*అష్టావధానం* *నంబర్:-03*;-మమత ఐలహైదరాబాద్9247593432
1. సమస్యాపూరణం
*ధరణి యుసురు దీసె కరుణవీడి*

ఆ.వె
కరువు కాటకాలు దరువుతో ముంచంగ
పంటలన్ని బోయి పన్నుబెరిగె
భువిన నమ్మికంబు భవుడాపనెంచగన్
*ధరణి యుసురు దీసె కరుణవీడి*
2. 
దత్తపది:- 
కలము నెలవు కలత నలత

ఆ.వె
*కలము* చేతబూని కష్టంబునే తన
*నెలవు* గా తలచుచు నిశ్చలముగ
*కలత* చెందకుండ మలుపులెన్నోదాట
*నలత* లన్నిదీర్చు నమ్మహరుని

3.నిషిద్దాక్షరి:- మ ,త నిషేధంతో అమ్మవారి వర్ణన

క.
భువనేశ్వరి!శ్రీ కన్యక! 
రవళీ! శ్రీ కనకదుర్గ! రాధిక! శరణో
యవనిని పరిపాలించెడి
ధవళేశ్వర జనని నన్ను దయగను దేవీ!

4. న్యస్తాక్షరి:- 

1-6 తి
2-11 సె
3-15 కి
4-3 ను

పెట్టిన జోరు *తి* ప్పలకు వీరుల కిచ్చెడి శాపమీయకన్
పట్టుక పోయి వస్తువులు పా *సె* ము గాదని నీట వేసినన్
చెట్టుకు పూయుపూవులుగ జివ్వున యెట్టి *కి* తేలునేయనెన్
గుట్టు *ను* దాచలేరనుచు కోతుల నెంచుచు మౌని పల్కెనే

5. వర్ణన :- అతివృష్టిని (ఉ. వర్ణించాలి)

ఉ.
దండిగ మేఘ మందిరము దాడిని జేయగ పృథ్వి యందునన్
పండిన పంటచేను జడివానకు మున్గగ నిండ్లుసైతమున్
నిండెను బావి కుంటలును నెక్కడికక్కడ గట్లదాపుకున్
యెండలు జాడలేక రవి యెచ్చటికేగెనటంచువేడిరే

6. ఆశువు :-బతుకమ్మ
క.
తొమ్మిది రకములపూలను
తొమ్మిది దినములుగబేర్చి తోరణమై గౌ
రమ్మను వేడుచునాడన్
సమ్మతితో వీధి వీధి సందడియగులే

7. ఛందోభాషణం

ఇల వైకుంఠపురంబుగన్ దలువ మాయేదైన రావచ్చునో!
కలమే శక్తిని కూడగట్టుకొని సంగ్రామంబు సృష్టించునో!
సులువే భక్తికి ధర్మ మార్గమిడ దాసోహంబులో మున్గగన్
*కలడా దైవము కష్టకాలమున నా కన్నీరు గానండయో*

8. అంత్యాద్యక్షరి (న)

నిమ్మరసము ద్రావ నీరసంబు తొలగు
నమ్మకంబుతోడ నడకసాగు
నెమ్మదైన గుణము నీడనిచ్చు నెపుడు
నాడు నేడు గాని నగవు మేలు


కామెంట్‌లు