*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - ద్వితీయ (సతీ) ఖండము-(0167)*
 *విజయదశమి శుభాకాంక్షలతో...*
బ్రహ్మ, నారద సంవాదంలో.....
*విష్ణుమూర్తి క్షువునకు సహాయపడుట - దధీచి శాపము - మృత్యుంజయ మంత్ర అనుష్టానము - దధీచి అవ్యధుడు అగుట - క్షువునకు ఊరట కలిగించుట*
*శుక్రాచార్యుడు, దధీచి కి "మహామృత్యుంజయ ధ్యానము" తెల్పుట*
*"త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనమ్"*
*"ఉర్వారుక మివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్"*
*హస్తాంభోజయుగస్థ కుంభయుగళాదుధృత్య తోయం శిరః*
*సించంతం కరయోర్యుగేన దధతం స్వాంకే సకుంభౌ కరౌ |*
*అక్షస్రజ్ఞ్గమృగహస్తమంబుజగతం మూర్ధస్థ చంద్రస్రవత్*
*పీయూషార్ద్రతనుం భజే సగిరిజం త్ర్యక్షం చ మృత్యుంజయమ్ ||*
*పరమేశ్వరుడు తన రెండు చేతులతో రెండు కలశాలను తీసుకుని, మిగిలిన రెండు చేతులతో ఆ కలశములలోని నీటితో తనను ప్రోక్షణ చేసుకున్నారు. తరువాత, కలశాలను ఒడిలో వుంచుకున్నారు. మిగిలిన రెండు చేతులలో రుద్రాక్షను, మృగముద్రను బట్టి పద్మాసనములో కూర్చుని వున్నారు. తలమీద ఉన్న చంద్రుని నుండి పడుతున్న అమృతముతో ఆ స్వామి శరీరము ఎల్లప్పుడూ తడిసి వుంటోంది. మూడు కళ్ళు కలిగి వున్నాడు. మృత్యుంజయ స్వామి ప్రక్కన పర్వతరాజు కూతురు అయిన ఉమ దేదీప్యమానమైన కాంతులతో కూర్చుని వుంది.*
*ఈ విధంగా మృత్యుంజయ ధ్యానం దధీచి కి చెప్పిన తరువాత శుక్రాచార్యుడు శంకర భగవానుని తలచుకుంటూ తన స్థానానికి వెళ్ళాడు. శుక్రాచార్యుని మాట ప్రకారం, శివ ధ్యానం చేసి మహామృత్యుంజయ మంత్రమును జపిసిస్తూ దీర్ఘ కాలం శివభగవానుని కోసం తపస్సు చేసాడు దధీచి మహర్షి. దధీచి మహర్షి ఏకాగ్ర ధ్యానానికి మెచ్చి సదాశివుడు ప్రత్యేక్షమై వరం కోరుకోమంటాడు. తన ఎదుట నిలిచిన స్వామి కి సాగిలపడి, దధీచి మహర్షి తన వెన్నెముక వజ్రం తో సమానంగా అవ్వాలని, ఎవరి చేతనూ వధింపబడ కూడదని, ఎప్పుడూ కూడా దీనత్వము రాకూడదని మూడు వరాలు అడిగాడు. భోళాశంకరుడు సంతోషంగా ఆ వరాలు దధీచి మహర్షి కి ఇచ్చారు.*
*ఆవిధంగా వరాలు పొందిన దధీచి మహర్షి, క్షువ మహారాజు వద్దకు వెళ్ళి, తనకు వున్న వరాలను తలచుకొని, తన కాలితో మహారాజు ను తలపై తన్నాడు. కోపం పట్టలేని క్షువుడు మహర్షి పైకి వజ్రాయుధంతో సమానమైన ఆయుధాన్ని ప్రయోగిస్తాడు. కానీ, ఈశ్వర కృప వల్ల దధీచి కి ఏవిధమైన నష్టం జరుగదు. అప్పుడు క్షువుడు వనాలకు వెళ్ళి, ముకుందుని గూర్చి ఘోర తపము చేస్తాడు. క్షువుని తపస్సు మెచ్చిన విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఏమి కావాలి అని అడిగారు. "ప్రభూ! ఇంతకు మునుపు నాతో స్నేహం గా వుండే దధీచి మహర్షి, మృత్యుంజయ స్వామి వల్ల కలిగిన వరగర్వముతో నా తల మీద గట్టిగా తన్ని అవమానించాడు. నాకు ఎవరివల్ల భయము లేదు అని గర్వ పడుతున్నాడు." అని క్షువుడు చెప్పాడు.*
*దధీచి మహర్షి ఎవరితోనూ చంపబడక పోవడానికి మృత్యుంజయ మంత్ర ఫలమే కారణము అని తెలుసుకుని, విష్ణుమూర్తి, "మహారాజా, స్వంతంగానే బ్రాహ్మణులు దేనీకి భయపడరు. ఆపైన మృత్యుంజయ మంత్ర మహిమ కూడా కలసింది. కాబట్టి నేను కూడా దధీచిని ఏమైనా చేద్దామంటే నాకు కూడా శాపం ఇవ్వగల సమర్థుడు దధీచి. అందుకని, నీకోసం, నేనే ఒంటరిగా గెలిచే ప్రయత్నం చేస్తాను. నీవు శాంతం చెంది ఇంటికి వెళ్ళు" అని విష్ణుమూర్తి సర్ది చెపుతారు.*
 *ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు