*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 080*
 *చంపకమాల:*
*ముదమున కాటపట్టు భవ | మోహమదద్విరదాంకుశంబు సం*
*పదల కొటారు కోరికల | పంట పరంబున కాది వైరుల*
*నదన జయించు త్రోవ విప | దబ్ధికి నావఁగదా సదాభవ*
*త్సదమలనామ సంస్మరణ | దాశరధీ ! కరుణాపయోనిధీ !* 
తా: దశరధ పుత్రా! కరుణా సముద్రా! దశరధరామా!   
ఎల్లప్పుడూ నీ పేరు తలచుకుంటూ వుండటం వలన, అది మాకు ఆనందమును కలిగిస్తుంది. సంసార మోహము అనే మదపుటేనుగుకు అంకుశంలాగా పనిచేస్తుంది. కోరుకున్న కోరికలు అన్నీ తీర్చుతుంది. మోక్షము పొందడానికి దారిలో వచ్చే శత్రువల సమూహము అనే నదిని దాటడానికి నావలాగా ఉపయోగపడుతుంది!.....అని భద్రాచల రామదాసుగా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*"కలౌ నామ స్మరణే ధన్యోపాయం" అన్నారు కదా! ఆ నామ స్మరణ ప్రాభవాన్ని, ప్రభావాన్ని ఇక్కడ చెప్తున్నారు కవి మనకు. నిరంతరం మనం భగవన్నామ స్మరణ చేయడం వల్ల మన ఆలోచనలు మంచివిగా వుంటూ, మనల్ని మంచి పనులు చేయడానికి ప్రోత్సహిస్తాయి. మన ఆలోచనలు చక్కగా వుండటం వల్ల మనం ఎదుటి వారికి సంతోషాన్ని కలిగించే, నలుగురికి ఉపయోగించే పనులు చేస్తూ మనం కూడా అలౌకికమైన ఆనందం పొందుతాము. ఈ అలౌకికమైన ఆనందం మనం పొందగలిగిన అప్పుడు, మనం పరమాత్మునికి చాలా దగ్గరగా ఉన్న అనుభవం పొందుతాము. మనసు తేలికగా, చిదానందునికి దగ్గరగా వున్న వాని ముఖము కూడా ఎంతో ఆహ్లాదకరంగా వుంటుంది. చూచిన నలుగురు వాని పట్ల ఆకర్షితులు అవుతారు. ఇటువంటి ఆనందకరమైన స్థితిని మనకందరకూ కలిగించమని ఆ వైకుంఠ ధాముని, నిశాచరపతిని వేడుకుంటూ......*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు