*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 084*
 *చంపకమాల:*
*కరములు మీకు మ్రొక్కులిడ | కన్నులుమిమ్మునెచూడ జిహ్వమీ*
*స్మరణను దనర్ప వీనులును | సత్కథలన్ వినుచుండ నాసమీ*
*యరుతను బెట్టు పూసరుల | కాసగొనన్ బరమాత్మ సాధనో*
*తర్కమిది చేయవేకృపను | దాశరధీ ! కరుణాపయోనిధీ !* 
తా: దశరధ పుత్రా! కరుణా సముద్రా! దశరధరామా!   
మా శరీరములో చేతులు నీకు నమస్కారం చేయడానికి, కన్నులు నీ అందమైన రూపము చూడడానికి, నాలుక నీ నామస్మరణ చేయడానికి, చెవులు నీ కథలు వినడానికి, ముక్కు పుటాలు నీకు అలంకరించే పూలమాలల వాసనలు చూడడానికి పరమాత్మ సాధనకి పనికిరావాలి అని నీవు మమ్మల్ని కృపతో చూడు స్వామీ!.....అని భద్రాచల రామదాసుగా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*"ఇంద్రియ నిగ్రహం", గురించి చెప్పిన వారే, కన్ను, ముక్కు, చెవులు, చేతులు, నోరు అనే పంచేద్రియాలు భగవంతుని సేవలో ఉపయోగించ బడాలి కానీ, మానవుల సేవలో కాదు, అని కూడా చెప్పారు. ఈ ఐదు ఇంద్రియాలను అదుపులో వుంచు కోవడం ఎంత ముఖ్యమో, సద్వినియోగం చేయడం కూడా అంతే ముఖ్యం. తోటి మానవులను, మనం ఉద్యోగం చేసే చోట అధికారులను ఎంత కీర్తించినా పొగిడినా ఇసుమంతైనా ఫలితం రాదు. అలాగే, మనం మిత్రులు అనుకునేవారిని, సహపంక్తి లో వున్మవారిని పొగిడి నప్పుడు కూడా ఫలితం శూన్య సమానమే. కానీ, ఈ పంచేద్రియాలు ఉపయోగించి పరమాత్ముని సేవలో మనసు లగ్నం చేయ గలిగితే, భగవత్కృప కలుగుతుంది. ఆ విధంగా, మన ఇంద్రియాలు అన్నీ తన సేవలో వుండేటట్లు, తానే అనుగ్రహించాలని ఆ సర్వేశ్వరుని ప్రార్ధిస్తూ ......*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు