*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 069*
 *: దశావతార వర్ణనము - మత్స్యావతారము :*
*ఉత్పలమాల:*
*వారిచరావతారమున | వారధిలోఁజొరబారిఁ క్రోధ వి*
*స్తారగుడైన యా నిగమ | తస్రవీర నిశాచరేంద్రునిన్*
*జేరి వధించి వేదముల | చిక్కెడలించి విరించికిన్ మహో*
*దారత నిచ్చి తీవె గద | దాశరధీ ! కరుణాపయోనిధీ !* 
తా: భద్ర్రాద్రిపై కొలువుండి, కరుణా నిధివైన! దశరధరామా!   నీటిలోపల తిరిగే జీవి అయిన చేప అవతారము ఎత్తి, వేదములను దొంగిలించి సముద్రము అడుగున దాక్కుని వున్న సోమకాసుర రాక్షసుని వెతికి పట్టుకుని చంపి వేదములను చెర విడిపించి, తిరిగి మళ్ళీ బ్రహ్మ దేవునికి ఇచ్చింది నీవే కదా రామభద్రా!......అని భద్రాచల రామదాసుగా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*మానవ జాతి ఉద్ధరించడానికి, ధర్మానికి హాని కలిగిన ప్రతిసారీ, ఏదో ఒక రూపంలో జాతిని, ధర్మాన్ని ఉద్ధరిస్తూనే వున్నావు కదా, పరాత్పరా! ఈ ఉద్ధరించే కార్యక్రమం మత్స్యావతారంతో మొదలు పెట్టావు కాదా, మహాదేవా. అందువల్లనే నేమో "ఇందుకల డందు లేడని సందేహము వలదు. చక్రి సర్వోపగతుండు. ఎందెందు వెతికిన అందేకలడు" అని చెప్పారు పోతన గారు భాగవతంలో. అన్ని చోట్ల వుండటం నీకు సాధ్యమే, కారుణ్యధామా! కానీ, నిన్ను గుర్తించగలగటం కర్మ చక్షువులతో వున్న మాకు సాధ్యమా, కమలనాధా! నీవే కదా, మాకు దారి చూపి, ఒడ్డున పడవేయవలసిన వాడివి. కరుణించు కృపాకరా!.......*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు