*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - ద్వితీయ (సతీ) ఖండము-(0168)*
 *ఆశ్వయుజ మాస శుభాకాంక్షలతో...*
బ్రహ్మ, నారద సంవాదంలో.....
 *దధీచి - విష్ణువు, దేవతలకు శాపము ఇచ్చుట - క్షువుని అనుగ్రహించుట*
*నారదా! క్షువుని ప్రార్థన మీద విష్ణుమూర్తి క్షువునికి మంచి చేయాలని దధీచి మహర్షి ఆశ్రమానికి బ్రాహ్మణ వేషంలో వెళ్ళారు. దధీచి మహర్షి ని చూచి "శివభక్త శ్రేష్ఠా! నీవు నాకు ఒక వరము ఇవ్వాలి" అని అడిగారు.  సదా మృత్యుంజయము చదువుతూ శివ ధ్యానం లో వుండే దధీచి వచ్చినవారు బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణుమూర్తి అని గుర్తు పట్టి, "నీవు విష్ణుమూర్తివి అని నాకు తెలుసు. నీ మాయలు చాలించి నీ అసలైన విష్ణు రూపంలో నాకు కనిపించు. నేను ఎప్పుడూ శివ ధ్యానము లో వుంటాను అందువల్ల నాచేత ఎవరికీ అపకారము జరుగదు. నేను ఎవ్వరికీ భయపడను." అని చెప్పాడు.*
*అప్పుడు, విష్ణుమూర్తి " దధీచి మహర్షి నీవు చాలా గొప్ప వ్రతాన్ని పాటిస్తావు. నీవు శివపూజా దురంధరుడవు కనుక నీకు శాశ్వతముగా భయము దూరమైంది. కానీ, నీవు అన్నీ తెలిసిన వాడవు. నామాట మీద ఒక్కసారి క్షువ మహారాజు తో నేను నీకు భయపడుతున్నాను అని చెప్పు మహర్షీ " అన్నారు. "దేవాధిదేవుడు, పినాకపాణి నా చెంతనే వున్నారు. నేను ఎప్పుడూ ఎవరికీ భయపడను. భయపడినట్లు నటించను" అన్నాడు దధీచి. దీనికి ప్రతిగా విష్ణుమూర్తి, దధీచిని అణచివేయాలి అని నిశ్చయించుకొని, దేవతా సమూహముతో కలసి భీకర యుద్ధం చేస్తారు. కానీ, పరమేశ్వర కృప వల్ల దధీచి అన్ని వాడి బాణాలను, ఇతర అస్త్ర శస్త్రాలను ఎదుర్కొని విజయుడుగా నిలుస్తాడు.*
*అప్పుడు తన నిజ రూపాన్న ప్రకటిస్తారు, విష్ణుమూర్తి. దధీచి, "మహాత్మా! పరంధామా! శివ మహాదేవుని దయవలన నేను భూత భవిష్యత్ వర్తమానాలను, ఇతరులు ఎవరూ తెలుసుకోలేని ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. మీకు దివ్య దృష్టిని ఇస్తున్నాను. మీరు, మీతో గూడా సకల చరాచరములను నాలో చూడండి." అని చెప్పాడు. అప్పుడు, ఆది దేవుడైన వృషభారూఢుని దయతో, దధీచి దేహమంతా బంగారు కాంతులతో మెరసి పోతూ, తనలో మొత్తం బ్రహ్మాండం అంతా చూపిస్తాడు. విష్ణు భగవానుడు మరల దధీచి మీదకు వెళతారు. ఇంతలో, క్షువ మహారాజు అక్కడికి తన పరివారంతో వస్తాడు. బ్రహ్మ నైన నేను విష్ణువు, మిగిలిన దేవతలను దధీచి పైకి వెళ్ళ కుండా ఆపాను. నా మాట మీద వారు యుద్ధం ఆపుచేసారు. విష్ణుమూర్తి దధీచి వద్దకు వెళ్ళి, ఆయనలో కనిపిస్తున్న శివ భగవానుడికి నమస్కరించారు.*
 *ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు