*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 074*
 *: దశావతార వర్ణనము - పరశరామావతారము :*
*చంపకమాల:*
*ఇరువదియొక్క మారు ధర | ణీశుల నెల్లవధించి తత్కళే*
*బర రుధిర ప్రవాహమునఁ | బైతృక తర్పణమొప్పఁజేసి భూ*
*సురవరకోటికిన్ ముదము | సొప్పడ భార్గవరామమూర్తివై*
*ధరణినొసంగితీవె కద | దాశరధీ ! కరుణాపయోనిధీ !* 
తా: దశరధ పుత్రా! కరుణా సముద్రా! దశరధరామా!   
ఇరవై ఒక్క సార్లు ఈ భూమి మీద వున్న రాజులు అందరినీ జయించి, వారిని చంపగా వచ్చిన రక్తముతో నీ పితృ దేవతలకు, తల్లిదండ్రులకు తర్పణాలు ఇచ్చి వారిని తృప్తి పరచి, నీవు గెలిచిన భూమిని బ్రాహ్మణులకు దానమిచ్చి వారిని కూడా సంతోషపరిచినది, పరశరామావతారము ఎత్తిన అనంతపద్మనాభుడవు నీవే కదా!......అని భద్రాచల రామదాసుగా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*ధర్మానికి హాని కలిగినప్పుడు, అధర్మం మితి మీరి పోతున్నప్పుడు, ఆ సమయానికి అవసరమైన అవతారము ఎత్తి ప్రజలను అందరినీ, మరీ ముఖ్యంగా నీ భక్తులను కాపాడావు కదా, కారుణ్య ధామా.‌ రాజైన వాడు, ప్రభువుగా వుండాలి అనుకునే వాడు, ప్రజలు మెచ్చుకుని రాజువైపు వుండే విధంగా పాలన చేయాలి. తనను చూచి తన ప్రజలు మంచి మార్గంలో నడిచే విధంగా రాజు పాలన వుండాలి. కానీ, ఇలా కాకుండా, రాజులు అధర్మంగా నడుచుకున్నప్పుడు, నీవే మా అందరకూ సద్బుద్ధి కలిగించి, మంచి దారిలోనే మమ్మల్ని నడిపించు, నీరజాక్షా!.......*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు