*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 081*
 *చంపకమాల:*
*దురిత లతానుసారి భయ | దుఃఖ కదంబము రామనామ భీ*
*కరతర హేతిచేఁదెగి వి | కావికలై చనకుండ నేర్చునే*
*దరికొని మండుచుండు శిఖి | దార్కొనినన్ శలభాదికీట కో*
*త్కరము విలీనమై చనవె | దాశరధీ ! కరుణాపయోనిధీ !* 
తా: దశరధ పుత్రా! కరుణా సముద్రా! దశరధరామా!   
పాపములు అనే తీగను పట్టుకుని వచ్చే భయము, దుఃఖముల సమూహము రామనామము అనే భయంకరమైన కత్తి వేటుతో విడివిడిగా తెగి పడిపోకుండా వుండలేవు. ఎలాగంటే, భగ భగ మండుతున్న కట్టె మీద పడినప్పుడు మిడతల గుంపు వంటి కీటకాల సమూహము నాశనము అవుతాయి కదా, అలాగే !.....అని భద్రాచల రామదాసుగా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*ఎంతటి భయంకరమైన కష్టాలు అయినా మనస్పూర్తిగా రాముని తలచుకుంటే కచ్చితంగా తొలగి పోవలసిందే. ఈ విషయంలో ఎటువంటి అనుమానమూ మనం పెట్టకోనక్కర లేదు. విరాట రాజు కొలువులో ద్రౌపదికి కీచకుని రూపంలో కష్టం వస్తే, తన అన్న కృష్ణుని తలచుకుంటే కష్టం తొలగిపోయే మార్గం భీముని రూపంలో వసంత మడపంలో చూపించాడు కదా! సుగ్రీవుని కి తన అన్న వాలి వలన కష్టం వస్తే శ్రీరాముడు పురోహితుని రూపంలో వున్న ఆంజనీ కుమారుని గుర్తించి సుగ్రీవుని రక్షణ చేసాడు కదా! మార్కండేయుని భక్త తత్పరతకు మెచ్చి శివ భగవానుడు యమపాశం నుండి కాపాడి అమరత్వం ఇచ్చాడు కదా! అటువంటి నిశ్చలమైన భక్తి మనకందరకు అనుగ్రహించాలని ఆ ఆదిపురుషుడు, జగత్పిత అయిన సదాశివుని ప్రార్థిస్తూ ......*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు