*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - ద్వితీయ (సతీ) ఖండము-(0170)*
 *నరక చతుర్దశి, దీపావళి శుభాకాంక్షలతో...*
🪔🪷🪔🪷🪔🪷🪔🪷🪔
బ్రహ్మ, నారద సంవాదంలో.....
 *దేవతలు, బ్రహ్మ విష్ణులోకమునకు వెళ్ళి - తమ దుఃఖమును చెప్పడం - శివుని ప్రార్ధించమని చెప్పి - వారితో కలసి కైలసమునకు వెళ్ళి - శివుని కలియుట*
*నారదా! ఆవిధంగా బ్రహ్మ, మిగిలిన దేవగణములతో కలసి విష్ణుమూర్తి కూడా తన ఆరాధ్య దైవం అయిన సదాశివుడు కొలువైన ఆనంద నిలయము అనబడే కైలాసానికి ప్రయాణం అయ్యారు. శివునికి కైలాసము అత్యంత ప్రియమైన ప్రదేశం. మానవులు తక్క మిగిలిన దేవతా గణములు, యక్షులు, కిన్నెరలు, కింపురుషులు ఆ పరమేశ్వర దివ్యనిలయాన్ని కొలుస్తూ వుంటారు. ఈ కైలాసానికి అతి దగ్గర లో రుద్రదేవుని ప్రియ మిత్రుడు కుబేరుని అలకాపురి నగరం, సౌగంధికా వనము వున్నాయి. ఈ సౌగందికా వనానికి ఆవల నంద, అలకనంద అని పిలువబడే దివ్యమైన నదులు ప్రవహిస్తున్నాయి. కుబేరుని అలకపురి, సౌగంధిక వనము, నంద, అలకనంద వీటిని చూచిన మాత్రముననే అన్ని పాపములు తొలగిపోతాయి అని ప్రతీతి. ఈ కమనీయ రమణీయ సుందర ప్రకృతి వింత శోభలను చూస్తూ విష్ణుమూర్తితో దేవతా సమూహము, మహర్షులు, మునులు కైలాస పర్వత ప్రాంతానికి చేరువలో వున్న, శంకరుడు నిరంతరము ధ్యాన ముద్రలో కూర్చునే వట వృక్షాన్ని చూస్తారు.*
*శంకరునికి అతి ప్రీతికరమైన ఈ వట వృక్షము నాలుగు వైపులా దృఢమైన ఊడలతో విస్తరించి, వంద యోజనముల ఎత్తుతో తనకు సభక్తికంగా నమస్కరించిన వారికి ఆహ్లాదకరంగా వుంటుంది. ఈ వట వృక్షశాఖలు డెబ్బై అయిదు యోజనములు విస్తరించి వుంటాయి. ఎండవేడిమి ఆ ప్రాంతంలో కనబడదు. ఎంతో పుణ్యము చేసుకుంటే తప్ప, ఈ వట వృక్ష దర్శన భాగ్యం కలుగదు. ఇది పరమేశ్వరుని యోగస్థలము. పరమయోగులు, మహర్షులు ఈ వృక్షాన్ని సేవిస్తూ వుంటారు. ఎంతో ఉత్తమమై, మోక్షము కోరుకునే వారికి తన వద్ద చోటు ఇస్తుంది. పరమ శివభక్త పరాయణులు, సిద్ధులు, సనకసనందనాదులు సేవించుటకు సిద్ధంగా వున్న రుద్రదేవుని దర్శించుకున్నారు, విష్ణువు మొదలగు వారు అందరూ.*
*కుశలతో తయారు చేయబడిన ఆసనము మీద కూర్చున్న శివుని మంగళకర రూపము అతి శాంతముగా, తపస్వులకు ప్రియమైన సుందర రూపముతో కనిపిస్తోంది. కుబేరుడు కూడా ఆ స్వామి సేవకై వచ్చి ఉన్నాడు. భస్మలేపుడు అయిన ఆ స్వామి తర్క ముద్రలో సుందరేశ్వరుడిలా కనిపిస్తున్నారు.  ఈ రూపాన్ని చూచి నమస్కరించిన మమ్మల్ని చూచి, దయామయుడైన స్వామి కూడా లేచి నిలబడి నాకూ, విష్ణువుకు నమస్కరించారు. ఆ తరువాత దేవతా గుణముల చేత, సిద్ధులు, కిన్నెర, కింపురుషాదులచేత బ్రహ్మ, విష్ణు, రుద్రుల నమస్కారములు అందుకునే ఆదిశివుడు, విష్ణుమూర్తి సంభాషణ చేయడం మొదలుపెట్టారు.*
 *ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు