దుష్ట శిక్షణ జరిగింది అని మహాదనందాన్ని అనుభవించాడు. వీరభద్రుని ప్రమథగణాలకు అధ్యక్షుడిగా చేసాడు, శివ మహాదేవుడు.*
*ఎంతటి బలవంతులైనా, విజ్ఞత కలవారైనా అహంకారం తో విర్ర వీగితే దక్షునికి పట్టిన గతే పడుతుంది. పరమేశ్వరుడు కూడా సహాయ పడలేడు. కానున్న పరిణామాన్న ఆపలేడు.*
 *ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు