*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 076*
 *: దశావతార వర్ణనము - బలరామావతారము :*
*చంపకమాల:*
*అనుపమయాదవాన్వయ సు | ధాబ్ధి సుధానిధి కృష్ణమూర్తి నీ*
*కనుజుడుగా జనించి కుజ | నావళనెల్ల నడంచి రోహిణీ*
*తనయుఁడనంగ బాహుబల | దర్పమునన్ బలరామమూర్తివై*
*తనరిన వేల్పు నీవెకద | దాశరధీ ! కరుణాపయోనిధీ !* 
తా: దశరధ పుత్రా! కరుణా సముద్రా! దశరధరామా!   
ఎనలేని కీర్తి కలిగిన యాదవ వంశమనే పాలకడలిని వుప్పొంగునట్లు చేయగల కృష్ణమూర్తి నీకు తమ్ముడుగా పట్టగా, రోహిణీ దేవి గారాల పట్టిగా పుట్టి, నీ భుజ బలముతో దుర్జనులను అందరినీ అణచివేసి బలరామమూర్తివై ఈ భూము మీద నడియాడిన దేవుడవు నీవే కదా, కారుణ్య ధామా!.....అని భద్రాచల రామదాసుగా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*త్రేతా యుగంలో ఆది శేషు నకు ఇచ్చిన వర ప్రభావము చేత ద్వాపరములో  ఆదిశేషుడు బలరామ చక్రవర్తి గా, విష్ణుమూర్తి శ్రీ కృష్ణ పరమాత్మగా, బలరామవదేవునకు తమ్మునిగా మానావులను ఉద్ధరించడానికి జన్మలు ఎత్తారు. యదు వంశుడైనా బలరాముడు, అర్తత్రాణ పరాయణత్వంలో తనకు తానే సాటి. అలాగే, తాను ఎవరి చేతనైనా మోస పోయాను అనే విషయం గ్రహిస్తే విపరీతమైన ఆగ్రహంతో మట్టుబెట్టే గుణం కూడా వుంది. ఆదిశేడు కదా!కలి ప్రభావం ఇక్కడే కనిపిస్తుంది. ఇంతటి ధీమంతుడైన బలరాముడు కూడా ముఖస్తుతికి పొంగిపోయి, అవతలి వారి యోగ్యతాయోగ్యతలు చూడకుండా వరములు ఇచ్చే లక్షణం కనబరుస్తాడు. ఇది ఇప్పుడు మన ఈ కలియుగంలో ప్రతి నిత్యం చూచే సర్వసాధారణమైన లక్షణం. రాజులు, అధికారం లో వున్నవారు ఈ లక్షణాన్ని తమ అలవాటు గా చేసుకోవడం వల్ల ఎన్నెన్నో కుటుంబాలు కష్టాల పాలు అవుతున్నాయి. ఈ అసంబద్ధమైన అలవాటు మనమందరం కు కలగకుండా వుండేలా పరాత్పరుడు అనుగ్రహించాలని వేడుకుంటూ.......*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు