*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 077*
 *: దశావతార వర్ణనము - బుద్ధావతారము :*
*చంపకమాల:*
*సురలు నుతింపగాఁ ద్రిపుర | సుందరులన్ వరియింప బుద్ధరూ*
*పరయఁగ దాల్చితీవు, త్రిపు | రాసురకోటి దహించినప్పుడా*
*హరునకుఁదోడుగా వరశ | రాసన బాణముఖోగ్ర సాధనో*
*త్కర మొనరించి తీవుకద | దాశరధీ ! కరుణాపయోనిధీ !* 
తా: దశరధ పుత్రా! కరుణా సముద్రా! దశరధరామా!   
దేవతలు అందరూ నిన్ను కీర్తిస్తూ వుండగా మూడు లోకాలలోని అందమైన స్త్రీలను వివాహం చేసుకోవడానికి బుద్ధుని రూపంలో వచ్చిన వాడివి, త్రిపురములలో వున్న రాక్షస సమూహాన్ని చంపడానికి అవసరమైన కొన తేలిన వాడి బాణాలను శివునికి ఇచ్చినది కూడా నీవే కదా కోదండరామ!.....అని భద్రాచల రామదాసుగా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*రాబోయే కలికాలంలో ఒకరితో ఒకరికి శత్రుత్వం, ఈర్ష్య, అసూయలు ఎక్కువగా మానవుల స్వభావం లో చేరతాయి అని తెలిసిన వారు కనుక పరాత్పరుడు, నలుగురితో కలసి బతకడం, నలుగురి మంచిలో మన మంచిని, ఎదుటి వారి ఆనందంలో మన ఆనందాన్ని చూసుకుంటూ, ఒకరికి ఒకరుగా అందమైన సహజీవనం చేయ వలసిన అవసరాన్ని తెలియ చెప్పడానికి, సంపదలు, సౌఖ్యాలు, ఇల్లు, ఇల్లాలు, పిల్లలు శాస్వతం కాదనీ, ఎల్లప్పుడూ మనతో వుండరనీ, పుట్టేటప్పుడు మనం ఒకరమే. కట్టె కాలేడప్పుడూ మనం ఒక్కరమే అనే సత్యాలను మానవ జన సమూహానికి అర్ధమయ్యే విధంగా చెప్పడానికి వచ్చిన ఆనందమయ అవతార రూపం "బుద్ధావతారం". రామావతారంలో ఎలా అయితే తాను ఆచరించి మనకు చూపారో పరమాత్మ, ఈ బుద్దావతారంలో కూడా అలాగే తాను ఆచరించి మనకు విశిదంగా వివరించి చూపారు. బుద్ధుని అంత శాంత స్వభావులం మనం కాకపోయినా, మన జీవితాన్ని మలచు కోవడానికి అవసరమైన శాంత స్వభావాన్ని అలవరచుకునే లక్షణాన్ని మనకు అనుగ్రహించాలని ఆ సర్వేశ్వరుని వేడుకుంటూ.......*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు