పొదుపు అలవాటు చేయాలి...!;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 పిల్లలను వాళ్ల తల్లిదండ్రులు అమితంగా ప్రేమిస్తూ ఉంటారు. అందుకే పిల్లలు ఏది కోరినా తక్షణం వారి ముందు ఉంచే ప్రయత్నాన్ని చేస్తుంటారు. దాంతో పిల్లలకు గారాబం మరి కాస్త ఎక్కువవుతుంది.అందువల్ల వాళ్ళు మొండిగా తయారవుతారు. వారు  కోరుకున్నది ఏదైనా వారికి అందించకపోతే అన్నం తినడం మానేసి, అలక పాన్పుని ఎక్కేస్తారు. తర్వాత వారికి నచ్చ చెప్పడం, బుజ్జగించడం
షరా మామూలే. ఏదో అది చిన్నప్పుడైతే పర్వాలేదు కానీ పెద్ద అయ్యాక కూడా వారు ఇదే మొండితనాన్ని కొనసాగిస్తూ పోతే, అవసరాలకు మించిన ఖర్చులను చేస్తూ బాధ్యత మరిచి వ్యవహరిస్తూ పోతే...
అప్పుడు పరిస్థితి ఏంటి మరి?
పిల్లల అవసరాలను తల్లిదండ్రులు తెలుసుకొని వారికి సదుపాయాలు కూర్చడం అనేది మంచి పద్ధతే కానీ పిల్లలపై ఉన్న పిచ్చి ప్రేమతో వారు అడిగిన వస్తువులనల్లా వారికి కాదనకుండా కొని పెట్టడం మాత్రం తప్పే. సాధారణంగా మన చుట్టుపక్కల పిల్లలు ఎవరైనా స్కూల్ కి వెళ్లేటప్పుడు మీరు గమనించి గానీ ఉంటే వారి జోబులో డబ్బులను వుంచి ఇంటర్వెల్ సమయంలో ఏదో ఒక వస్తువుని కొనుక్కుని తినమని చెప్పడం సహజంగానే చేస్తూ ఉంటారు వాళ్ల తల్లిదండ్రులు.
అదే కాలేజీకి వెళ్లే పిల్లలకైతే పాకెట్ మనీ అంటూ నెలకోసారి బాగానే ముట్ట చెపుతుంటారు. ఇలా 
చిన్న వయసు నుంచి డబ్బులను వాళ్ళ చేతులకు అందించడం వల్ల వాళ్లకు డబ్బు విలువ తెలియకుండా పెరుగుతారు. ఇలాంటి దురలవాటుని వారి వ్యక్తిత్వంలో భాగంగా చేసుకుని ఎదుగుతారు.
పరిమితులు లేకుండా డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఆర్థిక సమస్యల్లో చిక్కుకొని ఆ పై ఎంతో క్షోభకు గురి అవుతారు. ఇలాంటి పరిస్థితులు వచ్చాక బాధపడితే లాభం ఏముంటుంది చెప్పండి... అందుకే ముందుగానే కాస్త అప్రమత్తం అవ్వండి.
పిల్లల నడవడికలో ఎక్కువ శాతం తల్లి ప్రభావమే ఉంటుంది. ఎందుకంటే పిల్లలకు తల్లి దగ్గర చనువు ఎక్కువ అందుకే ఆమె ఏ మాట అయినా అర్థమయ్యేలా చెప్తే వింటారు. పిల్లలకు తల్లులు చిన్న వయసు నుంచే డబ్బులను పొదుపు ఎలా చేయాలో నేర్పించాలి. ఉన్న 5 రూపాయిలలో రెండు రూపాయలను ఖర్చు చేసి మిగతా మూడు రూపాయలు ఆదా చేయడాన్ని వారికి నేర్పించాలి. అనవసరమైన వస్తువులను కొనడంలో డబ్బులను వృధా చేయకుండా
కేవలం అవసరానికి సరిపడ్డ వాటినే కొనుగోలు చేసేలా వారిని మలచాలి.
పిల్లలు పెద్దలు చేసే ప్రతి పనిని సూక్ష్మంగా గమనిస్తూ ఉంటారు కనుక వారి కంటికి కనిపించేలా మనం ఆదాయం చేస్తున్న పద్ధతిని వారి స్పృహకు తెస్తే వారు తప్పక మారి ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కగలుగుతారు. మరి అందరూ ఆచరిస్తారు కదూ....


కామెంట్‌లు