*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - తృతీయ (పార్వతీ) ఖండము-(0175)*
 *కార్తీకదామోదర మీనాక్షీ సుందరేశ్వరుల అనుగ్రహం పరమేశ్వర ఆత్మబంధువులు అందరకీ కలగాలని ప్రార్ధిస్తూ......*
🪔🪷🪔🪷🪔🪷🪔🪷🪔
బ్రహ్మ, నారద సంవాదంలో.....
*తృతీయ - పార్వతీ ఖండము - ప్రారంభము*
*హిమాలయ - స్థావర జంగమ - దివ్యత్వ వర్ణన - హిమవంత, మేనకల వివాహము - మేనక తదిదతరులకు సనకసనందనాదుల శాపము - వరదానము*
*నారదుడు:- బ్రహ్మ దేవా, దక్షుని యజ్ఞ సమయంలో శరీరమును త్యాగం చేసిన జగదంబ సతీదేవి, గిరిరాజ పుత్రిక ఎలా అయ్యింది. ఆమె మరల శివుని భర్తగా ఎలా పొందింది.*
*నారదా! మొదట పార్వతీ మాత జననము, వైవాహిక చరిత్ర తెలుపుతాను, విను. ఉత్తర దిశలో పర్వతము లకు అన్నిటికీ రాజుగా గుర్తింపు తెచ్చుకున్నవాడు, హిమవంతుడు. ఇతడు, పర్వత రూపములో వున్న ఎంతో తేజ సంపన్నుడు, సమృద్ధిగా ఎదిగిన వాడు. స్థావరము జంగమము అనే రెండు రూపాలలో వుంటాడు. హిమవంతుని స్థావర రూపము చాలా అందంగా వుండి, రత్న రాశులతో, ఔషధీ మూలికలతో, ప్రకృతి రామణీయకతతో, వుంటుంది. తూర్పు, పశ్చిమ సముద్రముల లోపల ప్రవేశించి భూమిని కొలిచే త్రాసు లాగా నిలబడి వుంటుంది. అనేక శిఖరాలు కలిగి, సింహములు, పులులు మొదలగు జంతువులు సుఖముగా తిరిగే ఈ హిమవత్పర్వతము ఎల్లప్పుడూ మంచుతో కప్పబడి ఉంటుంది. దేవతలు, రుషులు, సిద్ధులు, మునులు ఈ పార్వతమును ఆశ్రయించి పరమేశ్వరుని గురించి తపస్సు చేసుకుంటారు. ఈ హిమవత్పర్వతము రుద్రునికి చాలా ఇష్టమైన ప్రదేశం. సదాశివుడు కూడా తపస్సు చేసుకునే పుణ్య స్థలము. మహాత్ములను కూడా పావనులను చేస్తుంది.*
*ఒక సందర్భంలో హిమవంతుడు తన వంశ వృద్ధి కోసం, దేవతలకు, పితరులకు మంచి చేయడానికి, ధర్మవృద్ధి కోరుకుంటూ వివాహము చేసుకోవాలి అని నిశ్చయించుకుంటాడు. అప్పుడు దేవతలు అందరూ పితరుల వద్దకు వెళ్ళి, హిమవంతుడు తలపెట్టిన దేవకార్యము పూర్తి అవడానికి మీ పెద్ద కూతురు మేనకను హిమవంతునుకి ఇచ్చి వివాహము జరిపించమని దేవకార్య పరిపూర్ణత్వం కొరకు అడుగుతారు. పితరులు తమలోతాము చర్చ చేసుకుని హిమవంతుడు, మేనకల వివాహము విధి పూర్వకంగా జరిపిస్తారు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు