మొండితనం వద్దు;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 సాధారణంగా పిల్లలు మొండి పట్టు విడవాలంటే వారు అడిగింది ఇచ్చి తీరాల్సిందే.
ఎందుకంటే మన గారాబం అలాంటిది మరి. పిల్లలు కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఎల్లప్పుడూ అత్యుత్సాహంతో ఉంటారు.
వారి కంటికి ఏది కొత్తగా కనిపించినా దానిని వారి తరహాలో పరీక్షించి తీరాల్సిందే అప్పుడే వారు తృప్తిపడతారు. పిల్లలు వాళ్లంతట వాళ్ళు ఏ విషయాన్ని తెలుసుకోలేరు ఆ పసితనంలో వారికి ఏదో ఒక మాధ్యమం కావాలి. ఆ మాధ్యమంగా వ్యవహరించేవారు తల్లిదండ్రులు. కాదంటారా చెప్పండి...పిల్లలు ఆటలు పాటల్లో ఎప్పుడూ నిమగ్నమై ఉంటారు వారి దృష్టి కొంతసేపు ఒక దానిపై ఉంటే, మరి కొన్ని నిమిషాలకే మరో దానిపై మళ్లుతుంది. అందుకే వీళ్ళను ఏమార్చడం చాలా తేలిక. అయితే కొంతమంది పిల్లలు
మితిమీరిన మొండితనంతో వ్యవహరిస్తూ ఉంటారు. అయితే వీళ్ళను మన దారిలోకి తెచ్చుకునేది ఎలాగంటారు...? నాలుగు దెబ్బలు తగిలిస్తే వాళ్లే మారిపోతారా? లేదా దండించి వారిని మార్చగలుగుతామా అంటే కానే కాదు. వారి  ప్రవర్తనకు కారకులు తల్లిదండ్రులే కనుక వారిని మార్చే బాధ్యత కూడా తల్లిదండ్రులదే. ఇది తప్పు, ఇది ఒప్పు అంటూ వారికి అర్థమయ్యేలా ఉదాహరణలతో చక్కగా పిల్లల పక్కన కూర్చుని వాళ్లతో సమయాన్ని వెచ్చించాలి. వాళ్లతో ఎక్కువ సేపు మాట్లాడడం, ఆటలాడడం చేస్తూ మెల్లగా వారు మీ మాట వినేలా చేసుకుని తర్వాత వారిని మార్చాలే తప్ప. క్షణికావేశంతో వారిపై చేయి చేసుకుని బాలల మనసులను బాధించకూడదు. పిల్లల విషయంలో అతి గారాబం పనికిరాదు.
మొక్కై వంగనిది మానై వంగునా అన్న సామెత వినే ఉంటారు అందుకే చిన్నతనంలోనే వీళ్లను మార్చేయాలి లేకపోతే పెద్దయ్యాక కష్టమే.ఆ కష్టం మీకు ఇష్టమా కనుకనే నా మాటలు గుర్తుపెట్టుకొని పాటిస్తే సరి..కామెంట్‌లు