*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - ద్వితీయ (సతీ) ఖండము-(0171)*
 *కార్తీకదామోదర మీనాక్షీ సుందరేశ్వరుల అనుగ్రహం పరమేశ్వర ఆత్మబంధువులు అందరకీ కలగాలని ప్రార్ధిస్తూ......*
🪔🪷🪔🪷🪔🪷🪔🪷🪔
బ్రహ్మ, నారద సంవాదంలో.....
 *దేవతలు, బ్రహ్మ కైలాసమునకు వెళ్ళి - పరమేశ్వరుని స్తుతి చేయడం - దేవతలకు, దక్షునికి వరమొసగుట - యజ్ఞ మండపము నకు వెళ్ళి దక్షుని సజీవుని చేయుట - అందరితోనూ ఆ స్వామి స్తుతింపబడుట*
*"దేవదేవా, పరమేశా! మీ శరీరమును ఎనిమిది భాగములుగా విభజించి ఈ చరాచర సృష్టి పాలన చేస్తారు, మీరు. అందువల్లనే మీరు "అష్టమూర్తి" అయ్యారు. మీరే పరాత్పరులు, సర్వవ్యాపి, విశ్వమూర్తి. భానులు, భైరవులు, శరణాగత వత్సలురు, త్ర్యంబకులు, గుణాత్మకులు అయిన మీకు నమస్కారము. సూర్యుడు, చంద్రుడు, అగ్ని మీ మూడు కన్నులు. మీరు మీ తేజస్సుతో సకల ప్రపంచ మందు వ్యాపించి ఉన్నారు. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఇంద్రుడు, చంద్రుడు మొదలగు దేవతలు అందరూ మీ నుండే జన్మించారు. మీరే సమస్తమునకు ఆదికారణము. మీ ఆజ్ఞ మేరకే గాలి వస్తుంది, సూర్యుడు వెలుగునిస్తాడు, అగ్ని మండుతుంది, యమదేవుడు అన్ని వైపులకు పరుగులెత్తి సమధర్మాన్ని పాటిస్తాడు. మీరు మాకు ప్రసన్నులు అవ్వండి. ఇప్పటి పూర్వము ఎన్నో మార్లు మమ్మల్ని ఆపదల నుండి కాపాడారు. ఇప్పుడు మాకు వచ్చిన ఈ ఆపద నుండి మీరే కాపాడ గలరు. ప్రజాపతి అయిన దక్షుని ఇంట జరిగిన యుద్ధంలో కష్టాలు అనుభవించిన వారిని అందరినీ కరుణించి కాపాడండి. దక్షుని పునర్జీవితుణ్ణి చేయండి. దేవతలందరినీ వారి వారి బాధలనుండి దూరం చేయండి. యజ్ఞ కార్యము పూర్తి చేసే అవకాశం కల్పించండి. యజ్ఞ భాగము మీకు ఒక్కరికే చెందుతుంది. మీరు యజ్ఞ భాగము తీసుకోవడం వల్లనే ఆ యజ్ణము సంపూర్ణము, సఫలము అవుతుంది" అని పరాత్పరుని వేడుకుంటూ, ఆయన క్షమను అర్ధించాము. ఆ స్వామి కి సాష్టాంగ దండము చేసి మరీ మరీ వేడుకున్నాము.*
*మా ప్రార్ధనలు విన్న అంబాపతి మా పట్ల ప్రసన్నుడు అయి, మాకు ఇలా తన అనుగ్రహం అందించాడు. "బ్రహ్మ, విష్ణు దేవులారా! సత్యములు అయిన నామాటలు వినండి. దక్ష యజ్ఞమును నేను నాశనము చేయలేదు. స్వయముగా దక్షుడు ఎల్లప్పుడూ ఇతరులను ద్వేషిస్తూ వుంటాడు. ఇతరులతో మనము ఎలా వ్వహరిస్తామో, అదే ఫలితంగా మనకు వస్తుంది. అందువల్ల దక్ష యజ్ఞ వినాశనం జరిగింది. ఎప్పుడూ కూడా ఇతరులకు కష్టము, నష్టము కలిగించే పనులు చేయరాదు.*
*శ్లోకం:- పరం ద్వేష్ఠి పరేషాం యదాత్మాన స్తద్ భవిష్యతి | పరేషాం క్లేదనం కర్మ న కార్యం తత్కదాచన ||*
                                  ( శి.పు.రు.సం.స.ఖ.42/5-6)
*కాలిపోయిన దక్షుని తల స్థానంలో, మేక తల అమర్చబడుతుంది‌ భగదేవుడు, మిత్రుని కన్నులతో యజ్ఞ భాగాన్ని చూస్తాడు. దంతములు విరిగి పోయిన పూషదేవుడు, యజమాని దంతములతో యజ్ణాన్నమును నమిలి మింగ గలుగుతాడు. పోయిన భృగుని గడ్డము స్థానంలో మేక గడ్డము అమర్చబడుతుంది. యజ్ఞ భాగంగా యజ్ఞములో మిగిలిన వస్తువులను నాకు ఇచ్చిన దేవతలు అందరూ వారి వారి శరీర భాగములతో సుఖముగా ఉంటారు. విరిగిపోయిన భుజాములు కల అధర్వుడు మొదలగు యాజ్ఞీకులు అశ్వినీ కుమారుల భుజములతో, చేతులు కోల్పోయిన వారు పూష కుమారుని చేతులతో వారి వారి వపనులు చేసికొందురు గాక అని అందరినీ అనుగ్రహించారు, పరమేశ్వరుడు.*
ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు